ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

కవిత: సంకురాతిరి సంబరాలు
.....................................
కాలం పలికే పుష్యమాసంకు స్వాగతం
ధర్మ ధనుర్మాసపు అంపే వీడ్కోలుతో
చలిపులికి చుట్టమై ఋతువు హేమంతం
కులకాంతను మరీ మరీ గుర్తుచేసే ఏకాంతంలో
ధనుస్సు నుంచి మకరంకి ఆదిత్యుని గమనంతో
భోగి సంక్రాంతి కనుమ పండుగలు ధరను వచ్చే
లోగిలిలో అమ్మలక్కల పలకరింపుల పరాచికాలు
ముంగలిలో రంగు రంగుల ముగ్గులతో స్పర్దాటలు
పైరు ఊడ్చిన చేలలో కంకులు రాలంగ
పిచుకలు వాటిని తినులే కిచకిచల నడుమ
తెల్లారకనే ఇంటిముందర వెలిగే భోగిమంటలు
తలార స్నానాలు నింగిలో పతంగాల రెపరెపలు
హరిదాసుల కీర్తనలు బసవన్నల శషబిషలు
పులివేషాలు కోలాటాలు కొత్త అల్లుళ్ళ రాకపోకలు
పిల్లలకు పోయు భోగిపళ్ళు బొమ్మల కొలువులు
బుడబుక్కలోళ్ళ విన్యాసాలు జోరైన కోడిపందాలు
చూడంగ యివన్నీ పండు కన్నుల కాంతి పూవులు
సుఖదుఃఖాలు జీవితంలో కాగలవు నిఖార్సైన సత్యాలు
బూరెగారెలలోని తీపికారాల మేళవింపులల్లే మిశ్రమఫలాలు
ఎదగోదాములు నింపే సంకురాతిరి సరదా సంబరాలు
తెలుగువారి బ్రతుకులో మిళితమైన స్వరనీరాజనాలు
విసురజ

No comments: