ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 20 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
06-06-2013 (Chapter-57)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ

******************
అక్కడ గాలి స్తంభించినట్టు అయింది. ఒక సాదా సీదా అమ్మాయిలా భావించాడు. అప్పుడే జర్నలిస్ట్ గా వచ్చిన పిల్ల కాకిలే అనుకున్నాడు. సంధ్యాజ్యోతి మెహతా వైపు చూసి చెప్పింది "ఏడు ఏడు ఊచలు కావాలి మీ కోసం...మీరు జైలులో లెక్కించడం కోసం..."
మెహతా మొహం ఎర్రబడింది...అవమానంతో ...కోపంతో....తన అనుభవమంత వయసు లేని ఓ వ్యక్తి, అదీ ఆడది, ఈగో...మేల్ ఈగో...
"నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగలనని అనుకుంటున్నావా?" తాపీగా అడిగాడు, తనను తానూ కంట్రోల్ చేసుకుంటూ, మెహతా.
"నేను వెళ్ళడానికి వస్తే కదా...మిమల్ని నాతో తీసుకు వెళ్ళాలనే వచ్చాను" అంది నింపాదిగా అతని వైపు చూస్తూ...
"ఏమిటీ అమ్మాయి ధైర్యం?"మెహతాలో చిన్న కలవరపాటు.
"మిస్టర్ మెహతా సర్...నాకు అప్పుడప్పుడు దొంగచాటుగా వీడియో తీయడం అలవాటు...అయితే దొంగ నా...(ఎడిట్....) వాళ్ళనే తీస్తాను...ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్ అని 'తెహల్కా' తర్వాత నామకరణం పాపులర్ అయింది. మీరు, రామతీర్థం, స్టీఫెన్ ముగ్గురూ కలిసి వున్న దృశ్యాలు, సంభాషణలు రికార్డ్ చేసాను...ఆడియో మంచి క్వాలిటీ...మరో విషయం...నో ఎడిటింగ్....మార్కెట్ లో సేల్ కన్నా పోలీస్ స్టేషన్ లో మంచి గిరాకీ వుంటుంది. టీజర్ వుంది చూస్తారా? ఈ మధ్య టీజర్స్ బాగా పాపులర్ అయ్యాయి...అలా రిలీజ్ చేద్దామా?" సంధ్య మెహతా వైపు చూసి అడిగింది.
మొహానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు, సంధ్య అబద్ధం ఆడుతున్నట్టు అనిపించలేదు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది. ఇప్పుడు తనేం చేయాలి?ఇక్కడ ఆఫీసులో గొడవ అయితే కష్టం..పైగా చంద్రహాస్ కనిపించడం లేదన్న అనుమానం వుంది. ఈ పరిస్థితుల్లో తొందరపడకూడదు. పోనీ సంధ్యని కిడ్నాప్ చేస్తే...ఆ పని నాంపల్లి కి అప్పగిస్తే ....
సంధ్యాజ్యోతి మెహతా వైపు చూసి హ్యాండ్ బాగ్ లో నుంచి మొబైల్ తీసింది. "ఎడిటర్ సర్..నేను ది గ్రేట్ జర్నలిస్ట్ సంధ్యని..ఇక్కడ మెహతా సర్ నన్ను కిడ్నాప్ చేయించాలని ట్రై చేస్తున్నాడు. డ్రెస్ లు తెచ్చుకోలేదు...ఎన్ని రోజులు కిడ్నాప్ చేస్తాడో తెలియదు. కొత్త డ్రెస్ లు కొనిపెట్టమని చెప్పండి. మరో విషయం సర్ .."నేను ఆఫీసు పని మీద కిడ్నాప్ అవుతున్నాను, కాబట్టి శాలరీ కట్ చేయకండి సర్...ఫోన్ మెహతా సర్ కు ఇవ్వమంటారా? వన్ సెకన్ సర్.." అంటూ మొబైల్ మెహతాకు ఇచ్చింది.
పామును చూసినట్టు చూసాడు మొబైల్ వైపు. తర్వాత సంధ్య వైపు తిరిగి "చూడండి ఇది పెద్ద వాళ్ళ వ్యవహారం...మీ మంచి కోరి చెబుతున్నాను.
ఆ క్యాసెట్ ఇచ్చి వెళ్ళిపొండి." ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు.
"నేనూ మీ మంచి కోరి చెబుతున్నాను...హాయిగా మా ఆఫీసులో సెక్యూరిటీగా పనిచేయండి. అప్రూవర్ గా మారండి." సంధ్య అంది.
మెహతాకు అర్ధమైంది.తను ట్రాప్ లో ఇరుక్కున్నాడు. దీన్ని డీల్ చేయవలిసింది స్టీఫెన్ మాత్రమే. పైగా ఈ మ్యాటర్ ప్రెస్ లో వస్తే చాలా రిస్క్ అవుతుంది. కాస్త దూరంగా వచ్చి స్టీఫెన్ కు ఫోన్ చేసాడు. ఏం చేయాలో స్టీఫెన్ చెప్పాడు.
మెహతా స్టీఫెన్ తో మాట్లాడిన తర్వాత సంధ్య దగ్గరికి వచ్చి "మీరు వెళ్లిపోవచ్చు" అన్నాడు.
"ఎక్కడికి? వెళ్ళడానికి వచ్చింది? మీతో కిడ్నాప్ చేయించుకోవాలని తెగ సరదాగా వుంది. కిడ్నాప్ ఎలా వుంటుందో తెలియదు. నేను మెంటల్ గా ప్రిపేర్ అయి వచ్చాను. ప్లీజ్ కిడ్నాప్ చేయండి." రిక్వెస్ట్ చేసింది సంధ్య.
మతిపోతోంది మెహతా కు...వెంటనే బయటకు నడిచి నాంపల్లికి సైగ చేసాడు. రెండు నిమిషాల్లో అక్కడి నుంచి బయటకు నడిచారు ఆ ఇద్దరూ...
వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన వెంటనే సంధ్యాజ్యోతి చీఫ్ ఎడిటర్ కు ఫోన్ చేసింది.
"అంతా మీరు చెప్పినట్టే జరిగింది సర్" చెప్పింది.
*****************
కారులో వెళ్తున్నారు మెహతా, నాంపల్లి...అతని ప్లయిట్ బ్లాస్ట్ అయిన రోజు గుర్తుకు వచ్చింది.
చాలా తెలివిగా వేసిన పథకం...ఆ రోజు ఏం జరిగింది?
ఈ కథనే మలుపు తిప్పిన ఆ సంఘటన నేపథ్యం ఏమిటి?

No comments: