ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

ఆగష్టు1...(టాగ్ లైను..డేట్ తో డిష్యుం...డిష్యుం)
28-04-2013
(18th Chapter)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
****
భర్త అడుగుల శబ్దం దగ్గరవుతోన్న కొద్ది రాధాచంద్రిక గుండె వేగం పెరుగుతోంది. ఒకప్పుడు తన గదిలోకే కాదు...మదిలోకీ చొచ్చుకువచ్చిన భర్త సాన్నిహిత్యం ఇప్పుడు భయానికి గురి చేస్తుంది.
వెంటనే మంచం మీదికి చేరి నిద్ర నటించింది. భర్త అడుగుల శబ్దం మరింత...మరింత దగ్గరైంది. ఒకప్పుడు ఆ దగ్గరితనాన్ని తను ఆహ్వానించేది. అనుభవించడాని తపించేది...అనుభూతించడానికి తహతహలాడేది.
భర్త చేయి తనని సమీపిస్తుంది. ఏం చేస్తాడు..? తన గొంతు పిసికి చంపేస్తాడా? తన మెడలో మూడు ముళ్ళు వేసిన వాడే ఉరి ముడి బిగిస్తాడా? దుప్పటి కప్పి అటువైపు వచ్చి పడుకున్నాడు. మామూలుగా అయితే తనని దగ్గరికి తీసుకునే వాడు. ఇపుడా దగ్గరితనం మృత్యు పరిష్వంగనం కాబోతుందా? అలా కలత నిద్రలోనే తెల్లవారింది.
*******************
రాధాచంద్రిక కళ్ళు ఎర్రబడ్డాయి...పొద్దున్న లేస్తూనే భర్త తన మొహాన్ని చేతుల్లోకి తీసుకునేవాడు. తన పెదాలతో శుభోదయం చెప్పేవాడు. కానీ ఆ రోజు అలాంటి శుభోదయం కాలేదు. బయటకు వెళ్ళిపోయాడు. తొమ్మిది దాటుతుండగా వచ్చాడు. వస్తూనే బాత్ రూంలోకి వెళ్ళాడు
స్నానం చేసి వచ్చాడు. టేబుల్ మీద టిఫిన్ సర్దింది. రోజూ రెండు రకాల టిఫిన్స్ ఉండేవి. ఈ రోజు ఒక్కటే...అదీ ఉప్మా... .
భార్య వంక చూసి "రాధీ నువ్వూ కూచో " అన్నాడు.
"నాకిప్పుడు తినాలని అనిపించడం లేదు ...తల నొప్పిగా వుంది...కాసేపు పడుకుంటాను." అంటూ బెడ్ రూం వైపు నడిచింది.
************************
భర్త తయారవ్వడం గమనిస్తూనే వుంది. ఏ రోజూ తన ప్రజెన్స్ ని మిస్సవ్వని భర్త ఈ రోజు తనను మిస్సవుతున్నాడు. ఆ విషయం తనకూ తెలుస్తుంది. అంటే తప్పు చేసిన గిల్టీ ఫీలింగ్ భర్తలో వుంది. ఒకమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేసాడు. ప్రేమించడమే తప్ప ద్వేషించడం, కనీసం మనసును సైతం బాధపెట్టడం తెలియని సున్నితమనస్కుడు తన భర్త అని తను గర్వపడుతూ వచ్చింది. ఇప్పుడా గర్వం..ఏమైంది?
టైం పది గంటలు...
"నేను ఆఫీసుకు వెళ్తున్నాను...టీపాయ్ మీద తల నొప్పి మాత్ర పెట్టాను, ఫ్లాస్క్ లో టీ వుంది." యాక్షన్ అనగానే డైలాగ్ చెప్పినట్టు చెప్పి బయటకు నడిచాడు భర్త.
*****************
భర్త ఆఫీసుకు వెళ్ళగానే దిగ్గున లేచింది రాధాచంద్రిక. గబ గబా పనులు పూర్తీ చేసుకుంది. ఏదో ఒకటి చేయాలి. తన భర్తే కావచ్చు.నిన్నటి వరకూ తన మీద ప్రేమ చూపించవచ్చు. కానీ ఒక హంతకుడు..ప్రమాదవశాత్తు కాదు...కేవలం అక్రమసంబంధం...చనిపోయిన వ్యక్తి ఎలాంటిదైనా కావచ్చు...కానీ చంపిన వ్యక్తి పచ్చి స్వార్ధపరుడు. అలాంటి వ్యక్తిని తను క్షమించకూడదు.
పోలీసులకు పట్టించాలి. తర్వాత తన జీవితం ఏమైనా సరే...తను మళ్ళీ మై హోం గెస్ట్ హౌస్ కు వెళ్ళాలి.
చెప్పులు వేసుకుని బయటకు నడిచింది. ఆటోని పిలిచి అడ్రెస్ చెప్పింది. ఆటో గోల్డెన్ హిల్స్ వైపు వెళ్తుంది...మూల మలుపు తిరుగుతుండగా వెనక నుంచి ఓ వాటర్ ట్యాంకర్ వచ్చేసి ఆటోని గుద్దేసింది.అంత వరకు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత తనకు స్పృహ తప్పింది.
స్పృహ తప్పుతుండగా అంబులెన్స్ శబ్దం వినిపించింది.
****************
కళ్ళు తెరిచి చూసిన రాధాచంద్రిక తను హాస్పిటల్ లో వున్నట్టు గుర్తించింది. తన ఆటోని వాటర్ ట్యాంకర్ డీ కొట్టడం వరకే గుర్తుంది. తర్వాత తనకేమీ గుర్తు లేదు. తనని హాస్పిటల్ లో చేర్చింది ఎవరు? తన తలకు కట్టు వుంది. ఈ లోగా డాక్టర్ లోపలి వచ్చాడు...వెనుకే నర్స్ వచ్చింది.
"డాక్టర్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అడిగింది రాధాచంద్రిక ,
"యాక్సిడెంట్ చూసి ఎవరో అంబులెన్స్ కు ఫోన్ చేసారు...ఆ తర్వాత మీ హ్యాండ్ బాగ్ లో వున్న మీ వారి నంబర్ చూసి కాల్ చేసాం. తను వెంటనే వచ్చాడు..మీకు మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాడు. మిమ్మల్ని స్పెషల్ వార్డ్ లోకి మార్పించింది తనే" డాక్టర్ చెప్పాడు.
నవ్వుకుంది రాధాచంద్రిక..బలి ఇచ్చే ముందు ఇలానే మేపుతారు...ప్రేమని చూపిస్తారు...అనుకుంది మనసులో...
మరో అయిదు నిమిషాల్లో భర్త వచ్చాడు. భార్య తల మీద చేయి వేసి "ఏమైంది రాధీ ...అసలు బయటకు ఎందుకు వెళ్ళవు? నాకు చెబితే నేనే తీసుకువెళ్ళేవాడిని కదా..ఇంతకూ ఎక్కడికి బయల్దేరావు..?"
"ఏమని చెప్పాలి? మీరు హత్య చేసిన విషయాన్ని నిర్ధారించుకోవడానికి, సాక్ష్యాలు సేకరించడానికి అని చెప్పాలా?
లాభం లేదు...అడిగేసేయాలి...ఇలా తనలో తనే మథనపడడం ఎందుకు? ఇంటికి వెళ్ళగానే అడగాలి.
********************
డిశ్చార్జి అయి ఇంటికి వచ్చింది ...
బెడ్ మీద వెనక్కి ఒరిగి అలసటగా కళ్ళు మూసుకుంది రాధాచంద్రిక. భర్త ఇంటి దగ్గర దింపి బయటకు వెళ్ళాడు .
డోర్ బెల్ మోగింది. మెల్లిగా లేచి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు...షాకైంది..అంటే భర్త హత్య చేసిన విషయం పోలీసులకు తెలిసిపోయిందా?
(పోలీసులు ఎందుకు వచ్చినట్టు...రేపటి సంచికలో)

No comments: