ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

ఆగష్టు1 (సీరియల్ )
టాగ్ లైను ......డేట్ తో డిష్యుం..డిష్యుం
by మెస్మరైజింగ్ మేగ్నటిక్ ఎనర్జీ రైటర్..
"విసురజ"
.........
16-04-2013 (6th chapter)
..................
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
నిశ్శబ్దంలో సెకన్ ముళ్లు చప్పుడు కూడా భయంకరంగా వినిపిస్తోంది. ఆఫీసు బయట గూర్ఖా అడుగుల శబ్దం విని భయపడిపోయింది సంధ్య. తన రాజీనామా లెటర్ ఎక్కడుంది? ఎడిటర్ యాక్సెప్ట్ చేసాడా?
చేస్తే? తను కష్టపడి, సంపాదించుకున్న జాబ్ జార్ఖండ్ సరిహద్దుల్లోకి వెళ్తుంది .."ఒసేయ్ సంధ్యా అనకూడదు కానీ నీకు నోటి దూల ఎక్కువే"..అంటూ అంతరాత్మ తిట్టిపోస్తోంది...
ఒక వేళ తన రాజీనామా/రిజిగ్నేషన్ లెటర్ ఎడిటర్ వరకు వెళ్ళకపోతే చించి పారేసి ఏమీ తెలియని దానిలా వుండాలని సంధ్య ప్లాన్. వెంటనే ఓ ఐడియా వచ్చింది "సత్యకు ఫోన్ చేస్తే? హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసింది. సెల్ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. "చ..చ...తను రోజు రోజూకి ఆడ గజినీ అయిపోతుంది ...ఇప్పుడెలా? వెంటనే ల్యాండ్ ఫోన్ వైపు చూసింది ..ల్యాండ్ ఫోన్ "ప్లీజ్ యూజ్ మీ" అన్నట్టు తననలా చూసినట్టు ఫీలైంది సంధ్య. వెంటనే మైండ్ లో వున్నా సత్య నంబర్ గుర్తు చేసుకుని..నంబర్ డయల్ చేసింది.
**************
"ఎవరు? అటు నుంచి నిద్ర మత్తులో సత్య గొంతు.
ఇన్ కమ్ టాక్స్ డిపార్టుమెంటు నుంచి...అంది సంధ్య
"నా శాలరీ పది వేలు...బ్యాంకు బ్యాలన్సు తొమ్మిది వేలు..." నిద్రమత్తులోనే చెప్పింది.సత్య.
"మరి సంధ్య అనే అమ్మాయి మీ ఆఫీసులో పని చేస్తుందిగా? ఆవిడ గురించి చెప్పండి .
"ఆవిడ ఈ ఉదయమే రాజీనామా చేసింది"
"బాస్, దేవుడు యాక్సెప్ట్ చేసాడా?
"ఏమో..శర్మ గారు మాత్రం రాజీనామా లెటర్ ను ఫ్రేం కట్టించి మరీ బాస్ చాంబర్ లోకి తీసుకు వెళ్ళాడు, సంధ్యా" చెప్పింది సత్య.
"అరరే..భలే గుర్తు పట్టావే ..ఎలా?
"సెల్ ఫోన్ లో నంబర్ డిస్ ప్లే అవుతుందిగా..అయినా ఆఫీసు క్లోజ్ చేసారుగా...ఈ వేళలో నువ్వు...ఎలా?
"ష్...టాప్ సీక్రెట్ ...ఎవరికీ చెప్పకే ...అసలే టెన్షన్ తో తల పగిలి పోతుంది. రేపు మార్నింగ్ కలుద్దాం..ఎడిటర్ గారు నన్ను పీకేయకపోతే ..." అంటూ ఫోన్ పెట్టేసి చాంబర్ మొత్తం వెతికింది. ఆమె కాలుకి చెత్త బుట్ట తగిలింది. ఆ మాత్రానికే భయపడిపోయి, వెంటనే చెత్తబుట్ట పక్కకు పెట్టి "ఛ..నా బ్రతుకు చెత్తబుట్ట కన్నా అధ్వానం అయింది" అనుకుని వెంటనే ఏదో ఫ్లాష్ లా తట్టి చెత్తబుట్ట లోని చెత్తను కెలికింది. అందులో త..న..రా..జీ...నా...మా ..లెటర్ వుంది. అంటే తన రాజీనామాను ఎడిటర్ యాక్సెప్ట్ చేయలేదు.
"సంధ్య లాంటి మోస్ట్ జీనియస్ ను వదులుకోవడానికి ఎడిటర్ కు మనసొప్పలేదు...నేచురల్ " అనుకుంది.
"సంధ్యా కాస్త ఎక్కువైంది, కత్తరించుకో" అంతరాత్మ వార్నింగ్ ఇచ్చింది.
చిరిగి ముక్కలైన ఆ కాగితాల ముక్కలను భద్రంగా చేతిలోకి తీసుకుంది. రేపు ఏమీ తెలియనట్టు ఆఫీసుకు రావాలి. "అసలా శర్మకు చేతబడి చేయించాలి" కచ్చగా అనుకుంది.
ఛాంబర్లో నుంచి బయటకు వస్తూ టేబుల్ మీద వున్నా "ముగ్ధమోహనం" నవల కవర్ పేజి చూసింది. చూస్తుంటే ముద్దొస్తుంది. తను మేన్ రోబోలో చేరక ముందు రోజు అర్ధరాత్రి లాప్ ట్యాప్ ముందు కూచుని సీరియల్ చదివేది...అదంతా పేస్ బుక్..వెంటనే లైకు కొట్టేది. ఎప్పటికైనా రచయత "విసురజ"ను కలుసుకోవాలని అనుకునేది.
టేబుల్ కు ఆ చివర "ఆగష్టు 1" స్క్రిప్ట్ వుంది. 6 వ భాగం...వెంటనే చదివేయాలనుకుంది.
"సంధ్యా వచ్చిన పని చూసుకోకుండా ఏమిటిది? లోపలున్న అంతరాత్మ సోల్ హోల్ సేల్ గా తిట్టేసరికి బయటకు వచ్చేసింది. నెమ్మదిగా ఛాంబర్ తలుపు మూసి వెనక్కి తిరిగింది. దాహంగా అనిపించింది. హాల్ లో లెఫ్ట్ సైడ్ వున్న ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి, ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసింది.
కూల్ డ్రింక్ తాగితే పోలా ...అనుకుంది. లోపల వున్నా మజా బాటిల్ తీసి గ్లాస్ కోసం వెతికింది. గ్లాస్ ఆమె చేతి దగ్గరికి వచ్చింది. ఆ గ్లాస్ తీసుకుని "థాంక్యూ " అలవాటుగా అంది, అనేసింది.
"వెల్ కం" అన్న మాటలు విని షాకైంది. తల తిప్పి చూస్తె చీఫ్ ఎడిటర్...
"గుడ్ మార్నింగ్ సర్...సారీ గుడ్ ఈవెనింగ్ ...గుడ్ నైట్..సర్" షిట్ అంటూ తల మీద కొట్టుకుంది.
*********************
ఎడిటర్ ముందు నిలబడింది. సేమ్ సీన్...ఉదయం జరిగిన సీన్...
"ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా?
"తిట్టండి సార్...తిట్టడానికి టైం ఎందుకు? ఉదయం కన్నా ఇప్పుడే బెటర్ ...ఎంత తిట్టినా ఎవరికీ తెలియదు" తల వంచుకుని తనలో తనే గొణుక్కుంది.
"సారీ సర్...మీరెక్కడ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారోనని భయపడి అర్ధరాత్రి దొంగతనంగా ఆఫీసుకు వచ్చి, మీ ఛాంబర్ లోకి వచ్చి,..." గబ గబ చెప్పుకు పోతోంది. తను చేసిన తప్పులు చెప్పి ఎడిటర్ తిట్టిన తిట్లు తింటే రిలీఫ్ గా వుంటుంది" అనుకుంది.
"మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారా? ఎడిటర్ అడిగాడు.
తల సగం నిలువుగా, సగం అడ్డం గా ఊపింది.
టేబుల్ మీద వున్న ఆఫీస్ కీస్ సంధ్య చేతికి ఇచ్చాడు .
"కొంపదీసి జర్నలిస్ట్ పోస్ట్ పీకేసి వాచ్ మేన్ పోస్ట్ ఇవ్వడం లేదు కదా? అనుకుంది. అదే అడగబోయింది.
"ఇంకోసారి ఇలా దొంగతనంగా ఆఫీసులోకి రాకుండా ఉండడానికి, ఈ ఏరియా ఇన్ స్పెక్టర్ ఫోన్ చేసి మీ ఆఫీసులోకి ఓ అమ్మాయి దొంగతనంగా ప్రవేశించింది అని చెప్పాడు.ఇలాంటి తెలుగు సినిమా పని నువ్వే చేసి ఉంటావని వచ్చాను." ఎడిటర్ అన్నాడు.
"థాంక్యూ సర్...ఆ ఇన్ స్పెక్టర్ నన్నుఅరెస్ట్ చేస్తే లాకప్ లో ఉక్కపోతతో చచ్చేదానిని .."సిన్సియర్ గా అంది. ఒక నిమిషం ఆగి "సర్ నేను వెల్లోచ్చా? అని అడిగింది .
"అడక్కుండా వచ్చి..." అని ఆగి చిన్న నవ్వు నవ్వి " వెళ్ళొచ్చు అన్నట్టు " సైగ చేసాడు.
"సర్ ఇఫ్ యు డోంట్ మైండ్...నన్ను ఆన్ ది వే లో డ్రాప్ చేస్తారా? అని కళ్ళు మూసుకుంది.
******************
కారులో బుద్ధిగా కూచుంది. అప్పుడప్పుడు ఎడిటర్ వంక
చూస్తోంది
పక్కన ఓ అమ్మాయి ఉందన్న విషయం మర్చిపోయి డ్రైవ్ చేస్తున్నట్టు వుంది.
కారు దిగి "థాంక్స్" చెప్పి వెళ్లిపోతుంటే ఎడిటర్ పిలిచి రెడ్ కలర్ ఫైల్ సంధ్య చేతికి ఇచ్చాడు.
"ఈ ఫైల్ జాగ్రత్తగా చదువు..ఈ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ మీరే చేస్తున్నార " చెప్పి కారు స్టార్ట్ చేసాడు.
అలానే నిలబడిపోయింది సంధ్య.
*********
కారు స్పీడ్ గా వెళ్తుంది. ఎడిటర్ ఓ నంబర్కు ఫోన్ చేసాడు.
"సుకన్య గారు....సంధ్య జాగ్రత్త" చెప్పి ఫోన్ కట్ చేసాడు.
*****************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ)

No comments: