ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం" (Chapter---42)
(08-03-2013)
ప్రత్యేక అధ్యాయం
First of its kind
మీ ముగ్ధతో ముఖాముఖి ...
(ముగ్ధమోహనంలోని ముగ్ధను అన్వేషిస్తూ, ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, రాజమండ్రి దగ్గరున్న కోనసీమకు బయల్దేరారు)
వారు..1) జ్ఞానవల్లి (హైదరాబాద్), 2) బిందు (భోపాల్), 3) మాధవి మద్దాలి (వైజాగ్), 4) RVSS శ్రీనివాస్ (భోపాల్), 5) రోహిణి రాచూరి (న్యూ ఢిల్లీ), 6) రాధిక (న్యూఢిల్లీ), 7) పద్మ నిడసనమెట్ల (ఆనూరు, పెద్దాపురం తాలుకా), 7) మృదుల నిడసనమెట్ల (విజయవాడ), రాణా ప్రతాప్ (కాకినాడ), 9) ఉమాకాంత్ దేవగుప్తపు (రాజమండ్రి), 10) శ్రీవల్లి అండ్ విజయలక్ష్మి సిస్టర్స్ (విజయవాడ), 11) కీర్తి, శ్రిహితా, సంతోష్ (వైజాగ్), 12) సుకన్య (తిరుపతి)
ఈ సీరియల్లో పాత్రలుగా ప్రాణప్రతిష్ట చేసితి. వారి మంచిమనుసుకై వీరికి కృతఙ్ఞతల---Chief Editor, MANROBO)
................................
భద్రాచలం...
సీతారాముల కల్యాణం కమనీయం...శబరీ కొసరి, కొరికి తినిపించిన అమృతఫలం...సీతారాముల పాదధూళితో పునీతమై గోదావరి పరవళ్ళలో పులకించిన భద్రాద్రి....
వీరు కూడబలుక్కుని ఆ పన్నెండు మంది అక్కడికి వచ్చి చేరారు. నిజ జీవితంలో వారి వారి వృత్తిలలో వారంతా బిజీ...కానీ ముగ్ధను కలుసుకోవడం కోసం మూడు వందల అరవై అయిదు రోజుల్లో...ఈ ఒక్క రోజును అందమైన, యాంత్రిక రహితమైన రోజుగా మిగుల్చుకోవాలని నిర్ణయించుకుని వారంతా పుణ్య భద్రాద్రి చేరుకున్నారు.
స్నేహానికి ఎల్లలు లేవు...స్నేహం ఆకాశం లాంటిది. మనకు కనిపించేది మాత్రమే ఆకాశం..మన చూపు అంతకు మించి వెళ్ళదు...ఆ పైనున్నదే మరదే స్నేహం.
ఢిల్లీ నుంచి వచ్చిన రోహిణి, రాధిక, భోపాల్ నుంచి బిందు, శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి జ్ఞానవల్లి, తిరుపతి నుంచి సుకన్య, వైజాగ్ నుంచి కీర్తి,శ్రీహిత,సంతోష్, ఆనూరు నుంచి పద్మ, విజయవాడ నుంచి మృదుల, శ్రీవల్లి, విజయలక్ష్మి(బుజ్జి) సిస్టర్స్, కాకినాడ నుంచి రాణా ప్రతాప్, రాజమండ్రి నుంచి ఉమాకాంత్...అంతా శ్రీరాముల వారి సన్నిధి చేరారు. ఒక గొప్ప ఆధ్యాత్మిక భావం..మాటలకు అందని ఉద్వేగం....ఈ పరిచయం ఎంత బావుంది...నిన్న మొన్నటి వరకు కేవలం కీ బోర్డు మీద మాత్రమే అంతర్జాలంలో కలుసుకున్న ఇంద్రజాలం..ఈ రోజు నిజమై వర్ధిల్లింది....ఒక రచయిత సృజించిన పాత్ర కోసం నిజ జీవిత పాత్రల ప్రయాణం ఒక నిక్షిప్త అనుభవం...ఒకరి నొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు, కరచాలనాలింగనాలు చేసుకున్నారు..స్నేహ మాధుర్యాన్ని స్వాసించారు, అనుభూతించారు..స్వీయ పరిచయాలు అయ్యాయి...భద్రాద్రి రాముడి దర్శనం అయింది....ఇక ముగ్ధ దర్శనంకై తన దగ్గరికి వెళ్ళాలి.
"ఇక్కడిని నుంచి పున్నమి లాంచీలో ప్రయాణించాలి...పది నుంచి పన్నెండు గంటల ప్రయాణం...మన కోసం, నేను పున్నమిని బుక్ చేశాను " రాజమండ్రి వాసి ఉమాకాంత్ అందరికి చెప్పాడు.
************************** ***************** ****************************
గోదావరి తన భుజస్కందాల మీద వీరిని తీసుకువెళ్తోంది.
పాపికొండల అందాలు బాపూ కుంచెకు ప్రాణం పోసి మమ్మల్ని నీ కుంచెతో వర్ధిల్లే భాగ్యం ప్రసాదించమన్నాయి.
"పరవళ్ళ ప్రవాహం మీ కవితా ఝరిలా వుంది "రోహిణి లలితా లావణ్య కవితా మధురిమల రాజు RVSS శ్రీనివాస్ తో అంది.
"ఈ ప్రయాణం ముగ్ధ ఊహకు ప్రాణం పోసినట్టు వుంది" సుకన్య అంది.
గోదావరిలో పున్నమి వీళ్ళ కబుర్లు వింటూ ఊగుతూ తూగుతూ ముందుకు సాగుతోంది.
కజ్జికాయలు, పులిహోర, భక్ష్యాలు, దద్దోజనం....పున్నమిని వనభోజన తోటగా మార్చారు.
ఒకే కుటుంబంగా ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించారు, ఒకిరితోకరు ప్రీతిగా సంభాషిస్తూ తిన్నారు.
************************ ************************* **************************
వేదంలా ఘోషించే గోదావరి....రాజమండ్రిని కలిపింది.
రాత్రి పది దాటింది....
అందరిలో చిన్నపాటి భావోద్వేగం...నలభై రోజులుగా తమకు దగ్గరైన ముగ్ధను ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూడబోతున్నాం.
**************** ************************** ****************************
రేయింబవళ్ళు శ్రమించి, ప్రక్రుతి సృష్టించిన వర్ణచిత్రంమే ప్రాణం పోసుకుని కనుల ముందు నిలిచినట్టులా ఉందా వూరు....ఎటు చూసినా పచ్చని పంట పొలాలు....వీచే చల్లని గాలుల స్వాగత పలకరింపులు...ఊళ్ళోకి అడుగు పెడుతుంటే....మధురమైన భావన, భావుకత్వమే పల్లవిగా
మారినట్టు...తామంతా చరణాలం అయినట్టు...
****************** ****************************** **********************
గేటు తీసుకుని లోపలి అడుగు పెట్టి అలానే నిలబడిపోయారు...
వాకిట్లో పెద్ద ముగ్గు....ప్రకృతి కాన్వాసు మీద సృష్టికర్త బ్రహ్మ చిత్రకారుడై, ముగ్ధ చేతుల్లోకి ప్రవేశించి ముగ్గుని సృష్టించినట్టు.... **స్వాగతం...నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న, నా కోసం వచ్చిన ఆత్మీయులరా, మీకిదే నా ఆహ్వానం..ముగ్ధ"
సప్త వర్ణాలే కాదు ఎనిమిదో వర్ణం..అన్ని వర్ణాలు కలిసిన మిశ్రమం ...
ఎదురుగా ముగ్ధ....ము..గ్ధ...
పికాసో, బాపూ బొమ్మ...అద్భుత రమణీయ లలన...
******************** ************************** *************************
తండ్రిని పరిచయం చేసింది...తమ్ముడ్ని పరిచయం చేసింది. కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. ఆ రాత్రి తెలుగు వారి మమకారాల షడ్రుచులు వచ్చిన వారికి
జిహ్వానందాన్ని కలిగించాయి. హాలులో కార్తికేయ తెలుపు, నలుపుల అందమైన చిత్రం...
పెరట్లో పెద్ద కార్పెట్ ని పరిచింది..పండు వెన్నెల వీరిని స్వాగతించింది.
తమ మనసులోని మాటల ప్రశ్నలు వెలుపలికి వచ్చాయి.
రోహిణి, రాధిక ముగ్ధ వంక చూసి..."ప్రేమంటే ఏమిటి?" అని అడిగారు.
ముగ్ధ చిన్నగా నవ్వి చెప్పింది...చిన్న కన్నీటి చెమ్మతో....
"నా కోసం, నేను నా కార్తికేయ బావుండాలని సాక్షాత్తు ఆ భద్రాద్రి రాముడ్ని ఇంత మంది కలిసి మొక్కుకున్నారు, చూడండి...అదీ ప్రేమంటే...శ్రీరాముల వారి పూజారి నాకు వరసకు బాబాయి అవుతాడు... అతను ఫోన్ చేసి చెబుతుంటే మీ ప్రేమ చూసి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి..."
ఒక్క క్షణం ఎవరికీ ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
"కార్తికేయలో ఏ క్వాలిటీ మీకు నచ్చింది...కేవలం కొన్ని గంటల పరిచయంలోనే ఎలా ప్రేమించారు? బిందు, మాధవి, పద్మ అడిగారు..
"మనిషిని ప్రేమించడం కన్నా మానవత్వాన్ని ప్రేమించే క్వాలిటీ....మానవత్వానికి స్వార్ధం వుండదు...నా కార్తికేయకు ద్వేషించడం వుండదు. ఇంత కన్నా వేరే క్వాలిటీ ఏం కావాలి?
"అంటే మీకింత వరకూ కార్తికేయ లాంటి వాళ్ళు తారసపడలేదా? " మృదుల, రాణా ప్రతాప్, ఉమాకాంత్ అడిగారు...
"నేనెప్పుడూ అన్వేషించలేదు...తపస్సు చేయకుండానే ప్రత్యక్ష్యమైన దేవుడు కార్తికేయ...అడక్కుండానే వరమించిన నా దేవుడు కార్తికేయ..."
"ఒక వేళ కార్తికేయ మీకు తారసపడి ఉండకపోతే..." జ్ఞానవల్లి అడిగింది...
"నా జీవితానికి అర్ధం వుండేది కాదు..." మనస్ఫూర్తిగా చెప్పింది ముగ్ధ.
అప్పుడే రకరకాల పళ్ళతో పెద్దబుట్టతో అక్కడకు వచ్చింది పూర్ణిమ.
ముగ్ధ పరిచయం చేసింది.
శ్రీనివాస్ పూర్ణిమ వంక చూసి..."మీరో అద్భుతం...దేవుడినే డభాయిస్తున్నారే..." అని ముగ్ధ వైపు చూసి "పూర్ణిమ, మిమ్మల్ని ముందు ముందు కధలో డామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది ...మీరేమంటారు? అని అడిగాడు.
"పూర్ణిమ...నా అంతరాత్మ లాంటిది...అది నాలోనే వుంటుంది. నన్ను దాటి నా శరీరాన్ని చీల్చుకొని రాదు " అంది.
పూర్ణిమ చప్పున లేచి ముగ్ధని గట్టిగా వాటేసుకుని ఏడ్చేసింది...
ఒక్క క్షణం అక్కడ వున్న వారి కళ్ళు చెమర్చాయి.
శ్రీవల్లి, విజయలక్ష్మి (బుజ్జి) సిస్టర్స్ ముగ్ధ వైపు చూసి..."ఒకవేళ దేవుడు ప్రత్యక్ష్యమై ఒక వరమిస్తే ఏం కోరుకుంటారు? అడిగారు.
అంతా ముగ్ధ ఏం చెబుతుందా అని ఎదురుచూస్తున్నారు.
"దేవుడా...నాకు ఈ శ్వాస అక్కర్లేదు..కార్తికేయ శ్వాసతోనే బ్రతికే వరమివ్వు ప్రభూ" అని వేడుకుంటాను
ఆ దేవుడే ఈ వరం సంగతి తెలుసుంటే తన శ్వాసనే వరంగా ఇచ్చే వాడేమో....
కీర్తి, శ్రిహితా, సంతోష్, సుకన్య అలానే చూస్తోండి పోయారు.
సమయం పదకొండు గంటల యాభై నిమిషాలు...
ముగ్ధ అన్న మాటలు గుర్తొచ్చాయి. పన్నెండు దాటితే నా కార్తికేయ ఆలోచనలను ఆహ్వానించే సమయం...
************* ************************************ *****************************
ఒక గొప్ప అనుభూతి...ఎక్కడినుంచో రివ్వున ఎగిరివచ్చిన చిలుక వీళ్ళని పరామర్శించింది.
పూర్ణిమ బుట్టలోని పళ్ళు వీరికి కానుకగా ఇచ్చింది. ముగ్ధ అందరికి బట్టలు పెట్టింది.
"మీ అభిమానమే లేకపోతే నా పాత్రకీ ఇంత అదృష్టం దక్కేది కాదు" చేతులు జోడించి అంది.
"ఇది మాకు గొప్ప అనుభూతి...మీ పెళ్ళికి వస్తాం.. అప్పుడు మాతో మరింత మంది వస్తారు.." శ్రీనివాస్ అన్నాడు.
బారమైన హృదయాలతో తిరుగుమొహం పట్టారు. శ్రీనివాస్ వెళ్తూ వెనక్కి తిరిగి చూసాడు. అతనికి భద్రాద్రి లో పూజారి దేవుడితో అన్న మాటలు గుర్తొచ్చాయి. హారతి ఆరిపోయినప్పుడు...
పూజారి గుడిలోకి వెళ్లి "రామచంద్ర ప్రభూ...ముగ్ధ జీవితం బావుండాలని ఎక్కడి నుంచో వచ్చి నీకు పూజలు చేసారు...ఆ ముగ్ధతల్లి కూడా సీతమ్మ తల్లిలా కస్టాలుపడాలా?" అని వాపోయాడు. ఆ దృశ్యం చూసిన శ్రీనివాస్ తన మనసులోనే ఆ దేవదేవుడికి విన్నవించుకున్నాడు.
"సాకేత రామా...ముగ్ధను, కార్తికేయను కలుపు, ఈ శ్రీరామనవమి రోజు నీ కల్యాణాన్ని నేను జరిపిస్తాను"
******************* *************************** **********************************
పూర్ణిమ, ముగ్ధ వాళ్ళని సాగనంపి ఇంటికి వస్తుండగా ఓ ఆగంతకుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. అది గమనించిన చిలుక భయంతో రివ్వున ఎగిరి ముగ్ధ భుజాల మీద వాలింది.
(మీరూహించని మలుపు రేపటి సంచికలో )
(మేన్ రోబో చేసిన ఈ ప్రయోగం వెనుక రచయిత విసురజ శ్రమ, పెయిన్ మాకు మాత్రమే తెలుసు. రెండు రోజుల క్రితం ఈ కాన్సెప్ట్ చెప్పి వీక్షకులను పాత్రలుగా,ముఖాముఖి అధ్యాయం ప్రత్యేకంగా రాయమని అడిగినప్పుడు..."సరే "అన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట...రెండు...మూడు...నాలుగు గంటల సమయంలో కూడా అతని చేతివ్రేళ్ళు కీ బోర్డు మీద తపస్సు చేస్తున్నాయి, వెబ్ కామ్ సాక్షిగా ....రేపటి సంచికలో రచయిత పడిన, అనుభవించిన పెయిన్ తెలుసుకోవచ్చు. రచనను తపస్సులా చేయడం ఎంత కష్టమో ఈ సంఘటనే చెబుతుంది ---చీఫ్ ఎడిటర్)

No comments: