ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (36th chapter)
(02-03-2013)
.............
ట్యాంక్ బండ్...
వర్షానికి ముందు మట్టి వాసన తాలూకు అనుభూతి ఎంత బావుంటుంది?
ఎందుకో అలాంటి ఫీలింగ్ కలిగింది ముగ్ధకు
అర్ధరాత్రికి ఇంకా కొద్దిగా టైం బాకీ వుంది.
నందమూరి తారకరాముడి ఊహలలోని సొబగే ట్యాంక్ బండ్ అందాలకు చిరునామా....ఎదురుగా బుద్ధ విగ్రహం...ఏకశిలా విగ్రహం...
ఒక సారి నీటిలో మునకేసినా దర్జాగా నిలచి వున బుద్ధుడు....కొత్త అందాలతో మెరుస్తున్నాడు.
రెయిలింగ్ కు ఆనుకుని నిలబడి తదేకంగా బుద్ధ విగ్రహం వైపే చూస్తోంది ముగ్ధ.
పూర్ణిమ ముగ్ధ వైపు చూసి, నువ్వు నువ్వేనా? అంది.
"ఎందుకలా అడిగావు? ముగ్ధ అడిగింది.
"ఎందుకంటే ఊరొదిలి రాని నువ్వు వందల మైళ్ళు దాటి వచ్చావు...నన్నూ లాక్కోచ్చావు...
లాక్కోచ్చావ్ పో...అక్కడితో ఊరుకున్నావా?
రాత్రి తొమ్మిది కొడితే ముసుగు తన్నే నువ్వు...ఎంత రాత్రి అయినా వెనక్కి వెళ్ళిపోదామనే అనే నువ్వు ..ఈ టైంలో ఇక్కడికి తీసుకువచ్చావు?
ముగ్ధూ..నువ్వు చాలా మారిపోయావు, ఎదిగిపోయావ్ ..." ముద్దుగా అంది పూర్ణిమ.
"ఏమో తెలియదు పూర్ణిమా ..కానీ నాకీ రోజు చాలా సంతోషంగా వుంది.
సంగీత రాణి లక్ష్మిగారిని కలిసాను...ఆవిడ అంగీకారం తీసుకున్నాను...
నా మనసులో ఏదో చెప్పలేని భావం...నా కార్తికేయ ఇక్కడే నా ఎదురుగా వున్నట్టుగా ....
అదే సమయంలో ట్యాంక్ బండ్ మీదుగా హెలికాప్టర్ ఎగురుతుంది....చాలా కింది నుండి...
మాట్లాడ్డం ఆపి పైకి చూసింది.పూర్ణిమ కూడా....
"చిన్నప్పుడు విమానాలు ఎగురుతూ వుంటే బయటకు వచ్చి చేతులు వూపేవాళ్ళం కదా" పూర్ణిమ అంది.
అవును..వాళ్లకు టాటా చెప్పడం అన్న మాట..అంటూ అప్రయత్నంగా చేతులు గాల్లోకి లేపింది.
ఏదో భావం..ఏదో పరిమళం..ఏదో తన మనసును చుట్టుముడుతున్నట్టు...
ఆ హెలికాప్టర్ ఢిల్లీ వైపు వెళ్తోంది. అందులో వున్నది కార్తికేయ.
ఏ రచయితా సృష్టించని సృష్టించలేని మెలోడ్రామా విధి ద్వారా జీవితంలో తారస పడుతూ వుంటుంది.
******************************************************************************************************************************
రాధారాణి మోహన వైపే చూస్తోంది.
"చెప్పండి మిస్..." అని ఆగింది .
"మీ ఐ క్యూ చూస్తోంటే ముచ్చటేస్తుంది. కరెక్ట్ గా గెస్ చేసారు? అంత కరెక్ట్ గా ఎలా గెస్ చేసారు.
"డబ్బు కోసం నన్ను కిడ్నాప్ చేయడానికి నేను బిజినెస్ విమెన్ ని కాదు...
నా లాంటి డాక్టర్ని ఇలాంటి పనుల కోసమే కిడ్నాప్ చేస్తారు" రాధారాణి అంది కూల్ గా.
"గుడ్ ...గుడ్ ఎనాలిసిస్ ...మీరు ఇద్దరమ్మాయిలకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి..." మోహన చెప్పింది.
"మంటల్లో లేదా యాక్సిడెంట్ లో మొహం కాలిపోయిందా? రాధారాణి అడిగింది.
"నా మొహం చూస్తోంటే కాలిపోయిన మొహంలా కనిపిస్తుందా? నాకు తెలిసి నావి మిస్
యూనివర్స్ కొలతలు..." కాసింత గర్వంగా అంది, మోహన
రాధారాణి ఓ సారి మోహన వైపు చూసింది...మోహన అన్నదాంట్లో అతిశయోక్తి లేదు...చాలా అందంగా వుంది.
"యస్ ..మీరు చాలా అందంగా వున్నారు" సిన్సియర్ గా అంది రాధారాణి.
"టు బి ఫ్రాంక్, మీరూ బావున్నారు ...ఐ థింక్ ఫార్టీ ప్లస్ అయినా మంచి ఫిజిక్" అంది మోహన.
రాధారాణికి నవ్వొచ్చింది. తను కిడ్నాప్ అయింది. తనకు కిడ్నాపర్ కు మధ్య ఇలాంటి సంభాషణ?
"రాధారాణి గారు...ఇప్పుడు చెప్పండి...నాకు మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి...నాతొ పాటు మరొకరికి..."
అంటే...?
"నన్ను మరొకరిగా మార్చాలి...మరొకరిని నన్నుగా మార్చాలి".
"మీరు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూస్తారా? ఎందుకంటే మీ ఆలోచనలు...ప్లాస్టిక్ సర్జరీ టెక్నికల్ నీడ్, అని రాధారాణి ఆగింది.
"పోనీ అలానే అనుకోండి, నాకు తెలిసి ఇంగ్లీష్ సినిమాలోనే కాదు కదా ఏ భాషా చిత్రంలోనూ లేని ట్విస్ట్ ఇందులో వుంది, అంది మోహన.
ఈ లోగా ఈ డి.వి డి చూడండి.
మాంచి థ్రిల్లర్...అంటూ డి వి డి ప్లేయర్ లో డి వి డి పెట్టి రిమోట్ రాధారాణికి ఇచ్చి బయటకు నడిచింది మోహన.
ఆ గదిలో వున్న రహస్య కెమెరాలు రాధారాణిని కవర్ చేస్తున్నాయి.
టీవీలో డి వి డి ప్లే అవుతుంది. అది మోహన నేర చరిత్రకు సంబంధించింది. ఆమె మీద వున్న నేరాలు...
ఇంటర్ పోల్ వెతుకులాట...రెడ్ కార్నర్ నోటీసు...ఒకో క్లిప్పింగ్ చూస్తోంటే రాధారాణికి చెమటలు పడుతున్నాయి.
తనను కిడ్నాప్ చేసింది ఒక అంతర్జాతీయ నేరస్తురాలా?
టీవీ కట్టేసింది. మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంది. ఎదురుగా టేబుల్ మీద ఫోటో...రెడ్ కలర్ మార్కర్ పెన్ తో రౌండప్ చేసి వుంది..,
ఆ ఫోటోను ఎక్కడో చూసినట్టు అనిపించింది. యస్ తను కాన్ఫెరెన్స్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు రవీంద్ర భారతి దగ్గర రోడ్డు క్రాస్ చేస్తూ...వుండగా చూసింది.
ఆ ఫోటో ముగ్ధది.
*******************************************************************************************************
కార్తికేయ ఆలోచనకు వెనక్కి వెళ్ళాయి. ఏ సినిమాలోనూ చూడని సన్నివేశం...ఎదురవ్వని సంఘటన...
ఆ రోజు బాగా గుర్తుంది కార్తికేయకు...కొలీగ్ను పరామర్శించడానికి హాస్పిటల్ కు వెళ్ళాడు. అక్కడో హృదయవిదారక సంఘటన కనిపించింది.
ఓ మహిళకు పురిటినొప్పులు...బిడ్డ అడ్డం తిరిగింది. తల్లీ బిడ్డ బ్రతకాలంటే మరో పెద్ద ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి.
పెళ్ళైన పదిహేనేళ్ళకు బిడ్డ పుట్టబోతుంది. అంబులెన్స్ రెడీగా లేదు..పార్లమెంట్ కు సమీపంలో వున్న ఆ హాస్పిటల్ నుంచే మరో హాస్పిటల్ కు వెళ్ళాలి.
రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్ళటానికై సెక్యూరిటీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేసారు. రాష్ట్రపతి వెళ్ళే వరకూ ఎవరూ ఆ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు.
మరో దారిలో వెళ్ళాలంటే రెండు గంటలు పడుతుంది.
కార్తికేయ ఒక్కటే ఆలోచించాడు. తల్లీ బిడ్డ ముఖ్యం. ఆ సమయంలో ఫ్రోటోకాల్...కన్నా తల్లి పుట్టబోయే బిడ్డ ప్రాణాలు ముఖ్యం.
ఆ గర్భిణీ స్త్రీ ని ఆమె భర్తను తన కారులో ఎక్కించుకున్నాడు. రాష్ట్రపతి కాన్వాయ్ ని చేదించి కారు దూసుకు వెళ్ళింది.
సెక్యూరిటీ, కాన్వాయ్ ఎలర్ట్ అయింది.
కారును ఆపండి...కుదరకపోతే పెల్చేయండి. సెక్యూరిటీ చీఫ్ ఆదేశించాడు.
దండులా కదిలింది ఢిల్లీ పోలీస్.
********************************************************************************************************
(కార్తికేయ ఏం చేసాడు? రాధారాణి పరిస్థితి ఏమిటి? రేపటి సంచికలో)

No comments: