ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 19 June 2013


ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
02-06-2013 (Chapter-53)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ఒక రచయిత రాసే కథలో ఎన్నో మలుపులు...తన మేథాశక్తితో చదువరులను ఆకట్టుకోవడానికి ఎన్నో నాటకీయ సంఘటనలు....కానీ నిజజీవితంలో విధిని మించిన గొప్ప రచయిత ఎవరు? విధాతను మించిన మహా రచయిత ఎవరు? ఊహకు అందని జీవితాన్ని రచించే సూత్రధారి...వాస్తవ పాత్రలను పరుగులు పెట్టించే దర్శకుడు.
కార్తికేయ వంకే చూస్తోంది ముగ్ధ...అవును ...తమ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయి. ప్రణవి మతిస్థిమితం కోల్పోవడం ఎంత విషాదం?
"ముగ్దా...ఒక్కోసారి చంద్రహాస్ ని చూస్తోంటే...తను నా కవల సోదరుడేమో అనిపిస్తోంది..."
"అవునండీ...ప్రణవిని చూస్తోంటే మొన్నటి నన్ను నేను చూసుకున్నట్టుగా వుంది...తాజ్ మహల్ సన్నివేశం గుర్తొస్తే ...ప్రణవిలో నేనే కనిపించాను....బహుశా నేను, ప్రణవి పోయిన జన్మలో కవలలం కాబోలు" అంది ముగ్ధ.
కార్తికేయ దీర్ఘంగా నిశ్వసించాడు..ప్రణవికి తానెవరో చెబితే..వెంటనే చంద్రహాస్ ని చూడాలంటుంది...ఇరవై నాలుగు గంటలుగా చంద్రహాస్ ఆచూకి తెలియడం లేదు... ప్రణవి ఆ రోజు ప్లయిట్ బ్లాస్ట్ అయిన తర్వాత ఎలా మిస్సయిందో తెల్సుకోవాలి? అసలు ఇన్నాళ్ళు ప్రణవి ఎక్కడున్నట్టు? ఈ సమాధానం తెలియాలంటే తను వైజాగ్ వెళ్ళాలి...అపుడు ఇక్కడ ప్రణవిని చూసుకునేదెవరు?
********************
గబ్బిలాల వాసన ఆ పరిసరాలను చుట్టుముట్టింది. నిక్శూచికి ప్రీతిపాత్రమైన వాసన....తల క్రిందులుగా వేలాడుతూ నిక్శూచిని ఆహ్వానిస్తున్నట్టు....మరియప్ప పాడుబడిన సమాధి మీద కూచున్నాడు. తరతరాలుగా తమకు ఈ క్షుద్రవిద్యలు నేర్పిన తమ పూర్వీకులను ఆహ్వానిస్తూ, వాళ్లకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాడు...పదమూడవ తరానికి చెందిన మరియప్ప చిట్టచివరివాడు...
కేవలం క్షుద్రవిద్యలు తమ వారసులకు అందించడానికి మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకుని, ఆ తర్వాత తమ భార్యలను క్షుద్రశక్తులను సంపాదించడానికి బలి ఇచ్చే క్షుద్ర సాంప్రదాయం వున్న మరియప్ప మాంత్రిక వంశంలో ఓ అపశ్రుతి జరిగింది. మరియప్ప భార్య ఈ క్షుద్రవిద్యలకు వ్యతిరేకి. తన బిడ్డ క్షుద్ర మాంత్రికుడు కావడం...క్షుద్రదేవతలను ఉపాసించడం నచ్చలేదు.
దేవుడికి వ్యతిరేకంగా తన బిడ్డను చూడకూడదు అనుకుంది. బిడ్డ పుట్టిన వెంటనే తన చేతులతో చంపడానికి మనసు రాలేదు.
తనకు తెలిసిన క్షుద్రవిద్యతో బిడ్డను చంపేసింది...తనూ నిక్శూచికి బలైంది...రెండవ బిడ్డ వారసుడిగా పనికి రాడు...ఆ విధంగా మరియప్ప వంశంలో చిట్టచివరి వాడయ్యాడు. తన శిష్యుడి మరణంతో మరో సారి నిక్శూచిని నిద్రలేపి తన శక్తులను తిరిగి పొందాలని అనుకున్నాడు.
దూరంగా, భయంగా ఈ తంతును చూస్తోన్న మరియప్ప భార్య ఆత్మ మౌనంగా నిట్టూర్చింది. బాధగా చూస్తోండిపోయింది.
******************
ఉలిక్కిపడి లేచాడు చంద్రహాస్ ...అతని మొహం చెమటతో తడిసిపోయింది. ఉదయం జరిగిన సంఘటన ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగింది. డాక్టర్స్ రావడం తనను పరీక్షించడం...అన్నీ గుర్తొచ్చాయి...
అసలు ఉదయం ఏం జరిగింది? తను లేచి బయటకు వెళ్తుంటే "తను వెళ్ళకుండా ఆపారు"
బలవంతంగా తనకు పరీక్షలు చేసారు. చివరికి తనకు పిచ్చి అని కన్ఫర్మ్ చేసారు. అప్పుడు తను కోపంగా రియాక్ట్ అవ్వడం గుర్తొచ్చింది. తనకు మత్తు ఇవ్వడం గుర్తొచ్చింది. తిరిగి ఇప్పుడు మెలుకువ వచ్చింది.
ఇది...ఇది పిచ్చాసుపత్రినా? తను పిచ్చివాడా? నో ..నెవ్వర్...ఏదో జరుగుతుంది? లేచి చుట్టూ చూసాడు...అంతా ముసుగుతన్ని పడుకున్నారు...బయట కుర్చీలో కూచోని కునికిపాట్లు పడుతున్నాడు బాయ్ ...
బెడ్ లాంప్ వెలుతురూ...తను ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఒక్కో అడుగు వేస్తూ బయటకు వస్తున్నాడు...
************************
"గ్రీహోం...ద్రుహోం..క్రోహోం..నిక్శూచి ఆవాహం..." మరియప్ప గొంతులో నుంచి క్షుద్రోచ్చారణ మొదలైంది. పదమూడు సమాధుల మధ్య నిద్రలో వున్నా నిక్శూచిని నిద్రలేపుతున్నాడు మరియప్ప...ఆ ప్రాంగణంలో గాలి స్థంబించింది. నక్కలు భయంతో పరుగుతీశాయి..తీతువు పిట్టలు బిగదీసుకున్నయి.
ఒక్కో అంకాన్ని దాటుతూ చివరి అంకానికి చేరుకున్నాడు..ఈ అంకాన్ని పూర్తిచేస్తే జరిగే ఉత్పాతం భయంకరంగా వుంటుంది.
*****************
చంద్రహాస్ ఏడవ అడుగు వేసాడు..ఎనిమిదవ అడుగు పడుతుండగా...ఆ పరిసరాల్లోకి ఓ గుడ్లగూబ వికృతమైన శబ్దంతో, వాసనతో ప్రవేశించింది.నిక్శూచి ఆగమనానికి అది గుర్తు...
ఉలిక్కిపడి లేచింది ప్రణవి...
సంధ్యాజ్యోతికి ఒక్కసారి మెలుకువ వచ్చింది...టేబుల్ మీద వున్న సాయి ప్రతిమ...రచయిత విసురజ ఇచ్చిన ప్రతిమ...విసురుగా వచ్చిన గాలికి కింద పడబోయింది. సంధ్యాజ్యోతి సాయి ప్రతిమ పడకుండా పట్టుకోబోయింది. అప్పుడే సన్నగా కడుపులో నొప్పి...పేగులు మెలి పెడుతున్నట్టు...
*****************
(ఈ సస్పెన్స్ రేపటి వరకూ....)

No comments: