ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday 12 April 2013

ఆగష్టు1
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...

12-04-2013
(2nd chapter)
.........
యుగాంతాన్ని కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు నిలిపిన కాలపురుషుడు ఇక కాలంతో పనిలేదని, నిట్టూర్చాడు.
ఒక్క ప్రాణి అయినా బ్రతికి బట్ట కడుతుందా? అసాధ్యాన్ని, సుసాధ్యం చేయడం....సాధ్యమా? అది దుస్సాహసమా?
ఆకాశం నుంచి నేలకు దిగుతోన్న చంద్రహాసుడు ఒరలోని కరవాలం తీసి, ప్రకృతి విలయ తాండవాన్ని నిలువరించే ప్రయత్నం చేసాడు. భూమ్మీదికి దిగీ దిగక ముందే నీటి ఉధృతిలో కొట్టుకు పోతోన్న ఆమె చేయి పట్టుకున్నాడు.
రెక్కల గుర్రం ఆమెతో సహా పైకి వెళుతోంది. కిందికి కళ్ళు చిట్లించి చూస్తే...సమస్త ప్రాణులను తనలో కలుపుకుంటోన్న ప్రక్రుతి విలయ తాండవం కనిపిస్తోంది. భయంతో అతడిని గట్టిగా అల్లుకుని, ఒడిసి పట్టుకుని కళ్ళు మూసుకుంది.
**************
ఉలిక్కిపడి లేచాడు చంద్రహాస్.
ఏసీ చల్లదనంలో కూడా అతని మొహానికి చెమట పట్టింది. నలుగురు పడుకోవడానికి సరిపడా విశాలమైన మంచం. జర్మన్ మేడ్...ఉష్ణోగ్రతకు అనుగుణంగా మారే బెడ్....లక్షల ఖరీదు చేసే బెడ్ మీద ఒక్కడే పడుకున్నాడు. పక్కన ప్రణవి లేదు...పక్కన తన ప్రాణం లేదు...అనుకున్నాడు, మరోసారి చంద్రహాస్.

సామాన్యుడి త్రిబుల్ బెడ్ రూం వైశాల్యంలో వున్న ఆ బెడ్ రూం గోడలకు వేసిన పెయింట్ తో కొన్ని కుటుంబాలు ఒక జీవితకాలం బ్రతకవచ్చు. అ గదిలో నాలుగు గోడలకు పెయింటింగ్స్....ప్రతీ పెయింటింగ్ లోనూ వున్నది ఒక్కరే ....ప్ర... ణ... వి .
ఆతను లేచి నేల మీద కూచున్నాడు. గోడమీద ఫోటోలో తనపక్కనే ఒదిగి వున్న ప్రణవి ఫోటోలో నుంచి బయటకు నడిచి వచ్చిన ఫీలింగ్. తనకు వచ్చిన కలకు...ఇప్పుడు వచ్చిన ఊహకు ఏమైనా దిగ్బంధం ఉందా? మనిషి మెదడులో వుండే కలల కేంద్రం ఏం చెబుతుంది ? ఫ్రాయిడ్ సైకాలజీ ఏం చెబుతుంది?
అతను తల విదిల్చాడు. బొటన వ్రేలు చివరి భాగం రెండు పెదవుల మధ్య బిగించాడు. కోపం...టెన్షన్ లాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు అతనలా చేస్తాడు.
నైట్ ప్యాంటులో వున్న చంద్రహాస్ బెడ్ రూం తలుపు తీసాడు. ఆ భవనంలో ఎన్ని గదులున్నాయో అతనికే తెలియదు. తన మది గదిలో వున్న ప్రణవికి సంబంధించిన ఆలోచనలే అతడిని చుట్టూ ముడుతున్నాయి.
అతను ఆ భవనపు ప్రవేశ ద్వారాన్ని చేరుకోవడమే ఆలస్యం. బిల బిలమంటూ సెక్యూరిటీ అతడిని చుట్టుముట్టింది.
****************.
ఒక్క క్షణం సెక్యూరిటీ వంక సీరియస్ గా చూసాడు చంద్రహాస్...వాళ్ళు భయంతో వెనకడుగు వేసారు .
"సర్...మీరు ఒంటరిగా బయటకు వెళ్ళడం మంచిది కాదు" సెక్యూరిటీ చీఫ్ మెహతా ఇంకా ఏదో చెప్పబోయాడు.
"స్టాపిట్..." అన్నట్టు చూసి గ్యారేజ్ వైపు నడిచాడు. వరుసలో పదుల సంఖ్యలో కార్లు. చివరగా వున్న కారులో కూచున్నాడు. కారు రివర్స్ చేసాడు. కారు గేటు దగ్గరి రాగానే కారు ముందు ప్రత్యేకంగా వున్న సెన్సర్స్ ద్వారా గేట్ తెరుచుకుంది. కారు బయటకు వెళ్ళగానే గేటును తన దగ్గర వున్న ఆటోమాటెక్ కీ ద్వారా లాక్ చేసాడు. సెక్యూరిటీ తనను ఫాలో అవకుండా చంద్రహాస్ చేసిన పని.
సెక్యూరిటీ చీఫ్ వెంటనే గేట్ కు అవతల వున్న మరో సెక్యూరిటీ వింగ్ కు మెసేజ్ పంపించాడు. వాళ్ళు చంద్రహాస్ కారును ఫాలో అవుతున్నారు. అర్ధరాత్రి దాటాక చంద్రహాస్ నడి రోడ్డు మధ్య కారు ఆపాడు. దూరంగా ఒక స్త్రీ...వడివడిగా నడుచుకుంటూ వెళ్తోంది.
కారులో నుంచి దిగి గట్టిగా అరిచాడు..
"ప్రణవీ ఆగు.."
ఆమె ఆగలేదు..తన నడక వేగం పెంచింది.
***********
(ఆ తర్వాత ఏం జరిగింది? రేపటి సంచికలో)

No comments: