ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 27 June 2013

జై షిర్డీ సాయినాధ


నాలుగో అంకం..
............................
గురువు గారి విశిష్టత
...........................
సంసారమనే సముద్రంలో జీవుడనే ఓడను సద్గురువు చేతులలో పెడితే, సద్గురువు నడిపితే సదరు ఓడ సులభంగా జాగ్రత్తగా గమ్యస్థానము చేరు. సద్గురువంటే సాయిబాబానే జ్ఞప్తికి వచ్చే. ఎటు చూస్తే ఆటే అక్కడే సాయిబాబా నిలిచినట్లు, నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి ఆశీర్వదించుచున్నట్లు తోస్తున్నది. నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్లనుండి ప్రేమ పొంగే. సూక్ష్మశరీరం (కోరికలు, భావాలు) అగ్నిచే కూడ కాలనట్టిది, మరి గురువుగారి హస్తము తగిలితే కాలే. జన్మజన్మల పాపాలు పటాపంచలవ్వే. చింతలలో కూడా చిత్తశాంతి కలుగే. చూడ చక్కని సాయి రూపం చూడగనే సంతసము కలుగు. కండ్ల నిండ నీరు కారి నిండే మనస్సు ఊహలతో బాబా ఊసులతో ఊరేగు. స్వయముగా తనే పరబ్రహ్మము అయినా మనలోనే నిద్రాణమైనున్న చిత్తానికి ఆత్మసాక్షాత్కారానందం కలిగించే. నేను, నీవన్న భేద భావాలని తొలగించు. ఎవరితోనైన సంభాషించువేళ సాయిబాబా కథలలోని మంచి మాటలే జ్ఞప్తికి వచ్చు. అలాగే నేనేదైన వ్రాయ తలపెట్టితే వారి అనుగ్రహం లేనిదే యొక్క మాటగాని వాక్యముగాని వ్రాయలేను. అదే వారి ఆశీర్వాదం లభించినచో వెంటనే అనంతంగా వ్రాయగలను. భక్తునిలో గర్వం విజృంభించగ సాయిబాబా దానిని యణచివేయు. తన శక్తితో భక్తుల కోరికలను నెరవేర్చి సంతుష్టుల్నిజేసి యాశీర్వదించు. సాయి పద్మపాదములకు సాష్టాంగ నమస్కారము జేసి సర్వస్యశరణాగతి చేస్తే ధర్మార్థకామమోక్షములు సిద్ధించు. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి యను నాలుగు మార్గములు కలవు. అన్నింటిలోకి భక్తిమార్గము కష్టమైనది. ఆ భక్తి దారిలో ముండ్లు, గోతులు ఎక్కువ. సద్గురుని సాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని నడిస్తే గమ్యస్థానం అవలీలగా చేరవచ్చుని, దీన్ని గట్టిగా విశ్వసించండని సాయిబాబా చెప్పుచుండే.

తన భక్తుల శ్రేయస్సుకై తపన పడే బాబా తెలిపిన అభయప్రధాన వాక్యాలు.... .
"నా భక్తుని యింటిలో అన్నవస్త్రాలకు ఎప్పుడు లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, నిత్యం భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే అరాధించువారి యోగక్షేమముల నేను జూచెద. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడ ఇట్లనే చెప్పే. కావున వస్త్రాహారముల కొరకు అధిక ప్రయాసపడవద్దు. నీకేమైన కావాలంటే భగవంతుని వేడుకో. ప్రపంచంలో పేరు, ధనం కీర్తులు సంపాదించుట మాని భగవంతుని కరుణాకటాక్షములు పొందుటకు, భగవంతునిచే గౌరవమందుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందాలన్న భ్రమను విడిచెయ్యి. మనస్సునందు ఇష్టదైవముయొక్క ఆకారము నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధనకొరకే నియమింపుము. మిగతా వాటి వైపు మనస్సు పోనివ్వకు. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తికి పెట్టి మనస్సును నిలుపు. అప్పుడది శాంతి వహించి నెమ్మదిగాను, యెట్టి చికాకు లేక యుండును. అప్పుడే మనస్సు సరియైన సాంగత్యంలో వుందని గ్రహింపుము. మనస్సు చంచలంగా వుంటే ఏకాగ్రత లేనట్లే".
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
శుభం భవతు।

No comments: