ఆగష్టు1
(టాగ్ లైను...డేట్ తో డిష్యుం...డిష్యుం)
03-05-2013 (23rd Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు చంద్రహాస్.
ఎవరో పిలిచారు...అవును తన చెవి పక్కన రెండు పెదవులు మాట్లాడాయి. ఆ గొంతు
తనకు సుపరిచితమే....తనకు ప్రాణ సమానమే. ప్రణవి గొంతు...దిగంతాలకు ఆవల
వున్నా తను గుర్తు పట్టగల గొంతు. కొన్ని వేన వేల సార్లు విన్న గొంతు.
ఇక్కడే ఎక్కడో వుంది.
"ప్రణవీ నువ్వు ఎక్కడున్నావ్? నువ్వు లేకుండా నేను లేను..నువ్వు లేని నేను ఎలా వున్నానో చూడు..."
అతని గుండె సవ్వడి చేస్తోంది. ఆ గుండె సవ్వడి ప్రణవికి చేరేదెలా? వందల మైళ్ళ దూరంలో వున్న
ఆమెను ఆ గొంతు చేరుతుందా?
******* ******* *******
ప్రణవికి సంబంధించిన ప్రకటనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తున్నాడు. రికార్డు
చేసిన వాయిస్ వింటున్నాడు. వైజాగ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఎందుకో అతడిని
పదే పదే హంట్ చేస్తుంది. తను వైజాగ్ వెళ్తే...తన ప్రణవి కనిపిస్తుందేమో....
ఆ ఆలోచన రావడంతోనే పి.ఏ. ని పిలిచి ఫ్లయిట్ టికెట్ బుక్ చేయమన్నాడు.
బ్రీఫ్ కేసులో కొన్ని బట్టలు సర్దుకున్నాడు. బయటకు నడిచాడు. గేటు దగ్గరికి
రాగానే సెక్యూరిటీ చీఫ్ మెహతా పరుగెత్తుకు వచ్చాడు.
"సర్ ఎక్కడికి వెళ్తున్నారు? అంటూనే సెక్యూరిటీకి సైగ చేసాడు.
సీరియస్ గా మెహతా వైపు చూసి ముందుకు నడిచాడు. మెహతా మరో సారి చంద్రహాస్
దగ్గరికి వెళ్లి "ప్లీజ్ సర్ .." అంటూ ఏదో చెప్పబోయాడు. చంద్రహాస్ అవేమీ
వినిపించుకోకుండా ముందుకు నడిచాడు. వెంటనే మెహతా డాక్టర్ చతుర్వేదికి ఫోన్
చేసి పరిస్థితి వివరించాడు.
సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత...ఒక ఫోన్ చేసాడు.
***************
రామతీర్థం సోఫాలో కూచోని కర్రకాలుని నేల మీద కొడుతూ ఆ సౌండ్ వింటున్నాడు.
ఎదురుగా అతని అనుచరులు "యస్ బాస్" టైపు లో నిలబడ్డారు. దాదాపు పది నిమిషాల
పాటు అలా శబ్దం చేస్తూనే వున్నాడు. ఆ శబ్దం వినడానికి ఇరిటేటింగ్ గా
అనిపించింది అనుచరులకు.
ఒక్క క్షణం నేల మీద కొట్టడం ఆపాడు. ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డ అనుచరుల వైపు చూసాడు.
"ఏంటీ సైలెంట్ అయ్యారు...ఎప్పుడూ వయోలెంట్ గా కనిపించే వీడు ఇలా చేస్తున్నాడు ..వీడికి ఏమైనా మెంటల్ గట్రా అని ఫీల్ అవుతున్నారా?
ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు, ఎం మాట్లాడితే ఏం జరుగుతుందేమోనన్న భయం.
"ఏదో ఒకటి మాటలాడండి.మ్యూజిక్ లో ప్రయోగాలు చేస్తున్నాను. నేను నేల మీద
కాలును కొడుతున్నప్పుడు వచ్చే సౌండ్ గమనించారా? మ్యూజిక్ సెన్స్
వుండాలి...నేనే ఓ సినిమా తీసి కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, దర్శకత్వం...
రామతీర్థం అని సింగిల్ కార్డు వేయించుకుంటాను." చెప్పి అందరి వైపు చూసాడు.
"మరి నిర్మాత ఎవరు?" అని అడిగే సాహసం చేయలేదు ఎవరూ...
అప్పుడే వచ్చింది ఫోన్ కాల్ మెహతా దగ్గరి నుంచి.
***************
సంధ్యాజ్యోతి మర్రిచెట్టుని చూసి ఒక్క క్షణం భయపడింది. ఆ క్షణం ఆమెకు
రాంగోపాల్ వర్మ గుర్తొచ్చాడు. అతగాడికి కూడా రాత్రుళ్ళు భయమట...దెయ్యాల
సినిమాలు తీసేవాళ్ళు దెయ్యాలంటే భయపడుతారా? అసలే మర్రిచెట్టు అని వర్మ
సినిమా తీసాడు. తనలో తనే గొణుక్కుంది .
నిర్మానుష్యంగా వుంది ఆ ప్రాంతం. ఒంటరిగా ఎలా వూగుతున్నదో అనుకుంది. ఆ మరుక్షణమే...ఆత్మలు దానికి కాపలా కాస్తూ ఉండొచ్చు అనుకుంది.
"హలో ఆత్మలు...నన్ను పలకరించడానికి రాకండి..." మెల్లిగా గొణిగి సడెన్ గా వెనక్కి తిరిగింది. ఎవరి శ్వాసో తన మెడని తాకిన ఫీలింగ్.
భయంతో ఒళ్ళు గగుర్పొడిచింది. తను తొందరపడిందా?
ఎవరో తన వెనుకే నడుస్తోన్న భ్రమ...ఇది భ్రమా? నిజమా?
(రేపటి సంచికలో)
No comments:
Post a Comment