ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

"ముగ్ధమోహనం" ( 5th chapter )
ఆరు గంటల , నలభై అయిదు నిమిషాలు....ఇరవై ఏడు పేజీలు ....
(ఈ చాప్టర్ రాయడానికి పట్టిన సమయం ఆరు గంటల నిమిషాలు...నలభై అయిదు నిమిషాలు...కేవలం అయిదు పేజీల చాప్టర్ కి , అయిదు వెర్షన్స్..నిన్నటి నుంచి ఫోన్ కాల్స్...ముగ్ధ ఎక్కడుందో చెప్పమని, కార్తికేయ ఎవరని ?
వీక్షకుల మనో మస్తిష్కంలో నిలచిపోయిన ఈ పాత్రలు ధన్యమయ్యాయి..
భయంగా ఉందా? అడిగాడు లాలనగా కార్తికేయ .
"భయమా? ఎందుకు ?
"ఒక అపరిచితుడి ఇంట్లో...ఒంటరిగా రాత్రి ఉండవలసి రావడం? పూర్తి చేయలేకపోయాడు.
చిన్నగా నవ్వింది.ముగ్ధ.
ఈ సంభాషణ రాసేక ముగ్ధ ఏం సమాధానం చెప్పాలి ?
కార్తికేయ మీద ముగ్ధకు వున్న నమ్మకం "అద్భుత రసం" అవ్వాలి.
అలా....అలోచించి రాసిన వాక్యం...
"స్మశానంలో వుంటే భయపడాలి కానీ...దేవుడి గుడిలో వున్న నాకు భయం ఎందుకు" ?
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే...రచయిత సంఘర్షణ...పాత్ర డామినేట్ చేస్తూ, వీక్షకులకు దగ్గరైనప్పుడు..రచయితకు పెరిగే బాధ్యత...తపన...ఎలా ఉంటాయో చెప్పాలనే...
ఇంకా ముగ్ధ హాంగోవర్ లోనే వున్నాను.
మీరు ముగ్ధ మీద చూపిస్తున్న అభిమానం మీదొట్టు. మోహన రేపే మీ ముందుకు వస్తుంది ---మీ విసురజ )
మౌనం మౌనాన్ని చూసి...శబ్దం నిశ్శబ్దం అవుతుంది...కొన్ని గంటల క్రితం ఇద్దరూ అపరిచితులే....కానీ కొద్ది నిమిషాల్లో ఎంతో పరిచయం వున్నా వాళ్ళయ్యారు.
"నాకు నిద్ర రావడం లేదు...కొత్త ప్రదేశం కదా....పైగా నా స్నేహితురాలు ఏమైందో? అంది కార్తికేయ ఎదురుగా నిలబడి.
"భయంగా ఉందా? అడిగాడు లాలనగా కార్తికేయ.
"భయమా? ఎందుకు" ?
"ఒక అపరిచితుడి ఇంట్లో...ఒంటరిగా రాత్రి ఉండవలసి రావడం? పూర్తి చేయలేకపోయాడు.
చిన్నగా నవ్వింది.ముగ్ధ.
బహుశ సన్నజాజులకు ఆ బ్రహ్మ దేవుడు నవ్వే వరం ఇస్తే ఇలానే ఉంటుందేమో...ముగ్ధ లానే సన్నజాజులు నవ్వుతాయి కాబోలు!
"స్మశానంలో వుంటే భయపడాలి కానీ...దేవుడి గుడిలో వున్న నాకు భయం ఎందుకు?
గుండె కవాటాల తలుపు తట్టినట్టు...కన్నీటి చెమ్మ మెరుపమ్మయి మెరిసి మురిసినట్టు....
"ఆర్ద్రతా....ఎందుకే ఆ భావోద్వేగ ప్రకంపనం? ఏవీ నిరుడు కురిసిన హిమసమూహాలు...నేడెందుకు హిమం వర్షించడం లేదు.?
శిథిల ప్రాయమైన తన ఇల్లు దేవాలయమా? శిలా సదృశ్యమైన తన దేహం దైవ సమానమా? ఓ తరుణీ...నువ్వెరవు?
కార్తికేయ ఆమె వంక చూస్తోండిపోయాడు..ఒక చిన్న అభిప్రాయాన్ని, గొప్ప భావంగా కమ్యూనికేట్ చేయడం ఎంత గొప్ప విషయం.
"ఏమండీ...మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడగొచ్చా?
"ఏమిటి? అన్నట్టు చూసాడు.
"ఒక మనిషి, మరో మనిషిని చంపవచ్చా? ఆ అధికారం మనకు ఎవరిచ్చారు?
ఉదయం జరిగిన సంఘటన గురించి అని అర్ధమైంది..
"అన్యాయం జరిగినప్పుడు...అధర్మం విర్రవీగినప్పుడు...అరాచకం పెచ్చుపెరిగినప్పుడు...ఆయుధం పట్టడం తప్పు కాదు. కురుక్షేత్రంలో అర్జునుడికి ఇదే సందేహం వచ్చింది" అని ఆగి ..
"మీ ప్రశ్నకు సమాధానం రేపు చెబుతాను " అన్నాడు.
"నాకు నిద్ర రావడం లేదు....ఏదైనా కథ చెప్పండి..అని వెంటనే "క్షమించండి... ఇంట్లో నిద్ర పట్టకపోతే నాన్న ను కథ చెప్పమనేదాన్ని.పోనీ మీకు అభ్యంతరం లేకపోతె మీ గురించి చెప్పండి.
"నా పేరు ముగ్ధ ...మా నాన్న పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. ఒక తమ్ముడు...అల్లరి...నేనంటే ప్రేమ రెండూ ఎక్కువే... కట్నం కింద నీతో పాటు నన్ను తీసుకువెళ్ళే బావగారినే పెళ్లి చేసుకో..." అంటాడు.
కోనసీమలో చిన్న పల్లెటూరు మాది. తాజ్ మహల్ చూడాలని చిన్ననాటి కోరిక. అంతే..."
మీ గురించి చెప్పండి?
"ఈ సామ్రాజ్యం లో నేనే రాజు ని ...నేనే బంటుని ...నేనే సైన్యాన్ని...యేలుకోవడానికి ప్రజలు లేని రాజుని...ఈ ఒంటరి ప్రపంచం లో నేనో అనాథని..."
చప్పున ముందుకు వచ్చి అతని పెదవులపై తన చేతిని వుంచి...
"పైన తథాస్తు దేవతలు వుంటారు.అలా అనకండి "
ఆ చేతిని తన గుండెలకు ఆన్చుకుని తన గుండె శబ్దాన్ని ఆమెకు వినిపించాలని అనిపించింది.
అలిసిన ఆమె కళ్ళలో గొప్ప సౌందర్యాన్ని ఆ విధాత నిక్షిప్తం చేసాడేమో....అనిపించింది.
చిన్న పిల్లలా గల గల మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకుంది, సోఫాలో, కూచోనే...
ఉదయం నుంచి అలిసిపోయి వుంటుంది.నిద్రలో అమ్మాయిలు ఇంత అందంగా ఉంటారా?
మెడ ఓ పక్కకు వాలింది. నిద్రలో లేపితే డిస్ట్రబ్ అవుతుంది. తన గదిలో ఓ అమ్మాయి...ఊహించని విషయం.
ఈ గది తన మదిగా మారిపోతే ఎంత బావుండు...?
ఒక్క క్షణం "సందేహించి, మరు క్షణం "ముగ్ధ"ను రెండు చేతుల్లో తీసుకుని తన మంచం మీద పడుకోబెట్టాడు. తలను ఎడమ పక్కకు వాల్చింది. దిండు మీద తల సరి చేసాడు. చెదిరిన పైట సరిచేసాడు.
ఒక్క క్షణం ...,ఉద్వేగ కణం ..కడలి కెరటం అయింది.
గాలికి చెదిరిన ఆమె ముంగురులు సరిచేస్తూ, కిందికి వంగి ఆమె విశాలమైన నుదురుని చుంబించాడు.
"విధాతా...నీ లలాట లిఖితం నాకు తెలియదు. కానీ నా తల రాతను ఈ అమ్మాయి నుదురు మీద పునర్లిఖించాను. నా సాహసాన్ని మన్నించి..ఈ అమ్మాయిని శతాయుష్మాన్ భవ అని దీవించు".
తథాస్తు దేవతలు "తథాస్తు" అన్నారు
నిశ్శబ్దంగా వెనుతిరిగి బయటకు నడిచి ఆ గది తలుపు వేసాడు.
ముగ్ధ కంటి నుంచి సన్నటి కన్నీటి ధార...ఆమె చెంపల నుంచి జారింది.
అమ్మాయి పైట ఎప్పుడు జారుతుందా అని ఎదురుచూసే మదనుల, మగ పురుషుల ప్రపంచంలో, ఒంటరిగా ఓ అందమైన ఆడపిల్ల నిద్రలో వున్నా,అమ్మలా పైట సర్ది, నాన్నలా ముద్దు పెట్టి,
నా మనసైన వాడిగా ఆ విధాతనే కదిలించిన ..నా ప్రాణమా....ఏమిటీ విచిత్రం ?
మోహన రేపే మీ ముందుకు వస్తుంది
(ఈ విచిత్రం ఏ మలుపు తిప్పుతుంది? రేపటి సంచికలో)

No comments: