ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 June 2013


ఆగష్టు1(టాగ్ లైన్...డేట్ తో డిష్యుం...డిష్యుం)
08-06-2013 (Chapter-59)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ...
******************
మనసుకు జోలపాట పాడి నిద్రపుచ్చే అందమైన జ్ఞాపకం...ఎక్కడో అదృశ్యంగా ఉండిపోయింది. తానెవరో తెలియక పోవడం కన్నా, తెలుసుకునే ప్రయత్నంలో అనుభవించే బాధ అత్యంత వేదనాభరితంగా వుంటుంది. ఆ బాధను అనుభవిస్తోన్న ప్రణవి నిద్రకు దూరమైనది. ఆమె బాధను ముగ్ధ గమనిస్తూనే వుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఆమెది. తను పూజించే దేవుడిని ఒక్కటే కోరుకుంది. ప్రణవికి మంచి జరగాలి. మంచి మనసుతో ఆమె కోరుకున్న కోరికను దేవుడు తీర్చకుండా ఉంటాడా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.
********************
మరియప్ప రెండురోజులుగా కంటి మీద కునుకు లేకుండా వున్నాడు. నిక్శూచిని నిద్రలేపే మాంత్రికుడు, నిక్శూచి నిద్రలేచే వరకూ, తను నిద్రపోకూడదు. కంటి మీద కునుకు పడిందా?..అతి భయంకరమైన చావు చస్తాడు.
ఆ స్మశానంలో వున్న ప్రతీ దుష్టప్రేతం భయంతో వణికిపోతుంది. నిక్శూచి వికృత విశ్వరూపాన్ని చూసే శక్తి ఆ ప్రేతాత్మలకు లేదు. ఇదంతా చూస్తోన్న మరియప్ప భార్య ఆత్మ నిస్సహాయంగా ఉండిపోయింది.
తను ఏదో ఒకటి చేయాలి. నిక్శూచి నిద్ర లేస్తే జరిగే ఉత్పాతం తెలుసు...ప్రపంచంలోని మంచి తుడుచుకుపెట్టుకుపోతుంది. మనుషుల్లో దుష్ట ప్రవృత్తి పెరిగిపోతుంది. ఒకరికొకరు శత్రువులు అవుతారు.
వాంపయిర్స్ కన్నా ప్రమాదకరంగా తయారవుతారు.
ఆమె మనసులోనే దేవుడిని ప్రార్థించింది. "నువ్వున్నది ఎంత నిజమో..దుష్టశక్తులు వున్నది అంటే నిజం..నువ్వు వున్న చోట దుష్టశక్తులు వుండకూడదు. నువ్వు సృష్టించిన ఈ సృష్టిని నువ్వే కాపాడాలి."
మనఃస్పూర్తిగా దేవుడికి దణ్ణం పెట్టుకుంది. చిత్రంగా ఆమె ఆత్మ ఆమె ప్రమేయం లేకుండానే గాలిలోకి తేలి ఎగురుతోంది.
శ్మశానానికి దగ్గరలో వెంకటేశ్వరుడి కోవెల...వందల ఏళ్ళ క్రితం ముష్కరుల దాడిలో శిథిలమైన కోవెల...పాములు...పుట్టలు...చెట్లు ...దట్టమైన అడవిలాంటి ప్రాంతం...చిత్రంగా ఆ కోవెల మీదుగా ఆమె ఆత్మ ఎగురుతూ వెళ్తోంది.
"దేవుడా మా లాంటి ఆత్మలకు మిమ్మల్ని సమీపించే శక్తి వుండదు...కానీ నీ ఆలయం మీదుగా ఎగిరే అదృష్టాన్ని, నిన్ను దర్శించే భాగ్యాన్ని కలిగించావా తండ్రీ? నీ లీలల పరమార్థం ఏమిటి? ఏ దేవుడి సన్నిధికి, ఏ సత్కార్యాన్ని నాతో చేయించడానికి సంకల్పించావు?
తన ప్ర్తమేయం లేకుండా వెళ్తోంది ఆత్మ...గాలి దిక్సూచి అయింది...కార్తికేయ ఇంటి వైపు వెళ్తోంది ఆ ఆత్మ...
****************************
టేబుల్ మీద వున్న పేపర్ వెయిట్ గాలిలోకి లేచింది. ఎదురుగా వున్న అక్వేరియాన్ని గట్టిగా తగిలింది. అక్వేరియం భళ్ళున పగిలింది. అందులోని చేపలు గిల గిలా కొట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా ఆ చేపలలో చలనం ఆగిపోయి, తిరిగి ప్రారంభం అయింది. చేపలు క్షణ క్షణం పెరిగిపోతున్నాయి.. ఒకటి, రెండు.మూడు ఆడుగుల పొడవు...బరువు...భయంకరమైన ఆకారం...డైనోసార్ లా అనిపిస్తోంది.
చంద్రహాస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసాడు. తను త్రీడీ సినిమా చూస్తున్నాడా? తను కలగంటూన్నాడా? భయంకరమైన వింత ఆకారంలో వున్న చేప ఆ గదిలో మూడవ వంతును ఆక్రమించింది. ఏ క్షణమైనా ఆ ఆకారం నోటిలోకి వెళ్ళడానికి సిద్ధంగా వున్నట్టు వుంది అక్కడి వాతావరణం...
ఆ ఆకారం చంద్రహాస్ ని సంపీపించింది.
అదే సమయంలో...
***********************
మరియప్ప భార్య ఆత్మ కార్తికేయ ఇంటిని సంపీపించింది. గుమ్మం ముందు నిలువెత్తు వెంకటేశ్వరుడి ప్రతిమ...మరో వైపు షిర్డీ సాయి ప్రతిమ...ఆ రెండు దైవాలకు నమస్కరించింది ఆత్మ...చిత్రంగా ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ప్రణవి గది తలుపు తెరుచుకుంది. ప్రణవిని చేరింది ఆత్మ.
కళ్ళు తెరిచింది ప్రణవి. ట్రాన్స్ లో వున్నట్టు లేచింది. తన గదిలో నుంచి బయటకు వచ్చింది. హాలులోకి వచ్చింది. బయటకు నడిచింది.
అ ఇంట్లో వున్న పూజగాదిలోని హారతి గంట గాలిలోకి లేచింది. గణ గణ శబ్దం.
కార్తికేయ లేచాడు. ఈ వేళలో దేవుడి హారతి గంట మోగడం ఏమిటి? హాలులోకి వచ్చాడు. బయటకు నడుచుకుంటూ వెళ్తోన్న ప్రణవి కనిపించింది.
********************
టాక్సీ స్టాండ్
అర్ధరాత్రి వేళ అంతా కునికిపాట్లు పడుతున్నారు. మరియప్ప భార్య ఆత్మ ఓ క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళింది.
ఆ క్యాబ్ డ్రైవర్ లేచాడు...కారు స్టార్ట్ చేసాడు. కారు ముందుకు కదిలింది. ట్రాన్స్ లో వున్నట్టు డ్రైవ్ చేస్తున్నాడు. కారు ప్రణవి ముందు ఆగింది. ప్రణవి కారులో కూచుంది. కారు ముందుకు కదిలింది.
**************
కార్తికేయ ప్రణవి నడుచుకుంటూ వెళ్ళడం, కారు ఆమె పక్కన ఆగడం గమనించాడు. అతని అయోమయంగా వుంది. వెంటనే కారు దగ్గరికి వెళ్ళాడు. లక్కీగా కారు కీస్ కారుకే వున్నాయి. కారు స్టార్ట్ చేసాడు. ప్రణవి కారును ఫాలో అవుతున్నాడు.
*****************
( ఈ సస్పెన్స్ రేపటి వరకూ...)

No comments: