ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత: ప్రకృతి ప్రభోధ

నింగిని మెరిసే చంద్రుడే మదిని నిగ్గదీయక మునుపే
తూర్పున పొడిచే సురీడే హృదిని తూట్లుపొడవక మునుపే
గగనాన వెలిగే తారలే చిరాకుతో గగ్గోలెట్టక మునుపే 
వింజామరలు వీచే పవనుడే విస్తుపోయి చూడక మునుపే
మనసు మూటని విప్పుకో
మమత మాటని చెప్పుకో
వాస్తవాల నీడలో మేలుకో
విజయాల బాటలో సాగిపో
ఋతువుల అందాలలో మురిసినాక మధురాలు తెలిసోచ్చే
తలపుల కోకలను చుట్టుకున్నాక తపనలు తెలిసోచ్చే
మమతల ఊయలలో ఊరేగినాక మురిపాలు తెలిసోచ్చే
వలపుల చినుకుల్లో తడిసినాక పరువాలు తెలిసోచ్చే
ఎప్పుడు కట్టుకున్న ఊహాసౌధాలన్నీ కూలిపోనీకు
ఎప్పుడు పెట్టుకున్న ఆశాదీపాలన్నీ ఆరిపోనీకు
ఎప్పుడు చేసుకున్న బాసలన్నీ నీటిపాలవ్వనీకు
ఎప్పుడు చెప్పుకున్న ఊసులన్నీ మాసిపోనీకు
నేస్తమైన పరిచయాన్ని పరిచయమైన ప్రేమని పలకరించు
విచ్చుకున్న పువ్వులన్నీ పూబాలంటి అమ్మాయికై అర్పించు
నచ్చుకున్న నమ్మకాన్ని నమ్మకమైన అనురాగాన్ని పెంపొందించు
ప్రియమైన విషయాన్ని విషమమైన వలపుని సముపార్జించు
.............
విసురజ

No comments: