ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
28-05-2013 (Chapter-48)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ...
******************
విశ్వమంత ప్రేమని పిడికెడంత గుండెలో నిక్షిప్తపరచడం అద్భుతమైన విషయం...అద్దంలో కొండనైనా చూడగలం...ప్రేమతో వేన వేల విశ్వాలను పిడికెడు గుండెలో పదిలపర్చగలం...తన గుండెలో వున్న ప్రేమను జ్ఞాపకంగా వెలికి తీయాలని ప్రయత్నిస్తుంది ప్రణవి.
తానెవరో తనకే తెలియకపోవడం...కథలో మెలోడ్రామ..కానీ జీవితంలో అత్యంత విషాదం...ఆ విషాదాన్ని అనుభవిస్తుంది ప్రణవి.
***************
ప్రకృతి భీభత్సం తర్వాత వున్న ప్రశాంతతలా వుంది. కన్నీళ్లు విషాదానికి చిహ్నం అని ఎవరన్నారు? మనలోని దిగులుని దూరం చేసే ఆత్మీయ నేస్తాలు...కన్నీటి అశ్రువులు. సాత్యకి గుర్తొచ్చింది...సారథి గుర్తొచ్చాడు...
ఈ ప్రపంచంలో కృతజ్ఞత అనే పదం ఇంత గొప్పగా ఉంటుందా? ఈ విషయం ప్రణవికి చెప్పాలి...ఒక గొప్ప బిజినెస్ డీల్ కుదిరినా పొందని ఆనందం...ఇప్పుడు తనకు లభిస్తోంది.
చంద్రహాస్ ఆలోచిస్తూనే రోడ్డు క్రాస్ చేయబోతుండగా...వెనక నుంచి వేగంగా మృత్యుశకటంలా
దూసుకువస్తోన్న లారీని గమనించలేదు.
చంద్రహాస్ ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. తన వెనుక ఏదో శబ్దం..భయంకరమైన శబ్దం...అది ప్రమాదాన్ని సూచించే శబ్దం. వెనక్కి తిరిగి చూసే టైం కానీ, అవకాశం కానీ అతని లభించలేదు.
లారీ అతడిని గుద్దేసింది. బంతిని విసిరేసినట్టు అతను గాలిలోకి ఎగిరాడు...మృత్యువు సమీపంలోకి వచ్చినా, అదృష్టం గడ్డివాముల రూపంలో కాపుకాసింది. గడ్డివాముల మీద పడ్డాడు....అయితే లారీ గుద్దినప్పుదు తగిలిన దెబ్బ అతడి తలకు గాయం చేసింది...షాక్ తో స్పృహ తప్పేలా చేసింది.
*******************
డాక్టర్ వి.సుందరరావు
ఆరుపదుల వయసు...నిండైన విగ్రహం...ప్రతీ సమస్యను ఎన్నో కోణాల్లో చూస్తాడు. సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్...అన్నింటికన్నా మంచి హ్యుమనిస్ట్...
డబ్బు కన్నా ఈ ప్రపంచంలో ఖరీదైనవి...విలువైనవి చాలా వున్నాయన్నది ఆయన నమ్మకం...
పుస్తకాల ద్వారా చదివిన మనస్తత్వశాస్త్రాన్ని అలంకారంగా మార్చుకున్నాడు...ప్రపంచాన్ని, ప్రపంచంలోని మనుష్యులను చదివిన అనుభవం అతనికి ఇష్టమైన శాస్త్రం....ఎంత గొప్ప వి ఐ పి అయినా సామాన్యులతో కలిసి రావలిసినదే.
*******************
గదిలో మసక వెలుతురు...కుర్చీలో ప్రణవి కళ్ళు మూసుకుని వుంది. కార్తికేయ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ప్రణవి సమస్య చెప్పాడు. ఆమెకు తానెవరో తెలియడం లేదని. గతం మర్చిపోయిందని చెప్పాడు. ఆమెను హిప్నటైజ్ చేయడమే మార్గం అనుకున్నారు,,
***************
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు చంద్రహాస్. తలంతా బరువుగా వుంది. తలపైన ఏదో పెద్ద బరువు వున్న ఫీలింగ్...చుట్టూ చూసాడు...తను...తను హాస్పిటల్ లో వున్నాడు. తలకు కట్టు వుంది.
"తనకేమైంది? లీలగా గుర్తుకురాసాగింది. లారీ తనని గుద్దేయడం..తను గడ్డివాముల్లో పడడం...అక్కడి వరకే గుర్తుంది. ఆ తర్వాత?
"తను ఏ హాస్పిటల్ లో వున్నాడు? మెల్లిగా లేవడానికి ప్రయత్నం చేసాడు. కానీ లేవలేకపోయాడు. అపుడు గమనించాడు....తన చేతులు కట్టివేయబడి వున్నాయి. షాక్...మామూలు షాక్ కాదు. తన చేతులు ఎందుకు కట్టివేశారు? ఎవరు కట్టేశారు?
పక్కన మంచం మీద వున్న వ్యక్తిని పలకరించాడు.
" హ్హి హ్హి హ్హి" ఆ వ్యక్తి నవ్వాడు...చుట్టూ చూసాడు..కొద్ది కొద్దిగా అర్ధమవ్వసాగింది.
తను పిచ్చాసుపత్రిలో వున్నాడు.
********************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ ..)

No comments: