ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1(టాగ్ లైను ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
25-05-2013 (Chapter-45)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
***********************
(ఆగష్టు 1 సీరియల్ లో, నా మొదటి సీరియల్ నవల ముగ్ధమోహనంలో 'కార్తికేయ' పాత్ర ప్రత్యక్ష్యం కావటం పట్ల పాఠకుల హర్షాల అభిమానపు వర్షం దేశంలోనే అత్యధిక వర్షాలు పడే 'చిరపుంజి వర్షపాతాన్ని' గుర్తు చేసింది. ఈ సీరియల్ లో చంద్రహాస్ కథానాయకుడు...సాధారణంగా సీక్వెల్స్ లో, అపరాధ పరిశోధన నవలలలో ఇలాంటి పాత్రలు సాధారణంగా దర్శనమిస్తాయి. ఇదో అందమైన జ్ఞాపకపు ప్రయోగం...ముగ్ధమోహనం సీరియల్ పై మీరు చూపించిన అభిమానం ఇంకా నా అక్షరాల స్మృతి పథంలో సజీవంగా వుంది. ఆగష్టు 1 కథలో కథానాయిక ప్రణవిని కాపాడే ఓ ధీరోదాత్తుడు కావాలి. ఆ పాత్ర హీరో కాకూడదు..కానీ ఆ స్థాయి వుండాలి...కథానాయకుడి లక్షణాలు వుండాలి. ఏదో ఓ సహాయక పాత్రను సృష్టిస్తే అది చంద్రహాస్ పాత్రకు దీటుగా వుండదు. ప్రణవి లాంటి కథానాయికను కాపాడే వ్యక్తి ఒక అడ్మయిరింగ్ పాత్రగ వుండాలి. అలా ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచన "కార్తికేయ" ఒక విధంగా ఒక పాపులర్ హీరో సినిమాలో, మరో పాపులర్ హీరో గెస్ట్ అపీయరెన్స్ లాంటిది. ప్రణవిని కాపాడే ధీరత్వం వున్నా మోస్ట్ పవర్ ఫుల్ పాత్ర కావాలి. అందుకే కార్తికేయ ఈ సీరియల్ లోకి ప్రవేశించాడు. ఈ అనూహ్యమైన మలుపును ఆహ్వానించిన, అభిమానించిన వీక్షకులకు కృతఙ్ఞతలు...ఈ ప్రయోగంకి స్ఫూర్తి మీరు ఇచ్చిన ప్రేరణే మీరు చూపిస్తున్న అభిమానమే సుమా ...మీ విసురజ)
*************************
ఒక అద్భుతం కళ్ళ ముందు కనిపిస్తుంటే ...ఒక భరోసా నేనున్నాను అని చెబుతుంటే ఎడారిలో మంచువర్షం కురిసినట్టు....శూన్యంలో ఓ ఆధారం కనిపించినట్టు...ఎప్పుడైతే ఆగంతకులు తనను చుట్టుముట్టారో...అప్పుడే తన పని ఫినిష్...అనుకుంది.కానీ తన మొర విన్నట్టు...సాక్షాత్తు దేవుడే దిగివచ్చినట్టు ... అనుభవవేద్యమైన అనుభవం...
***************
ఆగంతకులు ఊహించని పరిణామం....వాళ్ళు ప్రొఫెషనల్స్...జనం చూస్తుండగా, ఆ జనాన్ని ఎలా భయపెట్టాలో తెలిసిన వాళ్ళు...పోలీసులు సైతం ఒక్కో సారి చేష్టలుడిగిపోక తప్పని పరిస్థితి. కానీ తమ ఎదురుగా నిలబడ్డ కార్తికేయను చూడగానే వాళ్ళలో తెలియకుండానే భయం ప్రవేశించింది. కార్తికేయ చేతిలో వున్నా రివాల్వర్, అది పట్టుకున్న తీరు, మోహంలో నిర్లక్ష్యం...శత్రువు గుండెలో భీతిని కలిగించేలా వున్నాయి. అయినా పైకి గాంభీర్యంగా వున్నారు.
"ఆ అమ్మాయిని వదిలి నీ దారిన నువ్వు వెళ్తే బ్రతికి పోతావు. లేదంటే మా చేతిలో చచ్చిపోతావు" అగంతకుల్లో ఒకడు తల్వార్ తో బెదిరిస్తూ ఓ అడుగు ముందుకు వేసాడు.
కార్తికేయ మాట్లాడలేదు...అతని కుడిచేతి చూపుడు వేలు ట్రిగ్గర్ ని పలకరించింది. ఓ బుల్లెట్ కామ్ గా తన టార్గెట్ ని చేరుకుంది. ఇందాక డైలాగ్ చెప్పిన శాల్తీ కుడి చేతి మణికట్టుని ముద్దాడింది.
"డైలాగ్స్ ఎప్పుడు చెప్పాలో, ఫైట్ ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలి...మీకు ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నాను. ఆ అమ్మాయిని వదిలిపెట్టి పారిపోవడానికి కాదు...ఆ అమ్మాయిని ఎందుకు చంపాలని వెంటపడుతున్నారో నాకు చెప్పడానికి" కారికేయ కామ్ గా చెప్పాడు.
వాళ్లకు అర్ధమైంది. అవతలి వ్యక్తీ సామాన్యుడు కాదు. అతను రివాల్వర్ పేల్చిన తీరులోనే ఆ విషయం స్పష్టమైంది. ఇప్పుడు సమస్య ఆ అమ్మాయిని చంపడం కాదు...తాము చావకుండా తప్పించుకోవడం...
నలుగురూ అదే ఆలోచనలో వున్నారు. నాలుగో వ్యక్తి చేతికి గాయమైన బాధలో వున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో వాళ్లకు తెలుసు...కార్తికేయను నెట్టేసి ముందుకు పారిపోయారు. ఇలాంటి పరిస్థితి వాళ్లకు ఎదురవుతుందని తెలుసు...ఇప్పుడు వాళ్ళను వెంటాడడం కన్నా, ఆపదలో వున్న అమ్మాయిని కాపాడడం ముఖ్యం...
వెనక్కి తిరిగి ప్రణవి వైపు చూసాడు. భీతావహరిణి లా వుంది.
"మీకేం భయం లేదు...మీ పేరేమిటి? అడిగాడు కార్తికేయ.
"తెలియదు.." చెప్పింది ప్రణవి.
ఒక్క క్షణం ఆమె వంక చూసాడు..ఏదో తెలియని ఆత్మీయత...
ఒక్క క్షణం కార్తికేయ వైపు చూసింది ప్రణవి...ఏదో తెలియని గొప్ప భావం...
ప్రణవి చెప్పడం మొదలు పెట్టింది...
"మీకు అభ్యంతరం లేకపోతే నాతో మా ఇంటికి రండి...మా ముగ్ధ మిమ్మలిని తన సోదరిలా చూసుకుంటుంది. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది " చెప్పాడు, ప్రణవి చెప్పింది విన్నాక, కార్తికేయ.
*******************
చంద్రహాస్ పరుగెడుతున్నాడు.. ప్రాణభయంతో కాదు....అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో...ఈ సంఘటనల వెనుక వున్నది ఎవరో తెలుసుకోవాలి. శత్రువుల బలం ఎక్కువైనప్పుడు మూర్ఖత్వంతో వాళ్ళను ఎదురించడం సరికాదు. ముందు ఈ ఎటాక్ నుంచి బయటపడాలి.
జనం చూస్తూనే వున్నా, తమ కళ్ళ ముందే ఓ వ్యక్తిని చంపేస్తూనే వున్నా పట్టించుకునే ధైర్యం, ఆలోచన, కదలిక రావాలంటే సమయం పడుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు అది సునామీ అవుతుంది.
చంద్రహాస్ ఓ కాలనీలోకి ప్రవేశించాడు. ఎదురుగా ఓ ఇల్లు ...తనకు రక్షణ ఇస్తుంది. ముందు తను సేఫ్ అవ్వాలి...ఆయుధాలతో మరణమృదంగం సృష్టించే శత్రువుల నుంచి బయటపడాలి.
ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇల్లు సారథి, సాత్యకిలది..ఆ సమయంలో సాత్యకి బాత్ రూంలో నుంచి బయటకు వచ్చి బట్టలు మార్చుకోబోతుంది.
చంద్రహాస్ ను వెంబడిస్తూ వచ్చిన మాఫియా గ్యాంగ్ ఆ ఇంటిని చుట్టునుట్టారు...తలుపుల మీద దబ దబ బాదారు.
**********************
(కనురెప్పల మబ్బులు వర్షించిన కుంభ వృష్టి ....రేపటి సంచికలో)

No comments: