ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

"ముగ్ధమోహనం"
(Chapter---43) (09-03-2013)
............................................
(నా ఆలోచనలో ఊపిరి పోసుకున్న అక్షరాల సాక్షిగా, నా మస్తిష్కంలో రూపుదిద్దుకున్న పాత్రల సాక్షిగా...కాగితపు కాన్వాసు నుంచి...కంప్యూటర్కీ బోర్డు మీద నడిచి, వీక్షకుల హృదయాల్లో నిలిచిన ఈ ధారావాహికలోని నిన్నటి అధ్యాయం ఒక నిర్విఘ్న యజ్ఞం....మరిచిపోలేని అనుభవం... నిజ జీవిత పాత్రలు....నా కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించి...నా కథానాయికను పలకరించి "మేమున్నాం" అన్న భరోసాను భావోద్వేగాల సాక్షిగా అందించారు..స్పందించారు.
ఒక రోజు ముందు "మేన్ రోబో" ఆఫీసు నుంచి ఫోన్...వీక్షకుల స్పందనకు, ప్రతిస్పందించడం...సంస్కార లక్షణం....ఒక కొత్త ప్రయోగానికి తెర తీస్తూ, నిజ జీవిత పాత్రలతో, కాల్పనిక పాత్రలను అనుసంధానించడం వెనుక వున్న కారణం ఒక్కటే...ముగ్ధ, కార్తికేయ పాత్రలను తమ పక్కింటి, తమ వారిగా వీక్షకు, చదువరులు భావిస్తున్నారు. నిజంగా ముగ్ధ ఉందనే భావిస్తున్నారు.
అందుకే ఈ ప్రయోగం...తెల్లవారు ఝాము నాలుగు గంటల వరకు రాస్తూనే వున్నాను...ముంచుకొచ్చే చల్లటి నిద్ర మాని, హాలులో కూచోని రాసాను...నిద్రాదేవిని బ్రతిమిలాడాను...ఈ ఒక్క రోజు నన్ను వదిలి వెళ్ళమని...నేను సృష్టించిన ముగ్ధ, మీరు అభిమానించి అక్కున చేర్చుకున్న ముగ్ధ...మీ అందరి ఆశీస్సులతో...కార్తికేయను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ చేసిన ఈ ప్రయోగం....మీకే అంకితం...మీ విసురజ )
*************************************** *************************************************
నేరం మహా వృక్షం అయినప్పుడు....ఆ నేరాన్ని పెకిలించే మహోగ్రమైన గాలి...ఆ మహా వృక్షాన్ని పెకిలించే మాహా ఉపధ్రవమై రావాలి...ఆ మహోగ్ర చండ్ర ప్రచండ వేగం...వాయువేగం పేరే...కార్తికేయ.
****************** ************************** ఖాసిం సోఫాలో కాళ్ళు బార్లా చాపుకుని రామ్ గోపాల్ వర్మ 26/11 సినిమా చూస్తూ, "జర్దార్.." అంటూ కేకేసాడు...వెంటనే జర్దార్ అనే వ్యక్తీ పరుగెత్తుకు వచ్చాడు. ఇండియాలో ఖాసింకు సహాయకుడిని నియమించింది మోహన. ఖాసింకు కావాల్సిన సేవలు అన్నీ చేస్తాడు...అతనికి మసాజ్ చేయడం వరకూ జర్దార్ కు తెలియని విషయం లేదు...సినిమాలు, రాజకీయాలు మొదలు...ఇండియాలో క్రైమ్ రేటింగ్ వరకూ...
ఖాసింకు కూడా తెలియని విషయం ఏమిటంటే "జర్దార్ ఒకప్పుడు బ్లాక్ క్యాట్ కమెండో...ఓ రాజకీయ ప్రముఖుడికి అంగ రక్షకుడిగా వుండి...అతడినే ఎ కే 47 గన్ తో చంపిన నేర చరిత్ర అతనిది. ప్రధాన మంత్రినే చంపిన అంగరక్షకుల చరిత్ర వున్నా మన దేశంలో ఒక సంఘటన జరిగినా, ఆ సంఘటన నుంచి ఎటువంటి లెసన్స్ నేర్చుకోరు...బాంబుల సంఘటనలు ఎన్ని జరిగినా...అదే నిర్లక్ష్యం...రాజకీయ నాయకుడిని చంపగానే కొంత సమయానికి జర్దార్ ని చుట్టుముట్టి చంపేశారు....అని అనుకున్నారు...రక్తపు మడుగులో, గుర్తు పట్టడానికి వీల్లేని విధంగా శరీరం తూటాలతో నిండిపోయింది..అదో మార్చురీ శవం..కేవలం జర్దార్ బట్టలు ఆ శవానికి వేసారు..పాతిక లక్షల డబ్బుతో జరిగని నేరం...ఆ రాజకీయ నాయకుడు మోహనను బ్లాక్ మెయిల్ చేయడమే దీనికి కారణం... ఆ తర్వాత జర్దార్ కొత్త అవతారం ఎత్తాడు...
మోహనకు నమ్మిన బంటు...
************************* ************************** **************************
"ఈ సినిమా తీసింది ఎవరు? మనకు కొత్త ఐడియాలు ఇస్తున్నాడు...ఈయన్ని కిడ్నాప్ చేద్దాం...ఏ ఇరాన్ కో తీసుకు వెళ్దాం" సాలోచనగా అన్నాడు ఖాసిం.
జర్దార్ ఓ వెర్రి చూపు చూసి, పెదవి విరిచి.."లాభం లేదు..ఆయన్ని కిడ్నాప్ చేస్తే మన దమాక్ ని కిలోల లెక్కన తింటాడు..."
"అంత గొప్పోడా?" అడిగాడు ఖాసిం.
"అంతకన్నా, తనేం తీస్తున్నాడో తనకే తెలువదని కొందరంటారు...ఎప్పుడూ కాంట్రావర్సీలో వుండడం కోసం, అని మరికొందరు అంటారు....కొందరు తిక్క అంటారు...ఆ మధ్య "నా ఇష్టం" అని పుస్తకం రాసాడు...ఇప్పుడు మన గురించి తెలిసిందనుకో...దీని మీద కూడా సినిమా తీస్తాడు...గెవెరెమన్న ఈడు మస్తు దిమాక్ వున్నోడు" ...చాలూ, జర్దార్ చెప్పాడు...
"అయితే మనం ఓ కన్నేసి ఉంచాలి...ఎప్పటికైనా వీడితో ఓ సినిమా చేయాలి" ఖాసిం చెప్పాడు..
"కిడ్నాప్ ఐడియా మాత్రం మానుకోవాలి" నవ్వుతూ అన్నాడు,జర్దార్.
అప్పుడే జర్దార్ చేతిలోని ఫోన్ మోగింది..ఫోన్ లిఫ్ట్ చేసి ఖాసింకిస్తూ చెప్పాడు "మోహన మేడం" అని.
"చెప్పండి మోహనా జీ...ఇప్పుడే ఎవరో రామ్ గోపాల్ వర్మ అట....ఆయన సినిమా చూస్తున్న...మస్తు తీసిండు...మనకు కొత్త ఐడియాలు ఇచ్చాడు...ఇలాంటి వాడిని మనలో చేర్చుకుంటే మస్తుగుంటది."
"మిమిక్రీ విద్యారణ్య కూతురిని, అల్లుడిని కిడ్నాప్ చేసారా? మోహన సూటిగా అడిగింది.
"వాళ్ళు గెస్ట్ హౌస్ లో భద్రంగా వున్నారు" చెప్పాడు ఖాసిం.
"ఓకే" చెప్పి ఫోన్ కట్ చేసింది.
******************************* **************************** **************************
ఆడిటోరియంలో పిన్ డ్రాప్ సైలెన్స్.....డయాస్ మీద విద్యారణ్య...అతని ప్రదర్శన కోసం అంతా ఎదురుచూస్తున్నారు...
"డియర్ ఫ్రెండ్స్..చాలా కాలం తర్వాత నా తెలుగు వారి ముందు ప్రదర్శన ఇస్తున్నాను..చాలా మందికి మిమిక్రీ అనగానే సినిమా నటులను, వారి గొంతులును అనుసరించేవారు మాత్రమేనని అనుకుంటారు.
ధ్వన్యనుకరణ అంత తేలికైన విషయం కాదు...మిమిక్రీ ద్వారా కొందరు నేరస్తులను పట్టుకున్న సందర్భాలు వున్నాయి...ఈ మిమిక్రీ కొందరి ప్రాణాలు నిలబెడతాయి కూడా...అలా అంటున్నప్పుడు అతనికి ఉదయం ఇంట్లో సంఘటన గుర్తొచ్చింది. కూతురిలా, అల్లుడిలా మాట్లాడకపోతే భార్య అన్నమ్ముట్టేది కాదు. కూతురూ,అల్లుడు ఏమైనట్టు...? తన ఫ్రెండ్ కమీషనర్ ని కలిసి విషయం చెబితే? ఆలోచిస్తూ ఉండగానే ఒకతను డయాస్ మీదికి వచ్చి సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళాడు....
షాకయ్యాడు విద్యారణ్య.
మామూలుగా స్లిప్ లు ఇస్తారు...ఫలానా వారి గొంతును అనుసరించమని చెబుతారు. కానీ....అతని చేతిలోని సెల్ రింగ్ అయింది. ఉలిక్కిపడి కాల్ అటెండ్ అయ్యాడు.
"గుడ్ మార్నింగ్ మిస్టర్ విద్యారణ్య ...
ఓ సారి ఈ ఫోన్ లోని వీడియో క్లిప్ చూడండి..
నచ్చితే వెంటనే హైదరాబాద్ వచ్చేయండి...టికెట్ మీ కారులో డ్యాష్ బోర్డులో వుంది....నచ్చకపోతే వెరీ సింపుల్" ఈ ఫోన్ దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్ లో ఇవ్వొచ్చు...లేదా మీ కమీషనర్ ఫ్రెండ్ కు ఇవ్వొచ్చు...వాళ్ళు కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టే లోగా...మిస్సింగ్ కేసు కాస్త హత్యా కేసు అవుతుంది. సింపుల్ ...ఏది బెటర్ గా వుంటుందో ఆలోచించండి."
విద్యారణ్య గొంతు తడారిపోయింది. వెంటనే సెల్ లో వీడియో క్లిప్ ఓపెన్ చేసాడు.. కూతురు, అల్లుడు...తాళ్ళతో బంధించబడి...నోట్లో అరవకుండా గుడ్డలు కుక్కబడి వున్నారు. అంటే కిడ్నాప్ నిజమే....
మళ్ళీ సెల్ రింగ్ అయింది...లిఫ్ట్ చేసాడు...
"సారీ మిస్టర్ విద్యారణ్య,ఇందాక ఓ విషయం చెప్పడంమరిచాను..వన్ ప్లస్ వన్...ఒకటి కొంటే మరొకటి ఫ్రీ...సెల్ ఫోన్ అలానే కొన్నాను...మరోపీస్ మీ ఆవిడకు పంపిందామని..మీకు ఇచ్చి ఆవిడకు ఇవ్వకపోతే ఫీల్ అవుతుంది కదా..." అదే ఇందాకటి గొంతు...
"వద్దొద్దు...నేను హైదరాబాద్ వస్తాను...ఒక అరగంట టైం కావాలి....నా ప్రోగ్రాం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు...ఈ డబ్బు పేద పిల్లలకు ఉపయోగపడుతుంది...ప్లీజ్..." విద్యారణ్య రిక్వెస్ట్ చేసాడు.
"ఓకే, నేను మంచి చెడ్డ విలన్ ని ...మీ కోసం హైదరాబాద్ ఎదురుచూస్తుంది...వెల్ కం టు హైదరాబాద్..." అటు వైపు నుంచి వినిపించిది.
"మీరు మీరెవరు? గొంతు పెగుల్చుకుని అడిగాడు, విద్యారణ్య.
"ఇది నా సొంత వాయిస్...నా పేరు మోహన....నా మీద రెడ్ కార్నర్ నోటీసు వుంది...ఇంకా పూర్తి వివరాలకు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు..బై "
***************************** ********************** *****************************
హైదరాబాద్ వెళ్ళే ప్లయిట్ లో వున్నాడు విద్యారణ్య...విషాదాన్ని గొంతులో హాలాహలంలా బంధించి వినోదాన్ని పంచాడు...ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కన్నీళ్లు బోట బొటా నేల రాలాయి. తన కూతురిని అల్లుడిని రక్షించుకోవాలి..వాళ్ళ కోసంకాదు..వాళ్లకు ఏమైనా అయితే..తనకు దూరమయ్యే భార్య కోసం...
*****
మోహన సోఫాలో కూచుంది...ఎదురుగా పెద్ద స్క్రీన్...దాని మీద వీడియో క్లిప్స్...ముగ్ధకు సంబంధించిన క్లిప్స్..ముగ్ధ హావభావాలు...నడిచే పద్దతి...అన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ముగ్ధ ప్రతీ కదలిక రికార్డు చేయించింది.
ఒక్క క్షణం చిన్నపాటి జెలసీ..తన కన్నా అందంగా వున్నట్టు అనిపించింది. తన ఎత్తు...కానీ తన కన్న బొద్దుగావుంది...ముగ్ధ చేతి వ్రేళ్ళ గోళ్ళు పొడవుగా లేవు...తన గోళ్ళు షార్ప్ గా వున్నాయి...నెయిల్ కట్టర్ కి పనిచేప్పింది. మొదటి సారి గోళ్ళు కట్ చేసింది....
ఒక్కో అంశాన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది...
స్క్రీన్ పక్కన వున్న రెడ్ కలర్ బల్బ్ వెలిగింది...స్క్రీన్ మీద ఆ దృశ్యం మాయమైంది. విద్యారణ్య లోపలికి వస్తున్నాడు....రిమోట్ లో ఐదో నంబర్ బటన్ నొక్కింది...విద్యారణ్య కూతురిని, అల్లుడిని బంధించిన క్లిప్...లైవ్ ..
*************************************************************************************************************************.
(ఆ తర్వాత ఏమైంది...? రేపటి సంచికలో)

No comments: