ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

" ముగ్ధమోహనం " (4th chapter)

ఒక్క క్షణం...ఒకే ఒక్క క్షణం....మృత్యువుకు వెంట్రుక వాసి దూరంలో వున్న యాసిక్ ముగ్ధ రూపంలో రక్షించబడ్డాడు.
ట్రిగ్గర్ మీద బిగుసుకున్న అతడి చూపుడు వేలు..నిస్సహాయమైంది.
ముగ్ధ చూసిన బేల చూపులో ఎన్నో భావాలు.తనను చంపేస్తాడన్న భయం కన్నా, "మీరు ఓ వ్యక్తి ని నిర్దాక్షిణ్యంగా చంపేయవద్దు" అన్న అభ్యర్థన కనిపించింది.
ఆ రెప్పపాటు క్షణం చాలు...యాసిక్ లాంటి క్రిమినల్ ఎస్కేప్ అవ్వడానిక్
"థాంక్యూ మిస్టర్ ఎక్స్...అదేంటో మీ హీరోలకు వుండే వీక్నెస్...ఈ మంచితనమే...నెక్స్ట్ టైం బెటర్ లక్...ఈ ఖల్ నాయక్ ని పట్టుకోవాలంటే ఖలేజా వుంటే సరిపోదు..."యాంటీ సెంటిమెంట్" వుండాలి " అంటూ ముగ్ధను వెనక్కి తీసుకువెళ్ళి....బలం గా ముందుకు నెట్టాడు.ఆ విసురుకు ముగ్ధ బ్యాలెన్స్ తప్పి కింద పడబోయింది.
కార్తికేయ ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు. చిన్నపాటి కలవరం.....ఆసరా కోసం కార్తికేయ చేయి అందుకుంది.
ఇద్దరి చూపులు ఒకే సరళ రేఖ దగ్గర ఆగాయి.
*************** ### ********************* ### ************
"క్షమించండి...మీకు ఇబ్బంది కలిగించాను " ముగ్ధ అంది.
"ఇందులో ఇబ్బంది ఏముంది ? మీరెక్కడికి వెళ్ళాలో చెబితే అక్కడ దిగబెడతాను" ముగ్ధ వంకే చూస్తూ అన్నాడు. మొదటి సారి అతనిలో ఏదో వ్యక్తం చేయలేని ఫీలింగ్.
"నాకు ఢిల్లీ కొత్త..మా ఫ్రెండ్ తో వచ్చాను.పుట్టి బుద్దెరిగాక మొదటి సారి నాన్నగారిని, తమ్ముడ్ని వదిలి వచ్చాను...అయ్యో నా మతిమరుపు...అని నాలిక కరచుకొని "నా గురించి చెప్పనేలేదు కదూ....నా పేరు ముగ్ధ....బియ్యే పాసయ్యాను...టైపు ,షార్ట్ హ్యాండ్ వచ్చు...ఇదేమిటి పాతకాలం చదువు అనుకుంటున్నారా?నాకు ఇలానే ఇష్టం..." ముగ్ధ చెప్పుకుంటూ పోతుంటే "మంత్ర ముగ్దుడిలా" వింటున్నాడు.
ఆమెలోని అమాయకత్వం...నిజాయితీ...మాట తీరు బాగా నచ్చాయి.
"మా నాన్న గారిని ఒప్పించి, తమ్ముడ్ని వదిలేసి వచ్చాను. చిన్నప్పటి నుంచి తాజ్ మహల్ చూడాలని కోరిక...నన్ను ఇక్కడే ఉండమని చెప్పి, మా ఫ్రెండ్ డబ్బులు డ్రా చేయడానికి ఎటిఎమ్ దగ్గరికి వెళ్ళింది. తను వచ్చేస్తుంది...మీరు వెళ్ళండి" అంది ముగ్ధ.
"పర్లేదు...మీ ఫ్రెండ్ వచ్చేవరకు వుంటాను" అన్నాడు కార్తికేయ.
"వద్దొద్దు...మా ఫ్రెండ్ మరోలా అముకుంటుంది" అలా అంటున్నప్పుడు ఆమె మొహంలో సిగ్గు గులాబీ వర్ణంలోకి మారింది.
"సరే...పోనీ మీ ఫ్రెండ్ కు ఫోన్ చేయండి" అన్నాడు.
"నా దగ్గర ఫోన్ లేదు...మొబైల్స్ వాడితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట...ఆ రేడియేషన్ వల్ల చాలా ప్రమాదం ..అందుకే నాన్నగారు మొబైల్ కొనివ్వలేదు...నేను అడగలేదు..."
ముగ్ధ మాటలు ముచ్చటగా అనిపించాయి.
ఆమెను వదిలి వెళ్ళాలని అనిపించలేదు.అయినా తప్పదు.మొదటిసారి ఓ ఆత్మీయురాలిని వదిలి వెళ్తోన్న ఫీలింగ్.
"ఓకే అండీ ..జాగ్రత్త" అంటూ...ఆమెకు బై చెప్పి బయల్దేరాడు.
*******************************************************************************************************************************************************
రాత్రి పది దాటింది.
కార్తికేయకు నిద్ర రావడం లేదు.ఎందుకో ముగ్ధ గుర్తొస్తుంది.పెదాలమీద అప్రయత్నంగా చిన్న చిరునవ్వు.
కొన్ని పరిచయాలు చిత్రంగా వుంటాయి...విచిత్రంగా వెంటాడుతాయి...ముగ్ధ జ్ఞాపకంలా...
ఇప్పుడు ఏం చేస్తూ వుంటుంది? తనలానే...ఒక్క క్షణం తల విదిల్చాడు. ముగ్ధ ఫ్రెండ్ వచ్చి ఉంటుందా ?అసలే అమాయకత్వం? పైగా ఢిల్లీలో అత్యాచారాల ఉదంతాలు ఎక్కువయ్యాయి. ఆ ఆలోచన రావడం తోనే బయటకు పరుగు వేగంతో నడిచాడు..
రెండు నిమిషాల్లో కారు రోడ్డు మీదికి వచ్చింది...
స్పీడో మీటర్ ఆశ్వవేగాన్ని మించింది..యాక్సిలేటర్ మీద కాలు బలంగా పడింది.ఇరవై నిమిషాల్లో అక్కడికి చేరుకొని అక్కడి దృశ్యం చూసి షాకయ్యాడు.
******** *************** **********************
ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ అటు ఇటూ పచార్లు చేస్తుంది.
అలిసిన కళ్ళు వర్షించడానికి సిద్ధంగా వున్నాయి. ఎదురుగా కనిపించిన కార్తికేయను చూడగానే లేడి పిల్లలా పరుగెత్తుకు వచ్చింది, కార్తికేయను చుట్టేసింది.
కన్నీటి మేఘం కరిగి వర్షించింది. వెక్కుతోంది. అప్రయత్నంగా అతని చేయి ఆమెను చుట్టేసింది...నేనున్నాను అన్న అభయాన్ని..ఇచ్చింది.
"మా ఫ్రెండ్ రాలేదు...వెక్కిళ్ళ మధ్య చెప్పింది."ఎంత భయమేసిందో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి రెండు చేతులు చూపిస్తూ చెప్పింది."ఇంత భయమేసింది "
కార్తికేయ ముగ్ధ దగర నంబర్ తీసుకుని ట్రై చేసాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయబడడం లేదు.
"మీకు అభ్యంతరం లేకపొతే ఈ రాత్రి మా ఇంట్లో ఉండవచ్చు...రేప్పొద్దున మీ ఫ్రెండ్ ని వెతుకుదాం..." కార్తికేయ చెప్పాడు.
బుద్ధిగా తలూపింది.మెల్లిగా అంది..."ఒక మాట "
ఏమిటన్నట్టు చూసాడు కార్తికేయ
"మీరు రమ్మనగానే వస్తున్నానని నా గురించి తప్పుగా అనుకోవద్దు..ఏదో మీరు మంచివారిలా కనిపిస్తున్నారని ..."
ఒక క్షణం నవ్వొచ్చింది కార్తికేయకు ...కంట్రోల్ చేసుకున్నాడు.
******** ************* ****************************
"ఇంత పేద్ద ఇంట్లో మీరొక్కరే ఉంటారా? కార్తికేయని అడిగింది.
"ఈ చిన్న మనసుకు తోడుగా వుండే వారెవరూ లేరు" అని చెప్పలేక పోయాడు.
"ఇలా అడిగానని ఏమీ అనుకోకండీ ..ఏదో ఈ ఒక్క రాత్రి మీ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాను" అంది.
"హోటల్ నుంచి ఏమైనా తెచ్చేదా?అడిగాడు కార్తికేయ.
"ఎందుకూ ..వంటగది చూపిస్తే పది నిమిషాల్లో వంట చేసేస్తాను" అంది.
"వంట చేయడాని సరుకులు లేవు...నేను బయటే తింటాను..పోనీ ఫ్రిజ్ లో బ్రెడ్ వుంది. పళ్ళు వున్నాయి,. చెప్పాడు"
"నాకు ఆకలిగా లేదు...మరి మీరు ? అడిగింది ముగ్ధ.
"నాకేమీ తినాలని అనిపించడం లేదు..."అంటూ ఆమెకు గది చూపించాడు." గుడ్ నైట్ "చెప్పాడు.
************* ******************* *****************
రాత్రి పదకొండు దాటింది.కార్తికేయకు నిద్ర పట్టడం లేదు. పాపం ముగ్ధకు ఆకలి వేస్తూ వుంటుంది. బయటకు వెళ్లి ఏమైనా తెస్తే ?
ఆ ఆలోచన రాగానే తన గదిలోనుంచి బయటకు వచ్చి అలానే నిల్చుండిపోయాడు.కిచెన్ లో ముగ్ధ...పాలు వేడి చేసింది.అరటి పండు తోక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేసి...గ్లాస్ లో వేసింది.పాలు, అరటి పండు ముక్కలు కలిపి, పంచదార వేసింది. కార్తికేయ వెంటనే తన గదిలోకి వచ్చాడు.
పాపం ఆకలి వేస్తోంది కాబోలు...అనుకున్నాడు. అతని అంచనా తలకిందులు చేస్తూ...తలుపు మీద చిన్న శబ్దం చేసింది. తలుపు తీసాడు కార్తికేయ. గ్లాస్ తో వచ్చింది.
"ఖాళీ కడుపుతో పడుకోవద్దని మా నాన్నగారు చెబుతుంటారు. ఇదిగోండి పాలు,అరటిపండు...కలిపి తయారు చేసాను. ఆరోగ్యానికి కూడా మంచింది" అంటూ పాల గ్లాస్ ఇచ్చింది.
ఒక్క క్షణం కళ్ళ లో నీళ్ళు తిరిగాయి.
"అరరె ...కళ్ళలో ఆ నీళ్ళేమిటి ...నలుసు పడిందా అంటూ దగ్గరికి వచ్చి రెండు బ్రొటన వ్రేళ్ళతో కనురెప్పలు వెడల్పు చేసి "ఉఫ్" అని ఊదింది.
కళ్ళలో పడింది "నలుసు కాదు నీ రూపం, మనసు" అని చెప్పాలన్న బలమైన కోరికను అణుచుకున్నాడు.
"మరి మీకు?ఫ్రిజ్ లో పాలు గ్లాసుడు మాత్రమే వున్నాయి..."
"నాకు ఆకలి లేదు. మధ్యాహ్నం చక్కెర పొంగలి తిన్నాను"
చిన్నగా నవ్వి "ఫిఫ్టీ ఫిఫ్టీ" అని మరో గ్లాస్ తెచ్చి సగం ముగ్ధకు ఇచ్చాడు.
******** ********** ************
సరిగ్గా అదే సమయం యాసిక్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
భయంకరమైన విషసర్పాలు కొన్నే...అన్ని పాములు విషపూరితం కావు. కానీ విషసర్పం కన్నా ప్రమాదకరమైన వ్యక్తి యాసిక్ .
ఒక సారి తన మీద ఎవరైనా దృష్టిని సారిస్తే వెంటనే అతని క్రిమినల్ బ్రెయిన్ పదునెక్కుతుంది. ఎప్పుడైతే కార్తికేయ తన మీద ఎటాక్ కు ప్రయత్నించాడో ఆ క్షణం తన క్రిమినల్ నెట్ వర్క్ ను కదిలించాడు.
కార్తికేయ కస్టమ్స్ ఆఫీసర్ అని తెలిసింది.ఒక్క సారి కార్తికేయ నోటీసులోకి వస్తే ఆతను ఎవరినీ వదిలి పెట్టడని తెలిసింది.
తనూ కార్తికేయను వదిలిపెట్టకూడదు.
యాసిక్ చేతిలో యాసిడ్ బాటిల్.అతి భయంకరమైన యాసిడ్.
ఈ యాసిడ్ బాటిల్ కార్తికేయ అందమైన మొహాన్ని వికృతంగా మార్చాలి.
యాసిక్ అన్న పేరు వింటేనే జనం ఒంతొ వణుకు రావాలి.
సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో "కస్టమ్స్ ఆఫీసర్ కార్తికేయ పై యాసిడ్ దాడి "అన్న వార్త రావాలి.
అదే సమయంలో.....అమెరికా లోని ఓ రహస్య ప్రాంతంలో ఆల్ ఖైదా సమావేశమైంది. ఆ సమావేశం సమాచారం ఎఫ్ బి ఐ కి తెలిసిపోయింది. ఏజెంట్ ఫెడరిక్ ఏ క్షణమైన ఎటాక్ చేయవచ్చు.
ఈ సమావేశానికి మిస్సయిన వ్యక్తి ఒక్కరే....మనీకి స్మెల్లు, సెంటిమెంట్ ఉండవని నమ్మిన వ్యక్తి.
ప్రపంచం లోని అతి ప్రమాదకరమైన పది మంది నేరస్తుల లిస్టు లో వున్న.మో...హ...న.
ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. కాన్ఫరెన్స్హ హాలులోని సీక్రెట్ డోర్ ఓపెన్ అయింది. చక్రాలు కలిగిన శవపేటి లోపలికి వచ్చింది. వివిధ దేశాల నుంచి వచ్చిన తీవ్రవాద సంస్థల నేతలు ఉలిక్కి పడ్డారు.శవపేటిక ఓపెన్ అయింది, ఆటోమేటిక్ సిస్టంతో ..
లోపల...ఆల్ ఖైదాని తిప్పలు పెట్టిన అమెరికా గూడాచార సంస్థ ఏజెంట్ ఫెడరిక్ మృతదేహం.
అందరి దృష్టి ఆ కాన్ఫరెన్స్ హాలు ఎంట్రెన్సు వైపే....
( ఆ తర్వాత ఏమైంది? రేపటి సంచికలో...)
**కార్తికేయ..విసురజ ఒక్కరేనా? కార్తికేయ లాంటి జెంటిల్ మేన్ ఉంటారా?
ఇలాంటి ఉత్తరాల వర్షం రేపటి సంచికలో....

No comments: