ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 14 March 2013

విసురజ "ముగ్ధమోహనం" తొలి డైలీ సీరియల్
(Chapter---48)
(14-03-2013)
..............................
ఎంత పెద్ద క్రిమినల్ అయినా తొందరపాటులో విచక్షణ కోల్పోతాడు. ఖాసిం కూడా ఆ పరిస్థితిలోనే వున్నాడు. జర్దార్ ఆదృశ్యం...
మోహన ఫోన్ లో కంట్రోల్ రూం వాయిస్ ...పోనీ మరోసారి మొహనకు ట్రై చేస్తే...అప్పుడు కూడా అదే వాయిస్ వస్తే తన ఫోన్ సిమ్ మార్చాలి లేదా పోలీసులు ఈ నెట్ వర్క్ ద్వారా తనను ట్రాప్ చేయవచ్చు.
మరో సారి మోహనకు ట్రై చేసాడు...సెల్ రింగ్ అవుతుంది.
******************************
డబ్బింగ్ థియేటర్....మోహన గ్లాస్ చాంబర్ లో వుంది....ఇటు వైపు విద్యారణ్య వున్నాడు...మోహన ఎదురుగా పెద్ద స్క్రీన్...స్క్రీన్ మీద కొందరి ఫోటోలు డిస్ ప్లే అవుతున్నాయి...కొన్ని క్లిప్పింగ్స్....వాళ్ళ పెదవుల కదలికకు అనుగుణంగా మోహన డబ్బింగ్ చెబుతుంది.
విద్యారణ్య మోహన వైపే చూస్తోండిపోయాడు....చేసే పనిని సీరియస్ గా తపస్సులా చేయడం ఎంత మందికి సాధ్యం? మోహన క్రిమినలే కావచ్చు..కానీ ఈ డెడికేషన్ ఎంత మందిలో వుంటుంది? నలభై ఎనిమిది గంటల నుంచి నిరంతర సాధన చేస్తుంది..తను ఎవరి గొంతును అనుసరించిందో....వారి ఒరిజినల్ వాయిస్ చెక్ చేస్తుంది...చిన్న జీర గొంతులో పలికినా కరెక్ట్ చేసుకుంటుంది.
ముగ్ధ వాయిస్ ని కనీసం కొన్ని వందల సార్లు విన్నది. ఒక ప్రొఫెషనల్ అయిన తను కూడా ఇంత సీరియస్ గా సాధన చేయగలడా? నిమిషాల మీద రికార్డింగ్ థియేటర్ బుక్ చేయడం మరొకరికి సాధ్యమా?
అన్నింటికన్నా అతనికి ఆశ్చర్యానికి గురి చేసింది...ముగ్ధ తన గొంతును మేనరిజంతో సహా అనుకరించి తన భార్యతో మాట్లాడ్డం....
హర్షద్ మెహత, చార్లెస్ శోభరాజ్ లాంటి వాళ్ళు సక్రమ మార్గంలో వెళ్తే ఎంత ఉపయోగకరంగా వుండేది?
మోహన లాంటి వాళ్ళు కూడా అంతే
ముగ్ధ వీడియో క్లిప్ చూస్తూ...ఆ గొంతును ముగ్ధ హావభావాలను పరిశీలిస్తుంది. అప్పుడే ఖాసిం నుంచి ఫోన్ ....అంతకు క్రితమే ఫోన్ వచ్చింది...పోలీస్ కంట్రోల్ రూం నుంచి మాట్లాడినట్టు....మాట్లాడింది. ఖాసిం ఆలోచనలో పడతాడని, కన్ఫ్యూజ్ అవుతాడని తెలుసు...చిన్న ప్రాక్టికల్ జోక్...ఇలాంటి శాడిస్టిక్ సరదాలు చాలా వున్నాయి మోహనలో....
ఈ సారి కూడా తను ప్రాక్టికల్ జోక్ వేస్తే ఖాసిం కాందహార్ కు పారిపోతాడనిపించింది.
"హైదరాబాద్ లో కరెంట్ కోతలు...కరెంట్ వాతలుగా మారాయి...మీరు అక్కడ ఉండడమే సేఫ్" కోడ్ లో అంది మోహన.
"మోహనజీ మీరేగా ...ఇందాక కంట్రోల్ రూం వాయిస్ వినిపించింది, ఈ జర్దార్ కనిపించక కంగారుపడుతున్నాను".
"ఎక్కడికి వెళ్ళాడు? ఏమీ తెలియనట్టు అడిగింది మోహన.
"అదే అర్ధం కావడం లేదు మేడం...వాడి బట్టలు లేవు...ఆఖరికి బాత్ రూంలో ఆరేసుకున్న అండర్ వేర్ కూడా తీసుకువెళ్ళాడు.
"వాడి ఫోన్ కు ట్రై చేయలేదా?
"చేసాను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది"
"అయినా రాత్రికి రాత్రే ఈ 'ఉల్లూ కా పట్టా..(హిందీలో తిట్టు) ఎక్కడి వెళ్ళాడు?
"రాజమండ్రి వెళ్ళాడు" తాపీగా చెప్పింది మోహన.
"రాజమండ్రి? అంటే హైదరాబాద్ ...అక్కడ వీడికి పనేమిటి?
"రాజమండ్రిలో తాపేశ్వరం కాజా తినాలనిపించి ?
ఒక్క క్షణం అర్ధం కాలేదు... అర్ధమయ్యాక...అన్నాడు..
"అంటే ఇదంతా మీ స్కేచ్చేనా?
"అవును నువ్వు బీర్ తాగి మంచి నిద్రలో వున్నావ్? నీకు చెప్పే టైం లేదు..."
"అంత అర్జెంట్ గా...?
"నిక్సన్ ని మాజీ సిట్ ఆఫీసర్ చంపేసాడు....ముగ్ధను కిడ్నాప్ చేయడానికి జర్దార్ ని ఇక్కడికి రమ్మని నేనే చెప్పాను....ఈ విషయం తెల్లవారేక నేను నీకు చెబుదామనుకున్నాను..."
"ఓకే మొహనజీ ఇప్పుడు నన్నేం చేయమంటారు? అడిగాడు ఖాసిం.
"నేను ఢిల్లీకి వచ్చిన వెంటనే నన్ను హత్య చేయడానికి ట్రై చెయ్..."
"వాట్...? అదిరిపడి అడిగాడు.
"అవును ....అంటూ చెప్పసాగింది...
మొత్తం విన్నాక ఖాసిం బుర్ర తిరిగిపోయింది. తను వున్నది పాము పడగ కింద కాదు....కోటాను కోట్ల పాముల మధ్య అన్న ఫీలింగ్ కలిగింది.
*****************************************
ఖాసింతో మాట్లాడక రెండు క్షణాలు కళ్ళు మూసుకుంది. నిక్సన్ ని శ్రీనివాస్ చంపుతాడని ఊహించలేదు....ముగ్ధను కిడ్నాప్ చేసే పనిని నిక్సన్ కు అప్పగించింది. అంతే సమర్థవంతంగా ఆ పని చేయగల నమ్మకమైన వ్యక్తి జర్దార్ ...అందుకే రాత్రికి రాత్రి జర్దార్ని వచ్చేయమని చెప్పింది. చార్టెడ్ ప్లయిట్ బుక్ చేసింది. ఒక్క క్షణం నవ్వొచ్చింది....
ఈ కరప్షన్ సిస్టం ఉన్నంత వరకూ తన లాంటి క్రిమినల్స్ కు డోకా లేదు....జైళ్ళలో సెల్ ఫోన్స్...సమాంతర ప్రభుత్వాలను జైలు నుంచి నడిపించే వ్యవస్థ వున్న డెమాక్రసీ....
ఈ పాటికి జర్దార్ తన టార్గెట్ పూర్తి చేసివుంటాడు....
*********************************
డబ్బింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చింది. మోహన....
"మోహన గారు మీరు చెప్పినట్టు చేసాను...ముగ్ధ గొంతును మీరు ముగ్ధ కూడా గుర్తు పట్టనంతగా అనుకరించారు...మీరు ఇచ్చిన మాట ప్రకారం..." విద్యారణ్య మాట పూర్తి కాకుండానే ...తన చేతిలో వున్న రిమోట్ బటన్ నొక్కింది. స్క్రీన్ మీద కూతురు,అల్లుడు ప్రత్యక్ష్యమయ్యారు....హోటల్ రూంలో సామాన్లు సర్దుకుంటున్నారు.
మీ కూతురికి ఫోన్ చేయండి ..చెప్పింది మోహన.
వెంటనే కూతురికి ఫోన్ చేసాడు.
"నాన్న మమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేసారో తెలియదు...ఎందుకు కిడ్నాప్ చేసారో తెలియదు..ఇందాకే వదిలేసారు..వెంటనే రూంకు వచ్చాం...బయల్దేరి వస్తున్నాం...ఇంతకీ మీరెక్కడ వున్నారు నాన్న" కూతురు అడిగింది.
వెంటనే విద్యారణ్య చేతిలోని ఫోన్ లాక్కుంది..."నేను వేరే పని మీద హైదరాబాద్ వచ్చాను. అమ్మతో కిడ్నాప్ వ్యవహారం గురించి చెప్పకు,..ఏ దేవతో మిమ్మల్ని కాపాడి వుంటుంది..బై...హ్యాపీ జర్నీరా" అని ఫోన్ కట్ చేసింది.
విద్యారణ్య అలానే చూస్తోండిపోయాడు.
"సారీ...మీ గొంతును పర్ఫెక్ట్ గా అనుకరించగలనా? అని చిన్న టెస్ట్..." చెప్పింది మోహన.
"ఓకే, నేనిక బయల్దేరుతాను .."
మీరా ...మీరెక్కడికి?
"అదేమిటి? మీ వర్క్ పూర్తిచేస్తే వదిలేస్తానని అన్నారు"
"మీ కూతురిని, మీ అల్లుడిని వదిలేస్తానని అన్నాను. మిమ్మల్ని కాదు...కంగారు పడకండి..మీతో చిన్న పని వుంది ప్యాచ్ వర్క్ లాంటి పని..." అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది .
విద్యారణ్య కంగారుపడలేదు...ఇందాక గ్లాస్ చాంబర్ లో ఖాసిం మోహనతో మాట్లాడిన మాటలను డీకోడ్ చేసే పనిలో వున్నాడు...డబ్బింగ్ థియేటర్ అందులోనూ సౌండ్ ఫ్రూప్ గది...విద్యారణ్య కు లిప్ రీడింగ్ వచ్చు...
మోహన మాట్లాడిన మాటలను వాయిస్ గా కన్వర్ట్ చేస్తూ...వుండగా అతని ఒళ్ళు గగుర్పొడిచింది....మోహన ఏం మాట్లాడిందో అర్ధమయ్యాక...
(ఇంతకీ మోహన ఖాసింతో ఏం చెప్పిందో ఊహించగలరా? గెస్ చేయగలిగితే...
manrobocreations@gmail.com కు
ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు లోగా మాకు మెయిల్ చేయండి.....చీఫ్ ఎడిటర్)
....................................
(జర్దార్ ఎక్కడికి వెళ్లి ఉంటాడో గెస్ చేయగలిగితే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండులోగా మాకు మెయిల్ చేయండి...అని నిన్నటి సంచికలో మేము ఇచ్చిన ప్రకటనకు చాలా మంది స్పందించారు...ఎవరూ కరెక్ట్ గా గెస్ చేయలేకపోయారు....జర్దార్ ని పోలీసులు అరెస్ట్ చేసారని, జర్దార్ ప్రాక్టికల్ జోక్ చేసాడని రక రకాలుగా రాసారు.
వరంగల్ నుంచి లత అనే వీక్షకురాలు మాత్రం....ఈ కింది విధంగా రాసారు..
రచయిత ఉగ్గుపాలు బదులు చిన్నప్పుడు పాదరసం మింగి వుంటారు...అందుకే మాకు చిక్కకుండా సస్పెన్స్ తో మలుపులు తిప్పుతున్నారు..ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ లా సస్పెన్స్ ని ఊపిరి సలపనీయకుండా రాస్తున్నారు.

No comments: