ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 27 June 2013


జై షిర్డీ సాయినాధ
రేండవ ,మూడవ అంకం..
సాయిబాబా వల్లే కుగ్రమమైన షిర్డీ పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది..సాయిబాబా సంపూర్ణ యోగి, సంసారమును జయించిన మౌని. శాంతచిత్తమే వారి నగ. జ్ఞాన భాండాగారం, విషయ వస్తువులందు అభిమానము లేని విరాగి. నిరాడంబరుడు. అద్దమువలె స్వచ్ఛమైనది వారి ఆత్మ. అమృత దృక్కుల, అమృత వాక్కుల మహానుభావుడు. గొప్ప, బీదల తేడాలు చూపని సిద్దుడు..గౌరవం అవమానాల పట్ల లెక్కలేని వారు; జగతికి ప్రభువు. అందరితో కలసిమెలసి యుండి అందరి ఆటలు చూసేవారు, పాటలను వినేవారు. సర్వవేళలా అందరిని కనిపెట్టి వుండేవారు. సాయిబాబాగారి మనస్సు లోతయిన కడలిలా ప్రశాంతము, ఉన్నచోటునుంచే ప్రపంచంలో జరిగే సంగతులన్నియు వారికి తెలియును, వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పినా మౌనము తప్పెడివారు కారు. ఎప్పుడు మసీదు గోడకు ఆనుకొనివారు. లేదా ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రం లెండీ తోట వైపుగాని చావడి వైపుగాని వ్యాహాళి కెళ్ళేవారు. సృహలో ఉంటూ కూడా ఎల్లప్పుడు ఆత్మధ్యానమందే వుండేవారు. షిర్డీసాయిబాబా సిద్ధపురుషుడైనప్పటికి సామాన్య సాధకునివలే నటించేవారు. షిర్డీసాయిబాబా అణకువ, నమ్రత కలిగి, అహంకారము ఎరుగక నిర్మలంగా వుండేవారు. షిర్డీ నేల సాయిబాబా పాదస్పర్శచే ధన్యత, గొప్ప ప్రాముఖ్యము పొందింది. జ్ఞానేశ్వర మహారాజ్ ఆళందిని గ్రామాన్ని వృద్ధి చేసినట్లు, ఏకనాధ్ ప్రభు పైఠనును వృద్ధిచేసినట్లు, సాయిబాబా షిర్డీ గ్రామాన్ని వృద్ధిచేసేను. షిర్డీలోని మొలిచిన గడ్డి, దొరికే రాళ్ళు కూడా కడు పుణ్యము చేసికొన్నవి కాబాట్టే సాయిబాబా పవిత్ర పాదాలను ముద్దాడి వారి పాదధూళి తలపైని వేసికొనగలిగే. భక్తులకు షిర్డీ దివ్యక్షేత్రం పండరీపురము, జగన్నాధ పూరీ, ద్వారకా, కాశీ, రామేశ్వరం, బదరీ, కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరం, ఉజ్జయినీ, మహాబలేశ్వర్, గోకర్ణముల వంటిదయ్యే. షిర్డీ సాయిబాబా నామమే, వారి ఆత్మీయ స్పర్సనే వేదపారాయణం, తంత్రమునూ. అది భక్తులకు సంసార బంధముల పట్ల విముఖత నిచ్చి అత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేసేను. త్రివేణీ ప్రయాగల స్నానఫలము సాయి పాదసేవ వలననే కలుగు. వారి పాదోదకము భక్తుల కోరికలను నశింపజేయు. శ్రీ సాయి యాజ్ఞ భక్తులకు వేదవాక్కుగా మారే. ద్వంద్వాతీతులైన సాయినాధుడి ఊదీ ప్రసాదాలు భక్తజనులను పావనం చేసే సచ్చిధానందా స్వరూపులుగా విలసిల్లే. పేరుకి కుగ్రామైన షిర్డీ సాయి కేంద్రమైనను, వారి అమరలీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాత్, డక్కన్, కన్నడ దేశములలో తెలియ వచ్చే. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, నానా దేశములనుండి భక్తులు షిర్డీ చేరి, వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి మరియు శ్రీసాయి దర్శనంచే భక్తుల మనసులలో చిత్తశాంతి లభించేదన్న మాటలలో యతిశయోక్తి లేదు.

బాబా అయోనిసంభవుడు; షిర్డీ గ్రామం మొట్టమొదటగా ప్రవేశించుట..

సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, ఆయన జన్మము గూర్చిగాని వారి జన్మస్థానమును గూర్చిగాని యెవరికేమి తెలియదు. పెక్కుమార్లు అడిగినా సాయిబాబా చెప్పలేదు. నామదేవు, కబీరు, సామాన్య మానవులవలె జన్మించలేదు. ముత్యపు చిప్పలలో చిన్నపాపలవలె చిక్కిరి. నామదేవు భీమారథి నదిలో గొణాయికి కనిపించే. కబీరు, భాగీరథీనదిలో తమాలుకు కనిపించే. అటువంటిదే సాయి జన్మవృత్తాంతం. 16 ఏండ్ల బాలుడుగా షిర్డీలోని వేపచెట్టు క్రింద మొదట భక్తులకి అవతరించి కనిపించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా అగుపడే, వారు స్వప్నావస్తలోను ప్రాపించిక వస్తువులను కోరలేదు. మాయను వారు మచ్చిక చేసుకొనే. బాబా పాదాలను 'ముక్తి' మాత సేవించుచుండెను. నానాచోపదారు తల్లి ముసలి తల్లి బాబా నిట్లు వర్ణించినది "ఈ చక్కని చురుకైన, అందమైన కుర్రవాడు వేపచెట్టు క్రింద ఆసనములోనుండే. వేడిని, చలిని లెక్కింపపని ఆ చిన్నకుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి అందరు ఆశ్చర్యపడిరి. పగలు ఎవరితో కలిసెడివాడు కాదు, అలాగే రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యముతో ఈ చిన్నవాడెక్కడి వాడని తలచిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగా వుండి అందరు ఒక్కసారి చూస్తే ముగ్ధులగుచుండిరి. ఆ బాలుడు ఎవరింటికి పోక, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనేవాడు. పైకి చిన్న బాలునివలే కన్పించినా చేతలను చూడగా మహానుభావుడనిపించే. విరగైన అతనిగూర్చి ఎవరికేమి తెలియకుండెను. ఒకనాడు గ్రామ దేముడైనా ఖండోబా ఒకరిని ఆవేశించగా ఆ బాలుని గురించి వివరాలు ఆడగా 'ఖండోబా దేవుడు ఆవేశించినతను ఒక స్థలం చూపి గడ్ఢపారతో తవ్వించే త్రవ్విన చోట యిటుకలు, వాని దిగువ వెడల్పు రాయి కనిపించే. ఆశ్చర్యముగా అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండే. అక్కడే ఒక భూగృహం కనిపించే. అందులో గోముఖ నిర్మాణాలు, కఱ్ఱబల్లలు, జపమాలలు కనిపించే. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించేనని 'ఖండోబా దేవుడు' తెలిపే. ఆ బాలుడు అంతట అందరికి అది తన గురుస్థానమని, అక్కడ వున్నది గురువు గారి సమాధి కనుక వెంటనే దానిని మూసివేయమని కోరగా వెంటనే మూసివేసిరి. ఆ వేపచెట్టును పవిత్రమైన అశ్వత్థ, ఉదుంబర, వృక్షముల వలే సాయిబాబా చూస్తూ ప్రేమించేవారు. షిర్డీలోని భక్తులు, మహాళ్సాపతియు అది ఆ బాలుడి (బాబా) యొక్క గురు స్థానమని సమాధని భావించి సాష్టాంగనమస్కారాలు చేస్తుండేవారు.

గురువుయొక్క యావశ్యకత
మోక్ష మార్గం గురించి బాబాని ప్రశ్నింప, మోక్షము అందేటందుకు అనేక మార్గాలు కలవు, షిరిడీనుంచి కూడ నొక మార్గము కలదంటూ తెలిపే. ఆ మార్గము ప్రయాసకరమైనది, దారిలో అడవిలో పులులు, తోడేళ్ళు కలవని బాబా చెప్పే. అప్పుడు భక్తుడు కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటదీసుకుని వెళితే అంటే అప్పుడు కష్టమేమిలేదని బాబా జవాబిచ్చే. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యానున్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడు లేనిచో అడవి మృగాలచే చంపబడవచ్చు లేదా దారి తప్పి గుంతలలో పడిపోవచ్చు. భక్తుడు దభోళ్కరు తన ప్రశ్న గురువు అవశ్యకతకిదియే తగిన సమాధానమని గుర్తించే. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా లేదాననే వివాదాల వలన ప్రయోజనం లేదని గ్రహించే. నిజముగా, పరమార్థము గురుబోధతోనే అందేనని పురాణ పురుషులు, విష్ణు రూపులు, వేద మూర్తులు 'రామకృష్ణులు' వసిష్ఠ, సాందీపులకు లొంగి అణకువతో నుండి ఆత్మసాక్షాత్కారం పొందిరని, దానికి దృఢమైన నమ్మకము, ఓపిక యను రెండు గుణములు ప్రధానమని గ్రహించే.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: