ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

ఆగష్టు1( టాగ్ లైను...డేట్ తో డిష్యుం...డిష్యుం)
02-05-2013 (22nd Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
++++++++
"నిద్ర పట్టనివ్వని జ్ఞాపకమా....నేనంటే నీకెందుకింత కినుక...జాలిలేని గతమా నన్ను వీడిపోవుట నీకు భావ్యమా ? క్షణంలో కనుకొలకుల నుంచి జారి నేల మీద పడి ఆత్మార్పణ చేసుకునే కన్నీటి భాష్పమా నన్ను వదిలి పోవుట నీకు న్యాయమా? " మోకాళ్ళ మధ్య తల పెట్టి మబ్బు పట్టిన ఆకాశాన్ని చూస్తూ, వేదనాభరిత హరిణి అయింది ప్రణవి.
తన పేరు మరిచింది...తన వూరు మరిచింది....తన గతం మరిచింది....గుండెని పట్టి కుదిపేసే ఫీలింగ్. దూరంగా నులక మంచం మీద కూర్చుని వున్నా వృద్ధుడు ఓ నిట్టూర్పు విడిచాడు. ఎవరూ పరిష్కరించలేని సమస్య..ప్రణవిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఏమీ చేయలేని నిస్సహాయత.
ప్రణవికి తలంతా భారంగా అనిపించింది. నిరంతర ఆలోచనల వల్ల కలిగిన పెయిన్...ఎప్పుడూ ఆలోచిస్తూనే వుంటుంది. తన గురించి తనకు తెలియకపోవడం ఎంత నరకం? తన గురించి ఎవరిని అడగాలి? దేవుడు మాత్రమే చెప్పగల సమాధానమా? సమయమింకా రాలేదా, ఎన్ని రోజులిలా వుండాలి? ఎంత కాలమిలా బ్రతకాలి? ఒక నిశ్చయానికి వచ్చింది.
అన్వేషణ...తను అన్వేషించాలి...తనెవరో తెలుసుకోవాలి...ఈ అన్వేషణ ఎలా మొదలు పెట్టాలో. ఎక్కడినుంచి ప్రారంభించాలో తెలియడం లేదు. అయినా అన్వేషణ కొనసాగించాలి. బలమైన నిర్ణయం. తిరుగులేని నిర్ణయం.
ఇప్పుడు కాస్త రిలీఫ్ గా అనిపించింది ప్రణవికి.
++++++++++
క్యాబ్ వెళ్తోంది...అంత కన్నా స్పీడ్ గా మాట్లాడుతుంది సంధ్యాజ్యోతి. తను జర్నలిస్ట్ అని కిరణ్ బేడిని త్వరలో ఇంటర్ వ్యూ చేస్తానని, అర్ధరాత్రి సంఘవిద్రోహకర శక్తులను కనిపెట్టి న్యూస్ రాస్తానని ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే వుంది.
నగరం సరిహద్దుల్లోకి వచ్చింది. నిర్మానుష్యం అక్కడక్కడ విసిరేసినట్టు వున్న ఇళ్లు. క్యాబ్ ఆగింది. సంధ్యాజ్యోతి క్యాబ్ అతని వైపు "క్యా భాత్ హై " అన్నట్టు చూసింది.
ఆమె చేతిలో పెప్పర్ పొడి వుంది. దాన్ని క్యాబ్ డ్రైవర్ కి కనిపించేలా పట్టుకుని "ఇదేమిటో తెలుసా? అని అడిగింది.
"తెలియదు" అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
"పెప్పర్ పొడి...కళ్ళలో పోస్తే కళ్ళు కనిపించవు...అమావాస్య చంద్రులై పోతారు..." అంది.
"అవునా" అన్నట్టు చూసాడు .
ఆ వెంటనే అత్యుత్సాహంగా హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పళ్ళు కోసే కత్తి తీసి అదీ చూపించింది.
"తెలుసు పళ్ళు కోసుకునే కత్తి" ఈ సారి వెంటనే చెప్పాడు.
"దీంతో కట్ చేస్తే ....తల, మొండెం రెండు పార్ట్శ్ అవుతాయి" చెప్పి డ్రైవర్ మొహం లోకి చూసింది.
"ఇదంతా నాకెందుకు చెబుతున్నారు మేడం?" డ్రైవర్ ఆశ్చర్యం, భయం మిక్స్ చేసి అడిగాడు
"ఒక వేళ నీకేమైనా ఐడియాలు వుంటే, నేనేం చేస్తానో చెబుతున్నాను. నీ క్యాబ్ నంబర్ పోలీస్ కంట్రోల్ రూంకి ,మా ఆఫీసుకి పంపించాను." సంధ్యాజ్యోతి చెప్పింది.
క్యాబ్ డ్రైవర్ రెండు చేతులు జోడించి "అమ్మా తల్లీ, నా చెల్లీ నీకో దండం...నా క్యాబ్ ఎక్కినప్పటి నుంచి ఏదో చెబుతూనే వున్నారు.మీరు చెప్పిన అడ్రెస్ వచ్చింది. అయినా మిమ్మల్ని ఏదైనా చేసే ధైర్యం ఎవరికి వుంటుంది? మీరు వెళ్లేదే క్షుద్రమాంత్రికుడి దగ్గరికి...మిమ్మల్ని చూస్తోంటే ...అని ఆగి వద్దులే..పెప్పర్ పొడి కళ్ళలో కత్తి గుండెలో దించుతారు. మీరు చెప్పిన అడ్రెస్ ఇదే...ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి...రోడ్డు బాగా లేదు...పైగా ఆ ఏరియాకు నేను రాను." గబ గబ చెప్పేసి ఆయాసం తీర్చుకోవడానికి ఆగాడు.
"ఓహ్..అలా అనుకున్నారా...ఈ మధ్య పేపర్స్ లో వార్తలు చూసి అలా మిస్సండర్ స్టాండ్ చేసుకున్నాను బ్రదర్.." అంది సంధ్యాజ్యోతి.
"థాంక్స్ తల్లీ సారీ చెల్లీ...ఇంకా నయం ముందే పోలీసులకు చెప్పి కొట్టించలేదు" చెప్పి మీటర్ చూసి ఎంతయిందో చెప్పాడు.
"వెయిట్ చేయొచ్చు కదా భయ్యా ...కావాలంటే మీటర్ మీద ..."
డ్రైవర్ ఏమనుకున్నాడో ఆమె వంక చూసి "సరే" కానీ ఎక్కువ లేట్ చేయొద్దు, అన్నాడు
"చేయను, జస్ట్ గంటని చెప్పి ముందుకు నడిచింది.
చాలా ఇరుకైన దారి. దూరంగా జుట్టు విరబోసుకున్నట్టు మర్రిచెట్టు...ఆ పక్కనే క్షుద్రమాంత్రికుడి నివాసం.
*******
(సంధ్యాజ్యోతికి క్షుద్రమాంత్రికుడితో పనేమిటి? రేపటి సంచికలో ...)

No comments: