ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday 18 December 2014

కవిత: బాకీ

జీవితమా
కాస్త మెల్లగా సాగుమా
ఇంకా తీర్చాల్సిన 
బాకీలు వున్నాయి సుమా
కొన్ని బాధలకు
ఉపశమన లేపనాలు పూయాలి
కొన్ని బాధ్యతలకు
ఉపయుక్తపు మాటలు నేర్వాలి
నీవు జీవనంలో వేగంగా సాగువేళ
బ్రతుకున కొత్తపొద్దు పొడుచు వేళ
నీ వేగపు వడికి సవ్వడికి సందడికి 

కొందరు మూతి ముడిచారు 
కొందరు నీ తోడు వీడేరు
మరి మూతి ముడిచిన వారిని
బుజ్జగించాలి దార్లోకి తేవాలి
మతిలేక ఊరికూరికేడిచే వారిని
ఉడికించి కవ్వించి నవ్వించాలి
గుండెల్లో నిలవున్న
పూర్తవ్వని కోరికలను
పూడ్చిపెట్టి మట్టిపోసి
శాశ్వతంగా నిద్రపుచ్చాలి
పూర్ణమయ్యే కలలరంగులను
జీవితపు కాన్వాస్ పై అద్దుకోవాలి
వీలయితే తీరని కొన్ని కోరికలు తీర్చుకోవాలి
చేతనైతే పూర్తి కాని కార్యాలు పూర్తిచెయ్యాలి
వీలైతే కొన్ని వీడిన బాంధవ్యాలను
కలపాలి కలుపుకోవాలి అన్నీ మనవనుకోవాలి
వీలైతే కొన్ని తిరస్కార పురస్కారాలను
వినమ్రంగా అందుకోవాలి ఎదలో దాచుకోవాలి
బ్రతుకా ఒక్కచాన్స్ యిచ్చి చూడుమా
శ్వాసపై నేను తీసే ఊపిరిపై
హక్కున్న వాళ్ళను ఒక్కమారు కలవాలి
కలిసి నచ్చచెప్పి నా హృదిమూట అప్పచెప్పాలి
జీవితమా...
కాస్త మెల్లగా సాగుమా
ఇంకా తీర్చాల్సిన
బాకీలు వున్నాయి సుమా!!

No comments: