ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

జై షిర్డీ సాయినాధ 
 దశవ/పదవ అంకం..

బాబా భిక్షాటన.. సందేశం
.........................
షిర్డీలో నివసించినంత కాలం సాయిబాబా నిత్యం భిక్ష చేసేవారు.. నిత్యభిక్షమెత్తే లయకారుడైన పరమయోగి పరమశివుని అవతారమై నిత్యం షిర్దిలోని ఇవ్వగల శక్తి, ఇచ్చే ఆశక్తి వున్న మువ్వురు సంపన్న కుటుంబాల ఇండ్లకు పోయే బిక్షమడిగెడివారు..అందరికి అన్నీ క్షణంలోనే అందించగల సర్వశక్తిమయి సాయి మరి అడుక్కోవడేమేమిటన్న మీమాంశ సంశయ జనులకు ఆనాడు కలిగింది, ఈనాడు కలుగుతూనే వుంటుంది.. ఎందుకంటే బాబాయే భగవంతుడయినచో వారు భిక్షాటన చేసి జీవితాంతం గడుపనేలనే ప్రశ్నకు రెండు వివరణలు తెలియవచ్చే (1) భిక్షాటన చేసి జీవించుటకై హక్కు ఎవరికీ వుంటుంది (2) పంచసూనములు అనే పాపాలను పోగొట్టుకొనుడెట్ల?
పైన వేసుకున్న మొదటి ప్రశ్నకు ప్రతిగా ఇట్లా తెలుసుకోవచ్చు...సంతానం, ధనము, కీర్తి సంపాదించుటపై మొహం వదిలి సన్యసించువారే భిక్షాటనచే జీవింపవచ్చునని మన శాస్త్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. అటువంటివారు ఇంటివద్ద వంట ప్రయత్నములు చేసికుని, తినలేరు. వారికి భోజనం అందించే బాధ్యత గృహస్థులపైనే కలదు. మరి చూడంగా సాయిబాబా గృహస్థుడు కాడు; వానప్రస్థుడు కూడ కాడు. షిర్డీ సాయి అస్ఖలిత బ్రహ్మచారి. బాల్యం నుంచే బ్రహ్మచర్యము అవలంబించిన ధీరుడు. ఈ సర్వ జగత్తు వారి వాసమని, గృహమని వారి ఉవాచ. ఈ మిధ్యా జగత్తునకు వారే కారణభూతులు. ఈ జగత్తు సమస్తం సదా ఆధారపడి వున్నది. షిర్డీ సాయి పరమానంద కారకులు, పరబ్రహ్మ స్వరూపులు. కనుక వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు.
పైన అనుకున్న రెండో ప్రశ్నకు సమాధానంగా ఇట్లా చెప్పుకోవచ్చు... పంచసూనములనే పాపాలనుండి తప్పించుకొను మార్గాన్ని యోచిస్తే ముందుగా మరి ఆ పంచసూనలేమిటి అన్నది తెలియరావాలిగా...భోజనపదార్థములు తయారు చేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను. 1. దంచుట, రుబ్బుట 2. విసరుట 3. పాత్రలు తోముట, 4. ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5. పొయ్య మంటించుట. ఈ అయిదు పనులు సలిపేటప్పుడు కనబడని అనేక క్రిమికీటకాదులు మరణించుట జరుగును. ప్రతిగా ఆ పనులను నిర్వహించిన గృహస్థులు ఆ పాపాన్ని అనుభవించవలే. ఈ పాప పరిహారానికి శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచే
1. బ్రహ్మ యజ్ఞము, 2. వేదాధ్యయనము, 3. పితృ యజ్ఞము, 4. దేవ యజ్ఞము, 5. భూత యజ్ఞము, 6. అతిథి యజ్ఞము. శాస్త్రాలు చెప్పిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల కర్మలు మనస్సులు పాపరహితములగును. ముక్తికి, మోక్షసాధనకు ఆత్మసాక్షాత్కారమునకు యివి తోడ్పడు. బాబా యింటింటికి వెళ్ళి భిక్ష అడుగుటచే, ఆ యింటిలోనివారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చుచుండెను, భిక్ష వారిస్తే గైకొని వారి పంచాసూనాల పాపాల్ని నుంచి కాచే. దైవమైన సాయిబాబానే స్వయముగా యేతెంచి, ఒకరి వద్దకు పోకనే, గృహస్తులకు తమ తమ ఇంటిగుమ్మం ముంగటే, ఇంత గొప్ప సంగతి సాయిబాబా బోధించుట, వారి పంచసూన పాపాలను హరించుట వలన షిర్డీ ప్రజలెంతటి ధన్యులు, ఎంతటి పూర్వ పుణ్య లబ్ధిదారులో కదా..

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?
ఒకప్పుడు ఆత్మారాముడనే భక్తుని భార్య షిర్డీకి వచ్చే. ఒకనాడు మధ్యాహ్నభోజనము తయారయ్యిన పిమ్మట అందరికి వడ్డించిరి. అంతలో ఎక్కడనుంచో ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొఱుగుట ప్రారంబించే. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టెముక్కను విసరే. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినే. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా, ఆమెను చూసి బాబా యిట్లనే "తల్లీ! నాకు కడుపు నిండా గొంతువరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతుష్టి చెందే. ఎల్లప్పుడు ఇట్లనే చేయి తల్లి. ఇది నీకు సద్గతి కలుగజేయు. ఈ మసీదులో నుంచి అబద్దం చెప్పను. నా యందు ఆ దయ అట్లనే ఉంచు. మొదట యాకలితో నున్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపు. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తికి ఉంచుకో" అని పలికే. అంటా విన్నా ఆమెకి ఏమి అర్ధం కాలేదు. అంత ఆ తల్లి యిట్లనే.. 'బాబా! నేను నీ కెట్లు భోజనం పెట్టగలను? నేనే నా భోజనంకై మరొకరిపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను.' అందులకు బాబా యిట్లు జవాబిచ్చే " తల్లి నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు నీవు ఏ కుక్కను జూచి రొట్టె పెట్టితివో అది నేను ఒక్కటే, వేరు కాదు. అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగగలవన్నియు నా యంశములే, నేనే వాని ఆకారాలలో తిరుగుచున్నాను. ఎవరయితే సర్వ జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి యింకొకటనే ద్వంద్వ భావమును విడనాడి నన్ను సేవింపుము". ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు సంతోషంచెందే. ఆమె కన్నులు కన్నీటితో నిండే. డగ్గుత్తితో గొంతు ఆర్చుకొనిపోయే. ఆమె అనందమునకు అంతులేకుండే.

నీతిసారాంశం
జీవులన్నిటిలోను భగవంతుని చూడాలన్నదే యీ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుడిని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన విషయాన్ని సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధలను, ఆచరణ రూపమున నెట్లుంచవలెనో అనుభవపూర్వకంగా నిర్థారణ చేసి వున్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతాలను భోధించు చక్కని మానుష రూపేణ వున్నా గురువని, దైవమని తెలియవలే..
.....
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: