ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 30 March 2013

విసురజ అక్షర విశ్వరూపం " ముగ్ధమోహనం " డైలీ సీరియల్(chapter---59 ) (25-03-2013)
ఆత్మరక్షణలో పడిపోయిన ఫీలింగ్ కలిగింది కార్తికేయకు...ముగ్ధను కాపాడడం కోసం మోహన తీసుకున్న రిస్క్ తెలుస్తోంది.తన మనిషే అయినా కొన్ని విలువలకు కట్టుబడి వుండడం సామాన్యమైన విషయం కాదు...అదీ మోహన లాంటి క్రిమినల్ కు...
తన ముందు వున్న సమస్య మోహన...ఖాసిం ...చాలా విచిత్రమైన పరిస్థితి....శత్రువు తన ఎదురుగానే వుంది..కానీ తానేమీ చేయలేకపోతున్నాడు.
మోహన నుంచి ఎటువంటి పరిస్థితి లోనూ నిజాలు చెప్పించడం సాధ్యం కాదు.
బాంబ్ బ్లాస్ట్ లను అడ్డుకున్నా,దానికన్నా మించి ఏదో జరుగుతోంది.....అదేమిటి ? తను ఏ మాత్రం తొందరపడ్డా,ముగ్ధ మాత్రమె కాదు...ఒక గొప్ప డాక్టర్ ,విద్యారణ్య లాంటి వారి ప్రాణాలకు ముప్పు...అంత కన్నా మరో విధ్వంసం జరుగవచ్చు.శత్రువును ఆయుధబలం తో అన్ని వేళలా ఎదుర్కోవడం అసాధ్యం అని తెలుసు...హాలు లో నుంచి లేచి మోహన గది వైపు చూసాడు.
పరాయి వారి గదిలోకి,మదిలోకి తొంగి చూడకూడదన్న సంగతి తెలిసీ చూసాడు.
మోహన చేతులకు గోరింటాకు పెట్టుకుంటుంది.కార్తికేయ స్థబ్దుగా ఉండిపోయాడు.ఒక అంతర్జాతీయ నేరస్తురాలు...అతి ప్రమాదకరమైన వ్యక్తీ...తాపీగా చేతికి గోరింటాకు పెట్టుకుంటుంది.ఈ అమ్మాయి మామూలు అమ్మాయి అయితే ఎంత బావుండు.యాహ్యాఖాన్ లాంటి ఒక ఉగ్రవాదిని ఒంటి చేతితో చంపిన వ్యక్తి.
కార్తికేయ ఆమె గది ముందు నిలబడి..."లోపలి రావచ్చా ?అని అడిగాడు
మోహన లేవబోయింది.ఆ అదురుకు ఆమె పైట కిందికి జారింది.ఓ చేతోకి గోరింట పెట్టుకుంది...మరో చేతిలో గోరింట గిన్నె...ముందుగా ఓ అమ్మాయి..ఆ సహజ సిద్ధమైన లాలిత్యం..సిగ్గు..బిడియం...కిందికి వంగి పైట సర్ద్దుకోబోయింది ...కార్తికేయ ఆ పైటను ఆమె భుజాల మీదుగా కప్పాడు.
"సారీ " అన్నాడు కార్తికేయ
"దేనికి "అడిగింది మోహన...
"మీ గదిలోకి రాకూడని పరిస్థితి లో వచ్చాను...మీ అనుమతి లేకుండా...మీ పైట..."ఆ పై మాట పూర్తి చేయలేదు.
"ఇది మీ గది....అయినా మీరు రాకూడని ప్రదేశం కాదు...నేనే మీకు థాంక్స్ చెప్పాలి "అంది మోహన
"థాంక్స్ ?ఎందుకు ?
"నిజం చెప్పాలంటే...ఒక సారి కార్తికేయ వంక చూసింది...మోహన ఏం చేబుతుబ్డా అని ఎదురు చూస్తున్నాడు...
"డెత్ గేమ్స్ ...రక్తపాతాలు...ఒక్కో సారి కాదు కాదు చాలా సార్లు నేనో అమ్మాయిని అనే విషయం మరిచిపోతుంటాను...అసలు గుర్తే వుండదు...ఎందుకో ఇప్పుడు మీ ముందు గుర్తొచ్చింది.నేను అమ్మాయిని అని...నాలోనూ స్త్రీత్వం వుందని..."ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథ ...అమ్మ చెప్పిన కథ...రాముని స్పర్శతో రాయి అహల్యగా మారింది..ట...రాయి లాంటి రాతి గుండె వున్న ఈ మోహన మీ స్పర్శతో అమ్మాయి గా మారిందేమో..." చిన్న కన్నీటి మెరుపు.
కార్తికేయకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు....
"సారీ "అంది మోహన
"ఎందుకు "అడిగాడు కార్తికేయ.
"మీ ముగ్ధ తన కోసం దాచుకున్న గోరింట...ఫ్రిజ్ లో కనిపిస్తే...ఎందుకో పెట్టుకోవాలనిపించింది.ఎర్రగా పండింది కదూ...నాకు రక్తపు ఎరుపు తప్ప ఈ గోరింట ఎరుపు తెలియదు...గోరింట ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడటగా..."కార్తికేయ వైపు చూసి అంది.
కార్తికేయ మౌనాన్ని ఆశ్రయించాడు...
"ఖాసిం ,జర్దార్..సిక్వీ..చాలా మంది మీ గురించి చెబుతూ ఆ కార్తికేయ మనకు మొగుడయ్యాడు..అనే వాళ్ళు...ఆ ఫీలింగ్ నాకు అన్వయించుకుంటే ఎంత బావుందో..."
మోహన కార్తికేయకు చాలా దగ్గరగా వచ్చింది...ఎంత దగ్గరగా అంటే...అతని శ్వాస ఆమె గుండెలకు తగిలేంత దగ్గరగా....
"చెప్పండి నా నుంచి ఏ రహస్యం తెలుసుకోవడానికి వచ్చారు ?
ఉలిక్కిపడ్డాడు కార్తికేయ ...తన మనసులోని భావాలు చదివేసిన మోహన వైపు చూసాడు.
"ముగ్ధను,విద్యారణ్య ను ,డాక్టర్ రాధారాణి ని వదిలి వేయవచ్చుగా ..."తన ప్రశ్న తనకే సిల్లీ గా అనిపించింది.
"ఆ ముగ్గురి లో ఏ ఇద్దరినే వదిలేస్తానని నేనంటే,,,?
"విద్యారణ్య ను,రాధారాణి ని వదిలేయమని అంటాను..."
"మీ ముగ్ధను ...తను మీ ప్రాణం కదా .."
"నా ముగ్ధను నేను కాపాడుకోగలను...లేదా నేను ముగ్ధ తో పాటే ....విద్యారణ్య,డాక్టర్ రాధారాణి లాంటి మేథావులు బలి కాకూడదు..."
"ముగ్ధ ను చూస్తుంటే జెలసీ గా వుంది ..."
"నాకు మిమ్మల్ని చూస్తుంటే..."కార్తికేయ ఆగిపోయాడు...ఇలాంటి పరిస్థితి ఎవరికీ వచ్చి వుండదు.
"చెప్పండి..నన్ను చూస్తుంటే.."ఆత్రుతగా అడిగింది...ఎప్పుడు ఇంత ఉద్వేగానికి గురవ్వలేదు.
"ఏమీ లేదు...మోహన నాకో విషయం చెప్పగలరా ?
"ఇంటరాగేషన్ లేకుండానే నిజాలు రాబట్టాలనే ప్రయత్నమా ? అడగండి "
"మీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి ?
"చెబితే నాకేమిటి ?
"చెప్పండి మీకేం కావాలి ?
"నా రెండో చేతికి గోరింట పెట్టగలరా ?అలా అయితే చెబుతాను "
ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అత్యంత రహస్యమైన సమాచారాన్ని చెప్పడానికి అడిగిన ప్రతిఫలం...
మోహన తన రెండో చేతిని చాచింది కార్తికేయ వైపు....
"ఓ అక్షర విధాతా...నన్ను సృష్టించి నీలోని వ్యక్తిత్వాన్ని నాకు ధారపోసిన ఆత్మ మిత్రమా...నువ్వు సృజించిన ఈ పాత్ర నా కన్నీటి చెమ్మను స్పృశిస్తుంది...." కార్తికేయ గోరింట గిన్నెను చేతిలోకి తీసుకున్నాడు.

No comments: