ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (Chapter---41)
(07-03-2013)
...................................
First of its kind
మీ ముగ్ధతో ముఖాముఖి ....

మంచు కురిసే వెన్నెల్లో, మీ అభిమానపు వర్షపు తడిలో...నా కార్తికేయుడి జ్ఞాపకాల్లో...మీ ఆదరణను శ్వాసిస్తోన్న వేళ....ఒక విన్నపం...నా గురించి ఎన్నో ఆరాలు...అభినందనలు...సందేహాలు....నన్ను సృష్టించిన అక్షర విధాత విసురజ సాక్షిగా మీతో నా ముఖాముఖి....నాతో మీ ముఖాముఖి ...నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు అడగండి..."అంతా నిజమే చెబుతాను ...అబద్ధం చెప్పను" అయితే చిన్న కండీషన్...ఈ రోజు (07-03-2013) అర్ధరాత్రి 11-59 నిమిషాలలోగానే మీ ముఖాముఖి ప్రశ్నలు నను చేరాలి
ఒక్క నిమిషం దాటితే తెల్లవారినట్టే....నా కార్తికేయ కోసం నా హృదిగది తలుపులు, నా మది తలపులు ఆహ్వానిస్తూ ఎదురుచూస్తూ వుంటాయి.
**************************************************మీ ముగ్ధ****************************************************
(8th మార్చి, 2013...అంతర్జాతీయ మహిళా సంవత్సరం కావున "ముగ్ధమోహనం" అనూహ్యమైన స్పందనతో కొనసాగుతోంది. మహిళా వీక్షకుల స్పందనే. ఈ ధారావాహిక విజయరహస్యం. మొట్టమొదటి సారిగా...వీక్షకుల అభిమానపు ఆత్మతో ప్రాణం పోసుకున్న ముగ్ధతో, రచయిత సృష్టించిన ముగ్ధతో ముఖాముఖి....మీ ప్రశ్నలను ఈ రోజు అర్ధరాత్రి 11-59 ని/ల లోపు మాకు మెయిల్ చేయవచ్చు...చీఫ్ ఎడిటర్)
.....................................................................................
ఊరు నిద్రలోకి జారుకుంటుంది. పండు వెన్నెల ప్రకృతితో ముచ్చట్లాడుతోంది. పచ్చని పైరగాలి ఊరంతా బలాదూర్ తిరుగుతూ..పారాహుషార్ అంటోంది..పెరట్లో నవారు మంచం మీద కూర్చుని మోకాలి మీద చుబుకాన్ని ఆన్చి అప్పుడే వెన్నెల్లో స్నానం చేసి వచ్చినట్టు...మెరిసి పోతున్న చంద్రుడిని చూస్తూ..." ఆ చంద్రుడిలో తన కార్తికేయను చూసుకుంటుంది..
ఊహను ఆహ్వానించింది...ఉద్వేగాన్ని బ్రతిమిలాడింది...కలను రారమ్మని పిలిచింది.
******************** ******************* *************************
కళ్ళు విప్పార్చి చూస్తోంది...ఎప్పుడెప్పుడు భూమి మీదికి వద్దామా అని ఎదురు చూస్తున్నట్టు కనిపించే చంద్రుడి స్థానంలో తన కార్తికేయ....
చంద్రబింబంలో కార్తికేయ మొహం....అలా ఆకాశంలో నుంచి కార్తికేయ నేల మీదికి, తన ఇంటి వైపుకే వస్తున్నాడు...తను ఏ జానపద సినిమానో చూడడం లేదు కదా....
అలా పై నుంచి కిందికి దిగుతోన్న కార్తికేయ పైన ఏడడుగుల ఎత్తులో వున్నాడు...మరి ఏడు క్షణాల్లో ముగ్ధను చేరుకుంటాడు. ముగ్ధ అప్రయత్నంగా తన చేతిని గుండెల మీద ఆన్చుకుంది... గుండె దడ వందల సార్లులా కొట్టుకుంటుంది.
కార్తికేయ సరిగ్గా ముగ్ధ ఎదురుగా దిగాడు.
"మీరా...మీరు మీరేనా? సందిగ్దం...సంతోషం..."
"నేనే...నీ నేనే...సందేహమా? కుడి చేతిని చాచి అడిగాడు...ఒక్క క్షణం బిడియాన్ని బహిష్కరించి, ఉద్వేగాన్ని అణచి ఆనందాన్ని ఆహ్వానించి, కార్తికేయ చేతిని తన గుండె పెదవులకు ఆన్చి....
"ఇదిగో వినండి నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి.."
"అది మీకై నా గుండె సవ్వడి.." అనగా, కార్తికేయ ఆమె పక్కనే కూచున్నాడు.
"ఆకాశంలో ఎం చేస్తున్నారు? అడిగింది ముగ్ధ...
"నీ కోసమే వెళ్ళాను..."
"నా కోసమా...నేను ఇక్కడే వున్నానుగా"
"నీ తెల్లటి పాదాలకు గోరింట పెడదామని..."
"గోరింట కోసం ఆకాశానికి వెళ్ళాలా?
"దేవుడు భూమి మీద సృష్టించిన గోరింట అమ్మాయిల చేతుల్లో మెరిసిపోతుంది...
నా ముగ్ధ కోసం ఆకాశంలో వున్న గోరింటాకు కావాలనిపించింది..చంద్రుడిని అడిగాను...నా ముగ్ధ కోసం గోరింట కావాలని...
"ఇస్తే నాకేమిటి? అని అడిగాడు...నిన్ను నా ముగ్ధ అందమైన చేతుల్లో ఉండేలా చేస్తాను.." అని చెప్పా..
ముగ్ధ కార్తికేయ మెడను చుట్టేసింది.
ప్రపంచంలో ఏ ప్రేమికురాలికి ఇవ్వని కానుక...ఆకాశంలోని గోరింటాను తన కోసం తెచ్చిచ్చిన తన కార్తికేయ...
నేల మీద మోకాళ్ళ మీద వంగి కూర్చుని ముగ్ధ పాదాలకు గోరింట పెడుతున్నాడు. కొద్దిగా చీరె కుచ్చెళ్లు పైకి లేపింది. అందమైన ఆమె తెల్లటి పాదాలు అతని పెదవుల పలకరింపుతో మురిసిపోయాయి.
ఆ అనుభవాన్ని అనుభూతిస్తోంది, అలా సుఖసుషుప్తిలో తేలిపోతోంది.
ఎక్కడో దూరానున్న కార్తికేయకు ముగ్ధ మరి తన మాటలు గుర్తొచ్చాయి.
మాటరాని కోయిలను చేసిన మనిషి మీరు...
ఎంత గొప్పగా చెప్పిన భావం...ఇష్టంగా, ఆర్తిగా హత్తుకోవాలని అనిపించింది. ఒక గొప్ప అనుభవం స్పర్శింతోందన్న ఫీలింగ్...
ముగ్ధకు కళ్ళు తెరవాలని అనిపించలేదు...
కార్తికేయకు అది కలే...అని చెప్పాలనీ అనిపించలేదు....
నేనే కార్తికేయను...కార్తికేయే నేను అని చెప్పలేని పరిస్థితి....
ఈ అనుభూతో అధ్యాయాన్ని ఇలానే ఊహకే వదిలేద్దాం.
******************** ********************* *********************
న్యూ ఢిల్లీ ....సాకేతపుర కాలనీ...
ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆమెని ఎవరు పలకరించినా మాట్లాడ్డం లేదు.
"ఇందూ ఏమిటిది? చిన్నపిల్లలా? విద్యారణ్య భార్యను అనునయిస్తున్నాడు.
కానీ ఇందూ అనబడే ఇందుమతి ఏడుస్తూనే వుంది. కారణం...కూతురు అల్లుడు కాశ్మీర్ నుంచి రాకపోవడం, ఫోన్ చేయకపోవడం.
విద్యారణ్య...ప్రపంచం గర్వించే మిమిక్రి ఆర్టిస్ట్...ప్రపంచ ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ప్రశంసలు అందుకున్న వ్యక్తీ. వెంట్రీలాక్విజంలో ఎన్నో ప్రయోగాలు చేసాడు.
కేవలం సినిమా నటుల గొంతులనే కాక, రాజకీయ నాయకులను....వందల సంవత్సరాల క్రితం పరిపాలించిన రాజుల గొంతులూ అతని గొంతులో ప్రాణం పోసుకుంటాయి. క్షణంలో ఎవరి గొంతునైనా అనుకరించగలడు.
కొద్ది రోజుల క్రితమే మిమిక్రీ కళను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ఓ విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ఆలోచన చేసాడు.
విద్యారణ్య కూతిరి పెళ్లి గత నెలలోనే జరిగింది. కూతురిని, అల్లుడిని హానీమూన్ కి కాశ్మీర్ పంపించాడు...
రెండు రోజులుగా ఫోన్ చేస్తోన్న కూతురు సడెన్ గా ఫోన్ చేయడం ఆపేసింది.
********** *********************** ***************************
ఇందూ ఏమిటిది? సైట్ సీయింగ్ కు వెళ్ళొచ్చు...నువ్విలా అన్నం తినకుండా వుంటే ఎలారా? బార్యంటే పంచప్రాణాలు విద్యారణ్యకు...
"అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడే వరకు...అల్లుడు గారు కారణం చెప్పే వరకు, పక్కన వున్న వాళ్ళు సాక్ష్యం చెప్పే వరకు పచ్చి గంగ ముట్టను...ఇంట్లో పొయ్యి వెలిగించను..." తెగేసి చెప్పేసి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది ఇందుమతి.
**************** ******************** ***************************
ఇందూ అమ్మాయి ఫోన్....గదిలో వున్న కార్డ్ లెస్ తియ్యి...గది బయట నుంచి అరిచాడు విద్యారణ్య .
ఇందుమతి మంచం మీది నుంచి దిగ్గున లేచి కార్డ్ లెస్ అందుకుంది.
అమ్మా ప్రేమా ఏమయ్యావ్? ఆదుర్దాగా అడిగింది ఇందుమతి ఫోన్ ఎత్తడం తోనే..
"ఏమిటమ్మా ఇది..చిన్న పిల్లలా ...ఆపిల్ తోటలు చూడ్డానికి నేను మీ అల్లుడు వెళ్ళాం. రాత్రంతా ఆపిల్ తోటల మధ్య వుండాలని అనుకున్నాం...ఈ రోజు సైట్ సీయింగ్ వెళ్తున్నాం....నెట్ వర్క్ కవరేజ్ ప్రాబ్లం...ఈ లోగా నాన్న గారు ఫోన్ చేసి నీ విషయం చెప్పారు...ఇదంతా వద్దు కానీ "మేము వచ్చేస్తున్నాం" చెప్పింది కూతురు.
"వద్దొద్దు....ఏదో నువ్వు ఫోన్ చేయలేదన్న కంగారులో...అసలే రోజులు బాగాలేవు..." ఇందుమతి అంది.
ఆ తర్వాత తన భర్తతో మాట్లాడించి తల్లితో అంది..
"వద్దమ్మా...మేము ఎక్కడికో వెళ్తాం...అక్కడ కవరేజ్ వుండదు..నువ్వు కంగారుపడతావు...నాన్నగారు నన్ను తిడతారు.
"అబ్బ వదిలేయవే...నువ్వొచ్చే వరకూ ఫోన్ చేయకపోయినా పర్లేదు..సరేనా? ఉంటానే..పాపం నువు ఫోన్ చేయలేదని మీ నాన్నగారిని కూడా పస్తులుంచాను." అంటూ ఫోన్ పెట్టేసింది.
"మీ ఆయనంటే నీకెంత ప్రేమే...ఫోన్ పెట్టేసే ముందు కన్నీటి తడితో అంది కూతురు.
తన గదిలోనుంచి బయటకు వచ్చి "ఏమండీ సారీ ...మీ కోసం పెసరట్టు ఉప్మా రెండు నిమిషాల్లో రెడీ " అంది కిచెన్ వైపు వెళ్తూ..
కళ్ళు తుడుచుకుంటూ తన గదిలో నుంచి బయటకు వచ్చాడు విద్యారణ్య...
కూతురు, అల్లుడు ఆచూకి తెలియక అప్పుడే ఇరవై నాలుగు గంటలు అయింది. వినోదాన్ని పంచే మిమిక్రీ ఇప్పుడు తన బార్య కన్నీటిని తుడవడానికి పనికొచ్చింది ...తాత్కాలికంగానైనా ...
అతనికి ఆ క్షణం తెలియదు...తన అల్లుడు, కూతురు కిడ్నాప్ చేయబడ్డారని.
(ఇంతకూ వాళ్ళని కిడ్నాప్ చేసిందెవరు? రేపటి సంచికలో)

No comments: