ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

కవిత: నేనొక 'బాల్యాన్ని' చూశాను

బాల్యంపై కవితను ఎట్లా అల్లటమానని ఆలోచిస్తూ సాగుతున్నాను ...
అంతరిస్తున్న ఆ బాల్యాన్ని ఈరోజు మేల్కొనడం స్పష్టంగా చూశాను
..
పుట్టించిన బ్రహ్మకు ప్రాణం పోసిన అమ్మకు అక్కరుకురాని నాన్నకు
అక్కర్లేకపోయిన ఓ పసివాడి బాల్యన్ని అక్కున చేర్చుకున్నచెత్తకుప్పను చూశాను
రోడ్ పక్కన చెత్తకుప్ప దగ్గర వారగా భయం భయంగా
ముడుచుకున్న ఓ పసివాడి బాల్యం మూగగా ఆవేదన చెందటం చూశాను
అమ్మ ఆప్యాయత కోసం నాన్న ఆలంబన కోసం 
ఎదలోనే సంఘర్షిస్తున్న ఆ బాల్యం మరీ మరీ అల్లాడిపోవటం చూశాను
నిర్భీతిగా స్వచ్చంగా తుళ్ళుతూ ఆడి పాడాల్సిన వయసులో
ఒంటరైన ఆ బాల్యం మౌనంగా రోదించటం చూశాను
పసిప్రాయంలోనే పాలబుగ్గల వయసులోనే
బ్రతుకుకై ఆ బాల్యం ఒంటరిపోరాటం చెయ్యడం చూశాను
భుజాన బ్యాగులతో చదువుకునేందుకు తన తోటివాళ్ళు స్కూల్ కి వెడుతుంటే
భుజాన సంచీలకు ఆ బాల్యం చెత్తలోని పనికొచ్చేవాటిని ఏరడం చూశాను
రేతిరి చీకలట్లో సద్దుమణిగి ఊరు మస్తుగా నిద్దరోతుంటే
చీకటి దెయ్యపు భయంతో ఆ బాల్యం నిద్దురకై చేయు పోరాటం చూశాను
శీతాకాలపు సందేళ వణుకుడు వేళ అందరు శాలువాలు/రగ్గులు కప్పుకునివుంటే
బట్ట కరువై బ్రతుకు బరువై ఆ బాల్యం వణికించే చలిలో గడ్డకట్టటం చూశాను
గర్వంగా తలెత్తుకుని తోటి ఈడువాళ్ళు కిలకిలలతో తిరుగాడుతుంటే గర్వంగా బ్రతుకుంటే
తన తప్పేంటో తెలియని ఆ బాల్యం తలదించుకుని జీవచ్చవంలా బ్రతకటం చూశాను
మురిపించే మైమరపించే అందరు అందుతున్నఆనందాల పలకరింపులకు బదులుగా
ఈసడింపుల శాలువాలు అవహేళన దుప్పట్లతో ఆ బాల్యం తిరుగుతున్న సంగతి చూశాను
అందరిమల్లే తనకెందుకు ఈ సౌఖ్యాలు అందలేదని ఆలోచించకుండా
ఎదురైనా సమస్యలకు ఎదురొడ్డిన ఆ బాల్యం వజ్రపు ఆత్మవిశ్వాసాన్ని చూశాను
మనషుల మనస్సులో మమతలు కరువైతే ఎదురయ్యే తార్కాణపు
తప్పిదాల్ని ఆ బాల్యం కల్ముషషరహితంగా ఎత్తిచూపడం చూశాను
సమాజపు వీధుల్లో ఎందుకో తప్పిపోయిన బ్రతుకు మనుగడనూ మంచిని
నైరాస్యత వీడిన ఆ బాల్యం తిరిగి గుర్తుచేసి సరియైన స్థానాన్ని ఇవ్వడం చూశాను

No comments: