ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 29 June 2013

.జై షిర్డీ సాయినాధ 
 సప్తమ అంకం..


చేయతగ్గ కార్యాలు..మనష్యుల నియుక్తి, దేవదేవుని యుక్తి.

మందిరాలు, మఠాలు, తీర్ధాలకు వచ్చేవారికై నదివొడ్డున మెట్లు మొదలగునవి నిర్మించేందకు భగవంతుడు వేర్వేరు పనులకు వేర్వేరు భక్తులకు అప్పజెప్పును. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు, ఆ షిర్డిసాయి దేవుడు నన్నిలా సత్చరిత్ర వ్రాయుమని ఆ భాగ్యాన్ని వరాన్ని నాకందించేరు. నేనేంటి, నేను రాయడమేమిటి అసలే అజ్ఞానిని, అన్ని విషయములు పూర్తిగా తెలియనివాడిని ఈ మహత్తర దివ్యమైన పనికి నాకు అర్హత వుందాంటూ చాల సొచించా, సంకోచించా అయితే సాయిబాబాని ప్రార్ధించి వారిచ్చిన అభయంతో, తెగువతో శ్రీ షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రను వ్రాయ సంకల్పించా.. మరి ఆ దేవదేవుడు శ్రీ షిర్డీ సాయిబాబాని వర్ణించగల వారెవ్వరు, వారి జీవిత విశేషాలను సమగ్రంగా తెలుపగలవారెవ్వరు? షిర్డీసాయి కరుణయే అంత కఠినమైన పనిని చేసే శక్తిని యిచ్చింది. ఆ షిర్డిసాయి దయవల్ల నేను వ్రాయ మొదలెట్టాగానే సాయిబాబానే నా గర్వము, అభిజాత్యమును తుడిచేసి వారి కథలను వారే వ్రాసికొనిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవం ఆ షిర్డీ సాయినాధుడికే చెందేను. మనిషిగా పుట్టినప్పటికిని శ్రుతి, స్మృతి (జ్ఞానం, ప్రకాశం) అనే రెండు కనులు లేక ముందుగా సాయి సత్చరిత్రను వ్రాయలేకుంటిని. కాని భగవంతుని దివ్యమైన అనుగ్రహం మూగవానిని మాట్లాడించు, కుంటివానిని పర్వతాలు దాటునట్లు చేయు. ఇచ్చికముతో పనులు చేయించుటలో, నెరవేర్చుకొనుటలో భగవంతుని చాతుర్యం లోక విదితమేగా. హార్మోనియంకు గాని వేణువుకు గాని ధ్వనులు ఎట్లా వచ్చిచేరునో మనకి తెలియదు. కాని ఆ వాద్యాలు వాయించువానికది తెలియును. చంద్రకాంతి ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట స్వయముగా తమవల్ల జరగవు, కానీ చంద్రోదయం వల్ల జరుగు.
మానవజన్మయొక్క ప్రాముఖ్యము
ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు వేల కోట్లాది జీవరాసులను సృష్టించాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగువానిని సృజించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రం, ఆకాశం నందు నివసించు జీవకోటిని సృష్టించెను. పుణ్యం చేసి స్వర్గంకు పోయి వారి వారి పుణ్యఫలం అనుభవించిన పిమ్మట క్రిందకు త్రోసివేయబడుదురు. పాపం చేస్తే నరకానికి పోతారని ప్రతీతీ. అచ్చట తమ పాపాలకు తగినట్టు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్షసాధనంకై అవకాశం పొందెదరు. వారి పాపపుణ్యముల చక్రబంధనం నుండి నిష్క్రమిస్తే వారికి మోక్షం అందే.. మోక్షముగాని మరల మరల పుట్టుక గాని వారు వారు చేసికొనిన కర్మపై ఆధారపడి వుండునన్నది సత్యం.
మానవశరీరముయొక్క ప్రత్యేక విలువ
జీవకోటికి ఆకలి, నిద్ర, భయం, సంభోగం, ఆహారం లాంటివన్ని సామాన్యం. ఇవన్నీ కాకుండా నరులకు మరో శక్తి కూడా కలదు,అదే జ్ఞానము, విజ్ఞానం. దీని సహాయంతోనే మానవుడు భగవత్ సాక్షాత్కారంను పొందగలడు. ఇంకే జన్మనందు ఈ భవ్య ఆవకాశము లేదు. ఈ కారణం చేతనే దేవతలు కూడ మానవజన్మను ఈర్ష్యతో చూచేదరు. వారు కూడ భూమిపై మానవజన్మనెత్తి మోక్షాన్ని సాధించవలెనని కోరేదరు.
మానవజన్మ చాల నీచమైనదని, చీము, రక్తము, మురికితో నిండియుండునని, తుదకు శిథిలమయి రోగమునకు మరణమునకు కారణమగునని కొంతమంది తలుస్తారు. కొంతవరకది నిజమే. ఇన్ని లోటుమాటులున్నప్పటికిని మానవునకు జ్ఞానాన్ని సంపాదించు శక్తి కలదు కాబట్టే మానవ శరీరం మానవ జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిధ్యయని, విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని, అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమును మానవుడు సాధించును. శరీరం మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షాన్ని సంపాదించు అవకాశాన్ని పోగొట్టుకొనెదము కదా. శరీరాన్ని ముద్దుగా పెంచి, విషయసుఖములకు మరిగినచో నరకమునకు వెళ్ళెదము. నడువవలసిన మంచి త్రోవ ఏమిటంటే శరీరమును నశ్రద్ధ చేయకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరువరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంతజాగ్రత్త మాత్రమే తీసికొనవలెను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు లేక అత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.

భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదు ఎందుకనగా భగవంతుని శక్తినవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేకశక్తి నిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, బుద్ధిని మెచ్చుకొనునప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెందెను. అందుచే మానవజన్మ లభించుట గొప్ప అదృష్టము. అన్నిటికంటె గొప్పది శ్రీ షిర్డీ సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేసే ఆవకాశము లభించుట.
మానవుడు యత్నించవలసినది
మానవజన్మ విలువైనదని, తుదకు మరణము తప్పదని, గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రము అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరత్వరగా దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్యకొరకు కెంత ఆతురపడునో, తపిపోయిన పిల్లాడికి తల్లితండ్రులు ఎంతగా వెదక యత్నించునటులే అత్మసాక్షాత్కారం పొందువరకు రాత్రింబవళ్ళు విసుగు విరామం లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను విడిచి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనకు మరి పశువులకు తేడా ఏమి వుండదు.
నడువవలసిన మార్గము
మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గముకై వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువును చేరుట. మతసంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికి, మతగ్రంథములు చదివినను తెలియని ఆత్మసాక్షాత్కారం సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చు. నక్షత్రములన్ని కలిసి యివ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అలాగే మతోపన్యాసములు, మతగ్రంధాలు ఇవ్వలేని జ్ఞానంను సద్గురువు విప్పిచెప్పగలడు. వారి వైఖరి, సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును - మనస్సును స్వాధీనపరచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను-వారిని అనుసరించునప్పుడు వారి పావన జీవితమునుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనస్సుకు ప్రబోధము జేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా యట్టి యోగిపుంగవుడు; సద్గురువు.
........................
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: