ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 25 June 2013

ఆగష్టు1(టాగ్ లైన్ ...డేట్ తో డిష్యుం...డిష్యుం)
15-06-2013 (Chapter-66)
కనిపించకుండా పోయిన ఆమె కోసం అతని అన్వేషణ ...
******************
ముగ్ధ ప్రణవి గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో కాఫీ గ్లాస్....ప్రణవి ముగ్ధ వంక చూసి అడిగింది "నేను ఎక్కడున్నాను? మీరు?" ఇంకా ప్రణవి ఒక విధమైన షాక్ లోనే వుంది. ముగ్ధకు ప్రణవి మానసిక పరిస్థితి అర్ధమైంది.
"ముందు మీరు రిలాక్స్ అవ్వండి" అంది కాఫీ ఇస్తూ.
రెండు కణతలు బలంగా నొక్కుకుంది. ఒక్కో విషయం ఆమె జ్ఞాపకాల అరలో నుంచి బయటకు వస్తున్నాయి. ఆమె జ్ఞాపకాల్లో చంద్రహాస్ మాత్రమే కనిపిస్తున్నాడు. ప్రణవి ముగ్ధ పక్కనే కూచొని చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు తాజ్ మహల్ దగ్గర జరిగిన ప్రమాదం నుంచి ఈ క్షణం వరకు...
క్షణాలు కన్నీటి కణాలై బయటకు వస్తున్నాయి.
తన కోసం ఇంతటి అన్వేషణ మొదలైందా? ఇప్పుడు తన భర్త ఎక్కడున్నాడు? ఎలా వున్నాడు? తనకు రెక్కలు వస్తే గాలిలో ఎగిరి తన భర్త ముందు వాలిపోయేది. అసలు అతనికి దూరంగా తనెవరో, తనకే తెలియకుండా ఎలా బ్రతికింది?
ప్రణవి చేయి పొట్ట మీదికి వెళ్ళింది." అతని తాలూకు స్పర్శ, జ్ఞాపకం. ఇక్కడే ఇక్కడే వుంది...అందుకే తను బ్రతికి వుంది" ఆ ఆలోచన ఆమెకు తృప్తిని కలిగించింది. ముగ్ధ వైపు చూస్తూ రెండు చేతులు జోడించింది.
"మీ గురించి విన్నాను...కార్తికేయ గారు దేశానికి చేసిన మేలు తెలుసు...మిమల్ని కలవడం నా అదృష్టం..నా కోసం మీరు తీసుకున్న జాగ్రత్త...ఓ సోదరిలా ఆదుకున్న సంఘటన నేను మర్చిపోలేను" కృతజ్ఞతాపూర్వకంగా అంది.
"మిమ్మల్ని చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్టు వుంది. చంద్రహాస్ గారు వచ్చేస్తారు..మీరు కంగారు పడకండి. .ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి." ముగ్ధ చెప్పింది.
ప్రణవి కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు భర్త కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు...? శత్రువును చీల్చి చెండాడుతూ తన కోసం వస్తూ ఉంటాడు.
ఆ ఆలోచన ఆమెకు వేన వేల బలాన్ని ఇచ్చింది.
****************

కళ్ళు తెరిచి చూసిన చంద్రహాస్ కు అంతా కలలా అనిపించింది. రాత్రి కనిపించిన భీకర ఆకారం లేదు...అక్వేరియం మామూలుగానే వుంది. ఇదంతా తన భ్రమా ? లేదు భ్రమ కావడానికి వీలులేదు...ఏదో జరిగింది...ఏ అదృశ్యశక్తో తనని కాపాడింది. ఒక్కో సంఘటన గుర్తుకు వస్తున్నాయి. తనకు యాక్సిడెంట్ అవ్వడం మొదలు...ఈ క్షణం వరకూ....జేబులు తడుముకున్నాడు. తన మొబైల్ లేదు...నిన్నటి వరకూ తన చుట్టూ వున్నా మంచాలు ఇప్పుడు లేవు...అంటే తన వెనుక ఏదో కుట్ర జరుగుతుంది. ఆ విశాలమైన హాల్ వైపు మరో సారి చూసాడు. ఆ చివరికి వెళ్ళాడు. తలుపు వేసి వుంది. అవతలి వైపు నుంచి డోర్ లాక్ చేసినట్టు తెలుస్తోంది.
చంద్రహాస్ కళ్ళు అక్కడి పరిసరాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అతని దృష్టి మంచం కింద పడింది. అక్కడ తన మొబైల్ వుంది.ముక్కలై వుంది. వెళ్లి ఆ ముక్కలను చేతిలోకి తీసుకున్నాడు.అ ముక్కలను ఒక్కటి చేసే పనిలో వున్నాడు...నిమిషాలు గడుస్తున్నాయి...అతని పట్టుదల, ఏకాగ్రత ముందు విధి ఓటమి తల వంచింది.
మొబైల్ ని ఆర్డర్ లో పెట్టాడు. సిమ్ పెట్టాడు, ఆన్ చేసాడు...
అతడు మొబైల్ ఆన్ చేసిన రెండవ నిమిషం మొబైల్ రింగ్ అయింది. కార్తికేయ నుంచి వచ్చిన కాల్ అది.
************************
స్టీఫెన్ మొదటి సారి భయపడ్డాడు...ఆ భయం చావు భయం కన్నా భయంకరంగా అనిపించింది. లాప్ టాప్ లో ఒక్కసారి మెరుపులు కనిపించాయి. మరియస్ప్ప రక్తం కక్కుకుని చనిపోవడం కనిపించింది. అతని ఊహకు అందని విషయం క్షణాల్లో జరిగిపోయింది.
కొద్ది సేపటి క్రితమే తెలిసిన మరో విషయం ప్రణవి కార్తికేయ ఇంట్లో ఆశ్రయం పొందుతుందని.....
వెంటనే అతని క్రిమినల్ బ్రెయిన్ పనిచేయడం మొదలు పెట్టింది. కార్తికేయను ఎదురించడం సాధ్యం కాదన్న విషయం తెలిసింది. ఇప్పుడు కార్తికేయకు చంద్రహాస్ తోడైతే....అగ్ని, గాలి ఒక్కటైతే....నాంపల్లి వైపు చూసి చెప్పాడు.
"నువ్వు కార్తికేయ ఇంటికి వెళ్ళు....అక్కడ ప్రణవి, ముగ్ధను తీసుకుని రా...నీతో పాటు మరి కొందరిని తీసుకువెళ్ళు...కార్తికేయ ఇంటికి చేరుకునేలోగా నువ్వు వాళ్ళని తీసుకుని రావాలి. ఆలస్యమైతే నిన్ను ఆ కార్తికేయ బ్రతకనివ్వడు."
నాంపల్లి వెంటనే బయల్దేరాడు. స్టీఫెన్, మెహతా వైపు చూసి "నువ్వు కార్తికేయ దృష్టిని డైవర్ట్ చేయాలి" లేదంటే కార్తికేయ ఇంటికి త్వరగా చేరుకుంటాడు. ముగ్ధ, ప్రణవి మనచేతిలో వుంటే కార్తికేయ, చంద్రహాస్ లను ఎదురించగలం." చెప్పాడు.
మెహతాకు అది కరెక్టే అనిపించంది. ఓసారి తన చేతిలో వున్న రివాల్వర్ వైపు చూసుకుని బయటకు నడిచాడు.
************
స్టీఫెన్ ఒక్కడే వున్నాడు. ఎదురుగా సంధ్యాజ్యోతి .
"నిన్ను చూస్తోంటే జాలేస్తుంది మిస్టర్ స్టీఫెన్" అతని వైపు చూసి అంది సంధ్య.
ఆశ్చర్యంగా, కోపంగా చూసాడు..."ఎంత ధైర్యం లేకపోతే తన దగ్గర బందీగా వుంది తననే కామెంట్ చేస్తుంది?
"ఓ పని చేయ్....చేసిన తప్పులు ఒప్పుకుని సరెండర్ అవ్వు....బుద్ధిగా కొన్నాళ్ళు జైలులో వుంది ఆత్మకథ రాసుకోవచ్చు...కావాలంటే నీ ఆత్మకథ నేను రాసి పెడతాను" తాపీగా అంది సంధ్య.
స్టీఫెన్ కోపం నషాళానికి అంటింది...రివాల్వర్ తీసి సంధ్య వైపు గురిపెట్టాడు.
*************

No comments: