ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 5 November 2014

కవిత: ప్రేమ గీతిక

చల్లగాలి వీచి
మనసును తట్టిలేపే
మధురూహాల మమతల లోగిలిలో
చెలి నీదు మానసం విరితావియేగా
సన్నజాజి విచ్చి
వాసంత సమీరమే గుచ్చి గుచ్చి
కుసుమహాసాల లాలిత్యాల వాకిళ్ళలో
సఖీ నీదు హృదయం ప్రేమమయమేగా
వానజల్లు తాకి
గ్రీష్మతాపాలే తగ్గంగా
మనసుమేఘాలే వలపువర్షాలే కురియంగా
ప్రియా నీదు పరువం ప్రణయదీపమేగా
విరిబాల అందం
వింజామరలు వీయంగా
చెరుకువింటినెక్కుపెట్టి సుమశరాలే సంధింప
బేల నీదు సౌందర్యం నీరాజనాలిచ్చేగా
కల్పనలో కైతలపర్వంలో
మధురభావనల మురిపెములో
మనోహరి మధురహాసిని
ప్రియదర్శనాల ప్రమోదాలలో
వలపు ప్రమిదనై అందు మనసు దీపమై
కలకాలం నీకై ఆర్ద్రతతో వెలుగులే
కడవరకు నీకై ఆత్రుతతో వేచేనులే
..........

No comments: