ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 12 March 2013

విసురజ "ముగ్ధమోహనం"
తొలి డైలీ సీరియల్
(Chapter---46)
(12-03-2013)
.................
అక్కడ గాలిలో స్వరాలు పచార్లు చేస్తున్నాయి...షికార్లు చేస్తున్నాయి.లక్ష్మి చేతి వ్రేళ్ళు తీగలతో ముచ్చట్లాడుతున్నాయి.
శ్రీనివాస్ అడుగుల శబ్దం విని తలెత్తింది లక్ష్మి.పలకరింపుగా నవ్వింది...ఒక తీగను సుతారం గా శృతి మీటింది ....
"ఎలా వున్నావ్ శ్రీ ?అన్నట్టు...
శ్రీనివాస్ పలకరింపుగా నవ్వి...లక్ష్మి ఎదురుగా నేల మీద వేసిన పరుపులో కూచున్నాడు.
లక్ష్మి తన స్వరాలతో....వీణ తీగను గొంతుగా చేసుకుని మాట్లాడుతుంది.
"చాలా కాలం తర్వాత ఈ మూగ స్నేహితురాలు గుర్తొచ్చిందా?
"నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి..నీ బాధ నాకు కనిపిస్తుంది..."
"సారీ...వేద పోయాక చాలాకాలం వరకూ.నువ్వు బయట ప్రపంచాన్నే చూడలేదు కదూ..."చనిపోయిన శ్రీనివాస్ భార్య వేదను ఉద్దేశించి అడిగింది.
"నాకు తెలిసి వృత్తి తర్వాత వేదే నా ప్రపంచం...తనూ... పిల్లలు ఒకే సారి వదిలి పోయాక చీకటిలా అనిపించింది...."బాధ గా చెప్పాడు.
"అనుకోకుండా గతాన్ని వెలికి తీశాను...ఆ విషాదాన్ని మర్చిపో శ్రీ...."
"విషాదాన్ని,బాధను మరచిపోగలను కానీ వేదను ,పిల్లలను మర్చిపోలేకపోతున్నాను."
లక్ష్మి ఆ టాపిక్ ను డైవర్ట్ చేయాలనుకుంది...
"శ్రీ...కాలేజీ రోజుల్లో నువ్వు ఎవరినైనా ప్రేమించావా?
"ప్రేమించాను..కానీ వర్కవుట్ అవ్వలేదు.."బాధగా చెప్పాడు.
"ఎవరిని..నాకు తెలియని ఆ అజ్ఞాత ప్రేయసి?
"వహీదా రెహమాన్ అని ..బాలీవుడ్ హీరొయిన్...తెలుగు రోజులు మారాలి చూసి,చెన్నై లో వున్నప్పుడు అరవం లో ప్రేమించాను...
కానీ ధైర్యం చేసి చెప్పలేదు "నవ్వి చెప్పి...
"మరి నువ్వు ?లక్ష్మిని అడిగాడు...
"మనం ప్రేమించింది ....జగన్నాథుడిని ...లార్డ్ కృష్ణ..కానీ అప్పటికే పదహారు వేల మంది గోపికలు..
అష్ట భార్యలు...ఇంకా గోపికలు దొరుకుతారా అని వెతుకుతున్నాడుట...అందుకే అతని మీద అలిగి "నా కోసమే పుడితేనే పెళ్లి చేసుకుంటాను .అప్పటి వరకూ మాట్లాడను...అనేసాను...దేవుడు కదా...తథాస్తు అని వేణువు వాయించి ఉంటాడు....ఎవరితోనూ మాట్లాడకుండా గొంతును తన దగ్గరే వుంచేసుకున్నాడు.
"వీణ లోని తీగె వణికింది.
శ్రీనివాస్ చప్పున లేచి "లక్ష్మీ ప్లీజ్ "ఆమెను ఎలా ఓదార్చాలో అర్ధంకాలేదు...
"శ్రీ నీకు ఫిల్టర్ కాఫీ ఇష్టం కదా ...కలుపుకు వస్తాను...."తీగలతో మాట్లాడి లేవబోయింది.
"వద్దొద్దు...ఈ వేళ నేనే నీకు చక్కటి,చిక్కటి ఫిల్టర్ కాఫీ తయారు చేసి తీసుకు వస్తాను..."అంటూ కిచెన్ వైపు కదిలాడు...కిచెన్ లోకి వెళ్లి
"లక్ష్మీ నేను ఇక్కడినుంచి మాట్లాడుతాను...నువ్వు నీ రాగాలతో పాటల మాటలు వినిపించు..."అన్నాడు.
అలాగే అన్నట్టు...స్వరాలతో బదులిచ్చింది.
శ్రీనివాస్...ఫిల్టర్ వెతికాడు...గ్యాస్ వెలిగించాడు...పాలగిన్నె స్టవ్ మీద పెట్టాడు.
******************** ********************** *************************
అప్పటి వరకూ లక్ష్మి ఇంటికి దగ్గరలో కాపు కాసిన ఆ యువకులిద్దరూ నిక్సన్ కు ఫోన్ చేసారు...
"సరిగ్గా మరో నిమిషం లో పెల్చేయండి...వీణ పేలి ఆ శ్రీనివాస్ శరీరం ముక్కలవ్వాలి.నిక్సన్ చెప్పాడు..
."మరో విషయం అక్కడ బాంబ్ పేలగానే మీరు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చేయండి.
********************* ******************************* ************************
ఆటోలో పూర్ణిమ,ముగ్ధ వస్తున్నారు.మరో పది నిమిషాల్లో వాళ్ళు లక్ష్మి ఇంటిని చేరుకుంటారు.
ముగ్ధకు కు సంతోషం గా వుంది....అతి తక్కువ సమయం లో తను వీణ నేర్చుకోవడానికి కారణం లక్ష్మి మేడం...
ఈ పట్టు చీరతో తనని సన్మానించాలి. ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి.తమ పెళ్ళయ్యాక కార్తికేయ తో చెప్పి లక్ష్మి మేడం ని విదేశాలకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి.
ఆటో త్వరగా పోనివ్వు...పూర్ణిమ దభాయించింది. అతను హైదరాబాదీ ఆటో... త్వరగా పొమ్మంటే ,ఆలస్యం గా తీసుకువెళ్ళే టైపు...
అదే ఆ రోజు వాళ్ళిద్దరి ప్రాణాలు కాపాడుతుందని వారికి తెలియదు.
*********************** ***************************** *************************
"లక్ష్మీ షుగర్ కాస్త ఎక్కువేయనా..?కిచెన్ లో నుంచి అడిగాడు శ్రీనివాస్..
లక్ష్మి చేతి వ్రేళ్ళు తీగల మీద కదిలాయి...
"జీవితం లో చేదు తప్పదు...కాఫీలో తీపి ఎక్కువే ఉండనీ..."
శ్రీనివాస్ కాఫీని రెండు కప్పుల్లోకి పోసి....కిచెన్ లో నుంచి బయటకు రాబోతున్నాడు.
ఆ యువకుల్లో ఒకడు తన దగ్గర వున్న సెల్ ఫోన్ ని బయటకు తీసి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసాడు.
"లక్ష్మీ ఈ కాఫీ తాగితే జీవితం లో మళ్ళీ ఎక్కడ కాఫీ....మాట పూర్తి కాకుండానే ..
"పెద్ద శబ్దం...భూకంపం వచ్చినట్టు ఆ ఇంటి పునాదులు కదిలిపోయినట్టు....ఆ ఇల్లు వణికింది....సామాన్లు చెల్లా చెదురయ్యాయి....చివరిసారిగా....శ్రీ...అన్న కేక....
శ్రీనివాస్ ఎగిరి అల్లంత దూరం లో పడ్డాడు...కాఫీ కప్పులు తునా తునకలయ్యాయి...
చుట్టూ పక్కల వాళ్ళు భయభ్రాంతులు అయ్యారు.శ్రీనివాస్ తలకు పెద్ద గాయం...అయినా అదేమీ ఆలోచించడం లేదు.....పై కప్పు విరిగిపడింది.లక్ష్మి దగ్గరి చేరుకున్నాడు అతి కష్టమ్మీద .... చేతిలోని వీణ ముక్కలు ముక్కలైంది..సెల్ ఫోన్ పీసులు...
అంటే...సెల్ ఫోన్ వీణ లో పెట్టి...మరో సెల్ తో ఆపరేట్ చేసి.....ఎదురుగా సరస్వతీ దేవి ప్రతిమ ముక్కలై వుంది.
రక్తపు మడుగులో లక్ష్మి ...తన స్వరాలతో స్వర నైవేద్యం చేసిన లక్ష్మి..ఇప్పుడు తన శ్వాసను ఆ సరస్వతికి నైవేద్యం గా ఇస్తున్నట్టు...
ఒకపుడు అగ్ని ప్రమాదం లో షాక్ తో మాట కోల్పోయిన లక్ష్మి కి మరో షాక్ తో ,బాంబ్ బ్లాస్ట్ తో మాట వచ్చింది...కేవలం తన చివరి మాట చెప్పడానికే...
"లక్ష్మీ గట్టిగా అరిచాడు శ్రీనివాస్...ఎంత ఘోరం కన్ను మూసి తెరిచే లోగా...కళ్ళ ముందే తన నేస్తం కన్ను మూసే చివరి క్షణం...
"శ్రీ నా...నా...నాకు మాటొచ్చింది...కానీ కానీ నా మాటలు పాటలు కాకముందే .నా పదాలు స్వరాలు గా మా..మా ..మారక ముందే నేను వెళ్ళిపోతున్నాను...వె...వె...వెళ్లి...ఆగి ముక్కలైన సరస్వతీ దేవి ప్రతిమ వైపు చూసింది.మరో వైపు నటరాజ రూపం లో వున్న శివుడి ప్రతిమ...
"అమ్మా సరస్వతీ...నా జన్మ ధన్యమైంది..నీ వీణనే ఆయుధం గా మార్చి నన్ను చంపాలను ప్రయత్నించారు...అయినా నీ చేతిలో ,నీ వీణ ద్వారా మరణం పొందే వరమించావా...తండ్రీ బ్రహ్మదేవా
అని నటరాజు వంక చూసి..."
నీకు జాగారం చేసాను..ఈ పర్వదినమే నీలో ఐక్యమవుతున్నాను...శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
శ్రీనివాస్ అంబులెన్స్ కు ఫోన్ చేసాడు...అప్పటికే లక్ష్మి తల వాలిపోయింది.
ఆటో దిగిన ముగ్ధ,పూర్ణిమ ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు.
******************* *************************** ******************************
సెల్ రింగ్ అవ్వడం తో కారు డ్రైవ్ చేస్తోన్న కార్తికేయ కారు ఓ పక్కగా ఆప్ చెప్పండి శ్రీ..ఎలా వున్నారు?
"ఘోరం జరిగి పోయింది కార్తికేయ గారు..అటువైపు నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు.
శ్రీనివాస్ చెప్పిందంతా విని,షాక్ అయ్యాడు..క్షణం లో తేరుకున్నాడు...ప్రమాదం లో,యుద్ధం లో త్వరగా స్పందించాలి.
ముందు మీరో పని చేయండి.ముగ్ధ,పూర్ణిమ లను అక్కడి నుంచి పంపించేయండి.మీ అసిస్టెంట్ ని తోడూ వెళ్ళమని చెప్పండి.లక్ష్మి అంత్యక్రియలు కాగానే వీణలో బాబ్ పెట్టింది ఎవరో పరిశోధించండి.శ్రీ "ఇది బాధ పడే సమయం కాదు...ప్లీజ్ ..."చెప్పి సెల్ ఆఫ్ చేసాడు.
ఒక బాధా వీచిక అతడి గుండె ని చీల్చుకుంటూ వెళ్ళింది.
"ఫ్రెండ్ ఇక సెలవంటూ వెళ్ళావా....ఈ నేస్తాన్ని మర్చిపోయావా? "చిత్రం గా కన్నీళ్లు రాలేదు...వేదన ఘనీభవించింది.
***************** ******************* *********************************
అంతా శూన్యం గా వుంది...విషాదం నియంతృత్వపాలన లా వుంది.
లక్ష్మీ మేడం రక్త సిక్త దేహం...పార్థివ దేహం...అచేతనమైంది ముగ్ధ మనసు...పూర్ణిమ కు ఏం చేయాలో అర్ధం కాలేదు. అంత బాధ లోనూ వెంటనే తేరుకున్నాడు.
కర్తవ్యమ్ మర్చిపోలేదు.ముగ్ధ దగ్గరికి వచ్చి "మీరు వెంటనే వెళ్ళిపొండి "అన్నాడు.
"అదేమిటి...ఇలాంటి పరిస్థితి లో...అంత్యక్రియలు పూర్తయ్యేవరకు..."ముగ్ధ మాటలు పూర్తి కాకుండానే..
"ఇది కార్తికేయ గారి ఆర్డర్ ..ప్లీజ్ ..అని పూర్ణిమ వైపు తిరిగి..మీరు తనకు తీసుకు వెళ్ళండి...మీ వెనుకే మా అసిస్టెంట్ వస్తాడు "చెప్పాడు.
ముగ్ధ లక్ష్మి మేడం కోసం తెచ్చిన పట్టు చీరెను ఆమె పార్థివ దేహం మీద కప్పింది.రెండు చేతులు జోడించింది.
ముక్కలైన సరస్వతీ దేవి విగ్రహం లో ఆగ్రహం కనిపించింది...తన వీణ ను ఆయుధం గా మార్చి,తనను పూజించే భక్తురాలిని చంపినందుకు...
నటరాజు త్రినేత్రం తెరిచినట్టు.....
********************** ****************** ********************
ఆ యువకులిద్దరూ నిక్సన్ చెప్పినట్టు ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చారు.తమ జీపును మూడవ వీధిలోకి తీసుకు వెళ్లారు.అక్కడ టెంట్ వేసి వుంది.జీపు ఆపి పక్క వీధిలోకి వచ్చారు..సరస్వతీ దేవి ఆలయం...ఆ పక్కన శివుడి కటవుట్...దాదాపు ముప్పయి అడుగుల కటవుట్....మహా శివరాత్రి సందర్భంగా పెట్టిన కటవుట్....ఒకసారి పెద్ద గాలి వీచింది....ఆ కటవుట్ గాలికి అటు ఇటూ ఊగుతూ..పెద్ద శబ్దం తో ఆ ఇద్దరి యువకుల మీద కూలిపడింది.క్షణం లో వెయ్యో వంతు....
అతి బరువైన,పొడవైన కటవుట్... ఒరిజినల్ త్రిశూలం తో పెట్టిన కటవుట్...
ఆ త్రిశూలం ఆ ఇద్దరి గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది.
********************* ********************** **************************
(ముగ్ధ ,పూర్ణిమ లు వెళ్తుంటే ఏం జరిగింది ?రేపటి సంచికలో)

No comments: