ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

మేన్ రోబో ఆన్ లైన్ తెలుగు మాగజైనులో వస్తున్న తొలి డైలీ సీరియల్
"ముగ్ధమోహనం" (2nd chapter)
....................................................................................................................
" ఒక్క క్షణం వేన వేల నిశ్శబ్దాలు నిస్తేజమైనట్టు...సమాధానం లేని ప్రశ్న తర్జని చూపి నిలదీసినట్టు.."
"చెప్పండి అంకుల్..ఎప్పుడు చంపుతారు? "ఎనిమిదేళ్ళ చిన్నారి...ప్రతి రోజు అందించే ఆ గులాభీ వెనుక వున్న ముళ్ళు తనకు మాత్రమే తెలుసు...తన కర్తవ్యాన్ని గుర్తు చేసే భగవద్గీతని.

కార్తికేయ ఆ చిన్నారిని దగ్గరికి తీసుకున్నాడు..."అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన చిట్టి తల్లీ, నాన్న అనురాగంతో గారాలు పోవల్సిన చిన్నారి...అమ్మని, నాన్నని కోల్పోయి ఒంటరిగా మిగిలిన పసికూన ..నిన్నెలా ఒదార్చనూ". రెండు చేతులు కార్తికేయ మెడ చుట్టూ వేసి అలానే ఉండిపోయింది. ఇంకిపోయిన కన్నీళ్ళు ఆ చిన్నారి కనుకొలకులను చీల్చుకుని బయటకు రావడానికి సిద్ధంగా వున్నాయి.
కళ్ళ ముందు కనిపించే అమ్మా నాన్నల మృతదేహాలు.
ఈ నేపథ్యం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెనక్కి వెళ్ళాలి.

***************************

ఢిల్లీ అత్యాచార ఘటన జరగడానికి రెండు రోజుల ముందు...
రద్దీగా వున్న రాణా సర్కిల్ ..రోడ్డు చివర చిన్న పూల కొట్టు...గులాబీలు మాత్రమే దొరుకుతాయి అక్కడ. రకరకాల రంగు రంగుల గులాబీలు. శ్యామల, చంద్రం దంపతులు ఉదయమే గులాబీ తోటలకు వెళ్లి గులాబీలు తెస్తారు. గులాబీలతో బొకేలు తయారు చేస్తారు. విడి గులాబీలు సిగ్నల్స్ దగ్గర నిలబడి...రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు అమ్ముతారు. ఆ దంపతుల ఒకే ఒక కూతురు ఎనిమిదేళ్ళ అంజలి. స్కూల్ నుంచి రాగానే తనూ వాళ్ళతో జాయిన్ అవుతుంది.
ఈ ప్రపంచంలో ఆనందాన్ని అన్వేషించకుండా, వున్న దాంట్లో ఆనందాన్ని పొందాలనుకునే కుటుంబం.

*************************************

రెడ్ సిగ్నల్ పడింది. అంజలికి ఆ రోజు స్కూల్ కి సెలవు. గులాబీ బుట్ట చేతిలోకి తీసుకుంది.
"అంజూ..నువ్వు ఇంటికెళ్ళి...ఆడుకో" తల్లి శ్యామల చెప్పింది.
"ఇది కూడా ఆటే మమ్మీ ...ఈ రోజు మీకన్నా ఎక్కువ పూలు అమ్ముతాను...ఈ మీ మ్యారేజ్ డే కదా...మీకు మంచి గిఫ్ట్ కొంటాను" చెప్పింది అంజలి. "కూతురిని చూస్తుంటే ముచ్చట వేసింది చంద్రానికి...గర్వం గా కూడా అనిపించింది.ఎంత గొప్ప ఆలోచన. తమ పెళ్లి రోజుకి "కానుక" ఇవ్వాలనుకునే కూతురు".
"ఓకే, జాగ్రత్త తల్లి" చెప్పి గులాబీ బుట్ట కూతురి చేతికి ఇచ్చాడు

******************

సిగ్నల్స్ దగ్గర బైక్ ఆగింది. కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంజలి.
"అంకుల్ రెడ్ రోజ్, ఎల్లో రోజ్ , పింక్ రోజ్ ..గులాబీ బుగ్గల ఆంటీకి ఈ పింక్ రోజ్ బావుంటుంది" చెప్పింది,
"చిల్లర లేదు." అతను ముభావంగా చెప్పాడు .

"ఆంటీ కన్నా చిల్లర ఎక్కువా? ఇంత బ్యూటీ ఆంటీకి నాలుగు గులాబీలు కొనివ్వలేరా?" అంజలి లాజిక్ గా అంది. బైక్ మీద వున్న అతగాడి బార్య మొగుడి వంక "చుర చుర" చూసింది. అతని షర్టు జేబులో నుంచి ఇరవై రూపాయల కాగితం తీసి "నువ్వు ఇవ్వమ్మా" అంది.
"వద్దులే ఆంటీ..మీ లాంటి" బోల్డు అందమైన అంటీకి ఇది నా గిఫ్ట్" అంటూ కొన్ని గులాబీలు కవరులో వేసి ఇచ్చింది. ఆవిడకు ముచ్చట వేసింది. మొగుడి వంక చూసి "ఆయనో వేస్ట్ అంకుల్ లే...ఇదిగో నువ్వు డబ్బులు తీసుకో" అంటూ పువ్వులు తీసుకుని డబ్బులు ఇచ్చింది. బిక్క చచ్చి పోవడం అతడి వంతయింది. బైక్ కదిలింది "సారీ అంకుల్" అంటూ గట్టిగా అరిచింది. ఆఫీసుకు వెళ్ళే అమ్మాయిలు, గుడికి వెళ్ళే వాళ్ళు, అంజలి దగ్గర గులాబీలు కొనకుండా వెళ్ళరు.
రాణా సర్కిల్ లో అంజలి తెలియని వారుండరు.

***********************
రెడ్ సిగ్నల్ పడక పోయినా అక్కడ కార్తికేయ కారు ఆగింది.
"గుడ్ మార్నింగ్ చిట్టి తల్లీ"...కారు దిగి అంజలిని పలకరించాడు.
" గుడ్ మార్నింగ్ అంకుల్.." అంటూ ఓ గులాబీ ఇచ్చింది.
ఉదయం జాగింగ్ కు వెళ్ళేటప్పుడు...లేదా ఆఫీసుకు వెళ్ళేటప్పుడు అంజలి తప్పనిసరిగా ఎదురవుతుంది.
"ఈ రోజు స్పెషల్ ఏమిటి"? అంజలిని దగ్గరికి తీసుకుని అడిగాడు
"ఈ రోజు మమ్మీ డాడీలా మ్యారేజ్ డే..వాళ్లకు ఈ రోజెస్ అమ్మిన డబ్బులతో మంచి గిఫ్ట్ ఇద్దామని.."
కార్తికేయకు కళ్ళు చెమర్చాయి..ఎంత మంచి ఆలోచన ?
వెంటనే పర్స్ లో నుంచి వెయ్యి రూపాయిల కాగితం తీసి అంజలికి ఇస్తూ "ఇదిగో ఈ బుట్టలోని గులాబీలు అన్నీ నావే" అన్నాడు. "కొన్ని గులాబీలకు ఇన్ని డబ్బులా" కళ్ళు వెడల్పు చేసి అంది.
"నీ బుగ్గల్లోని గులాబీలకు కూడా కలిపి" అంజలి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అన్నాడు. ఆ బుట్టలోని గులాబీలు ఎదురుగా వున్న స్కూల్ పిల్లలకు పంచాడు. అంజలి తల్లిదండ్రులను పలకరించి "మ్యారేజ్ డే విషెస్" చెప్పాలనుకున్నాడు. ఆఫీసులో ముఖ్యమైన పని వుండడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.
అంకుల్ ఈ రోజు మీకు పార్టీ ఇస్తాను, తప్పకుండా రావాలి" కార్తికేయ వెళ్తుంటే "టాటా" తో పాటు చెప్పింది.
అంజలి జీవితం లో అదే చివరి ఆనందమని ఆ క్షణం కార్తికేయ కు తెలియదు.

*****************

"యాసిడ్ యాసిక్ ఢిల్లీ లో అడుగు పెట్టాడుట" ఇరానీ హోటల్ లో కబుర్లు మొదలయ్యాయి.
"వాడి మీద రౌడీ షీట్ తెరవాలి" ఓ వ్యక్తీ కామెంట్.
సాధారణంగా ఇలాంటి అవసరమైన విషయాలు..అనవసరమైన చోట చర్చిస్తారు. ప్రాక్టికల్ గా ముందుకు రారు.
యాసిడ్ యాసిక్ సరిగా గంట తర్వాత రాణా సర్కిల్ లోకి అడుగు పెట్టాడు.

(ఆ తరువాత ఏమైంది ...రేపటి సంచికలో)

No comments: