ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

Chapter:54

ఊహించని ఆ ప్రశ్నకు జర్దార్ షాక్ తిన్నాడు.కార్తికేయ దగ్గర దబాయించి లాభం లేదని తెలుసు....
"నిజంగా నాకు తెలియదు "జర్దార్ అన్నాడు.
"పోనీ ఖాసిం ఎక్కడున్నాడు? కార్తికేయ అడిగాడు .
"హైదరాబాద్ వెళ్ళిపోగానే అతనితో  నాకున్న కాంటాక్ట్స్ తెగిపోయాయి."
"నీ బిడ్డను ఏం చేయాలని అనుకుంటున్నావ్? సూటిగా అడిగాడు కార్తికేయ.
ఆ ప్రశ్న జర్దార్ కు సరిగ్గా అర్ధం కాలేదు.
"అంటే...లాయర్,పోలీస్.డాక్టర్.కలెక్టర్..పోనీ నీలా ఓ దేశద్రోహి ..."
"వద్దొద్దు..నా బిడ్డ ఈ తుపాకుల మధ్య బ్రతక కూడదు."వెంటనే అన్నాడు.
"మీ అమ్మ,నాన్న కూడా నీలాగే కోరుకుని నిన్ను పెంచి వుంటారు..."
తల దించుకున్నాడు జర్దార్...నిమిషానికి సగటున ఇద్దరు ఉగ్రవాదులు...గంటకో మారణహోమం సృష్టించే దేశద్రోహులు....వందేళ్ళు కూడా బ్రతకలేని ఆయుషు లో ,నిరంతరం తుపాకీ మోతల మధ్య ,ఉగ్రవాదం,మతోన్మాదం,తీవ్రవాదం..దేశద్రోహం..వీటి సహవాసం తో భయం తో బ్రతుకుతూ,భయం లోనే చచ్చే బ్రతుకు....
"నీకు మాట ఇస్తున్నాను జర్దార్..నీ బిడ్డను దేశానికి పనికి వచ్చే సిపాయి గా నేను పెంచుతాను...నా బిడ్డగా చూసుకుంటాను...నీ ఆత్మ సంతోషించేలా..కానీ ఫ్రెండ్ నిన్ను మాత్రం చంపకుండా వదిలిపెట్టలేను...నా ముగ్ధను కిడ్నాప్ చేసినా క్షమించాను..కానీ ఎందరో అమాయకుల ప్రాణాలు తీసావు...కేవలం నీ ఒక్కగానొక్క బిడ్డ మీద మమకారం తో నిజం చెప్పావు...యుద్ధం లో కనికరం వుండకూడదు....రాచపుండు సోకిన శరీరాన్ని నరికి వేయక తప్పదు..."
జర్దార్ లో ప్రాణభయం పోయింది.కన్నీళ్లు అతని బుగ్గలను తడిపేస్తున్నాయి.కార్తికేయ ఎప్పుడైతే....
"నీ బిడ్డను దేశానికి పనికి వచ్చే సిపాయి గా నేను పెంచుతాను...నా బిడ్డగా చూసుకుంటాను...అన్నాడో ...
అప్పుడే చచ్చిపోయాడు.
"అల్లా....నా తప్పులకు ప్రాయశ్చిత్తం లేదు...నా మరణం ఈ ప్రపంచానికి  ఒక హెచ్చరిక కావాలి...ఒక దేవుడి దగ్గర నా బిడ్డ పెరిగే అవకాశం ఇచ్చిన నీకు కృతఙ్ఞతలు..."
కళ్ళు మూసుకున్నాడు....కార్తికేయ వైపు తిరిగి అతని ముందు మోకాళ్ళ మీద కూచోని "మిత్రమా....నీ పని కానివ్వు...సంకోచించకు...కానీ ఒక్క మాట...నీ తండ్రిని చంపేసాను అని నా బిడ్డకు చెప్పకు...."
కార్తికేయ జర్దార్ భుజం పట్టుకుని లేపాడు.....
"ఒక మనిషిని ...ఒక సారి చనిపోయిన మనిషిని మరో సారి చంపలేను..నీ బిడ్డని అనాథని చేయను.ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను....ప్రభుత్వం దృష్టిలో,ఉగ్రవాదుల దృష్టిలో ,లెక్కల్లో చచ్చిపోయావు...నీ బిడ్డ దగ్గరికి వెళ్ళు..."
జర్దార్ కార్తికేయ పాదాల మీద పడ్డాడు....అతడిని లేపి హత్తుకున్నాడు....
"దోస్త్ ...నేను అల్లా సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను...ఈ శరీరం నీది...నీ కోసమే ఈ శరీరాన్ని కాపాడుకుంటాను...నీ కోసమే ఈ ప్రాణాన్ని అంకితం చేస్తాను.అవసరమైతే బలి చేస్తాను "
ఆ గదిలోకి అడుగు పెట్టిన మేనేజర్ ఆ దృశ్యం చూసి అలానే ఉండిపోయాడు.

జర్దార్ ఒక్కో నిజం మనస్ఫూర్తిగా కార్తికేయకు చెబుతున్నాడు....

(పై సన్నివేశాన్ని రాయడానికి అయిదు గంటల సమయాన్ని తీసుకున్నాను...ఈ ధారావాహికలో ముందుగా నేను పంపించిన స్క్రిప్ట్ ప్రకారం జర్దార్ ని కార్తికేయ చంపేస్తాడు...రాత్రి పద కొందు గంటల ప్రాంతం లో చీఫ్ ఎడిటర్ ,ప్రముఖ రచయిత విజయార్కె గారికి ఫోన్ చేసాను...జర్దార్ ని చంపకుండా వదిలి వేస్తే...?ఒకప్పుడు సిక్వీని నిర్దాక్షిణ్యం గా చంపిన కార్తికేయ జర్దార్ ని ఎందుకు వదిలివేయాలి...?అప్పుడు వచ్చిన ఆలోచన జర్దార్ కి కొడుకు వుండడం..అదీ నిస్సహాయ  స్థితిలో...
ఒక దేశద్రోహి కొడుకుని తన బిడ్డలా చూసుకుంటానని కార్తికేయ చెప్పడం...నీ బిడ్డ ఏమవ్వాలని కోరుకున్తున్నావ్ ? అని అడిగినప్పుడు నాలా కాకూడదన్న జర్దార్ మాటలు...అతనిలోని పశ్చాత్తాపం ...భావోద్వేగాలతో సాగింది.బిడ్డని అనాథని చేయడం కార్తికేయ పాత్ర ఔచిత్యానికి భంగం కలిగిస్తుందని నా మనసుకు తోచింది.అందుకే జర్దార్ ని వదిలి వేయడం జరిగింది.ఆ విషయాన్ని కార్తికేయ తో చెప్పించడానికి వాక్యాలను వెతుక్కున్నాను.అలా పుట్టిన వాక్యం..."ఒక మనిషిని ...ఒక సారి చనిపోయిన మనిషిని మరో సారి చంపలేను.'నీ బిడ్డని అనాథని చేయను."
తెల్లవారు ఝామున నాలుగు గంటలకు మార్చిన స్క్రిప్ట్ ని మెయిల్ చేసాను...నేను ముగ్ధమోహనాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి....రచయిత తను సృష్టించే కథను,కొనసాగించే కథనాన్ని తపస్సులా భావిస్తాడని చెప్పడానికే...మీ అభినందన...హిమ వర్షం లో తడిచే ఒక్క క్షణమైనా చాలు.
విసురజ....)
జర్దార్ అక్కడిని నుంచి వెళ్ళిపోయాడు...వెళ్ళే ముందు కార్తికేయ ముందే తన ఫోన్ సిమ్ తీసి ముక్కలు చేసాడు...తన దగ్గర వున్న బ్యాంకు  అకౌంట్స్ వివరాలు అందజేశాడు...ఆయుధాలు సరెండర్ చేసాడు.ఆ తర్వాత జర్దార్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు...కానీ జర్దార్ చనిపోయిన విషయం ,అతని డెడ్ బాడీ గుర్తు పట్టడానికి వీల్లేకుండా వున్న సంగతి...ఖాసిం కి తెలిసిపోయింది.తెలిసి పోయేలా చేసాడు కార్తికేయ..మార్చూరీ లో అనాథ శవాలకు కొదువ లేదు....ఒక మంచి పని కోసం ,జర్దార్ కు ప్రమాదం లేకుండా వుండడం కోసం కార్తికేయ వేసిన ప్లాన్.
                                                        ********************************************
ముగ్ధ తలుపులన్నీ వేసి తన గదిలోకి వచ్చింది.చీర అడుగున వున్న ఫాల్ ని చేతిలోకి తీసుకుంది.ఆ ఫాల్ లో సిమ్ వుంది.దాన్ని తన సెల్ లో పెట్టింది.ఓ నంబర్ డయల్ చేసింది.
అది జర్దార్ నంబర్ ...ఎంత చేసినా నో రెస్పాన్స్ ...వెంటనే మరో నంబర్ కి డయల్ చేసింది...అవతలి నుంచి ఓ గొంతు వినిపించింది.

"చెప్పండి మోహన జీ..."

"ఆ జర్దార్ కి  ఏమైంది...రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు..."
"సారీ...మేమ్...జర్దార్ ని కార్తికేయ చంపేసాడు...ఇప్పుడే ఈ న్యూస్ తెలిసింది.డెడ్ బాడీ ముంబై   జనరల్ 
హాస్పిటల్  మార్చురీ లో వుంది. హాస్పిటల్ చుటూ మఫ్టీలో పోలీసులు వున్నారు.అతని డెడ్ బాడీ ని మనం తీసుకురావడం కష్టం."
"షిట్...అయినా ఇప్పుడు చనిపోయినవాడి డెడ్ బాడీ తో మనకు పని ఏమిటి? టైం వేస్ట్...కాకపొతే జర్దార్ మన రహస్యాలు చెప్పి చచ్చాడా? చెప్పక చిత్రహింసలతో చచ్చాడా ?అన్నది పాయింట్...ఎందుకైనా మంచిది....నేను చెప్పినట్టు చేయండి...అంటూ ఏం చేయాలో చెప్పసాగింది.
అప్పుడే  ఎవరో ఆ ఇంట్లోకి వచ్చిన అలికిడి.
సెల్ ఆఫ్ చేసి...తన ఒంటి మీద వున్న చీర విప్పేసింది...క్షణాల్లో జీన్స్ లోకి మారింది.అప్పుడే ఆమె గది తలుపులు తెరుచుకున్నాయి.ఇద్దరు అపరిచిత వ్యక్తులు లోపలి వచ్చారు.వాళ్ళ చేతుల్లో...ఆయుధాలు...కన్ను మూసి తెరిచేలోగా టేబుల్ దగ్గరికి వెళ్లి టేబుల్ మీద వున్న రివాల్వర్ ని అందుకుని వాళ్ళ వైపు గురిపెట్టింది.ట్రిగ్గర్ నొక్కింది...ముగ్ధ.....స్థానం లో వున్న మోహన.
           ***********************
(ఆ తర్వాత ఏమైంది ?ఆ అపరిచితులు ఎవరు ?రేపటి సంచికలో ) 

No comments: