ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 26 June 2013

జై షిర్డీసాయినాథా ---విసురజ 

Photo 
(అక్షరాన్ని నిత్యం తన మస్తిష్కపు కోవెల లో దైవంగా భావించే విసురజ ,రాసే ప్రతీ అంశాన్ని ,రచనను తపస్సులా కొనసాగించే వీక్షకాభిమాన రచయిత...ఆ షిర్డీ సాయి నాథుడు సచ్చరితను భక్తీ భావంతో మేన్ రోబో వీక్షకాభిమనుల కోసం, ధారావాహికగా అందిస్తున్నారు.చదివి తరించండి.మీ భక్తిభావాలను,అనుభవాలను మాతో పంచుకోండి.మీ స్పందన తెలియజేయండి. చీఫ్ ఎడిటర్ )
పొద్దు పొడిచి తెల్లవారితేనే జగానికి జనానికి వెలుగు వస్తుంది..విజ్ఞానం బ్రతుకుకు వెలుతరవుతుంది. వినయం జీవితరణంలో కవచమవుతుంది. నడవడిక పెంపకాల సూచికవుతుంది...చివరగా నమ్మకంతో కూడిన విశ్వాసం విశ్వాన్ని శాసించేలా చేస్తుంది..
ఇవన్నీ నేను రాసినవేనా, ఇటువంటివి నేను రాస్తున్నానా అంటే నాకే ఆశ్చర్యమేస్తుంది.. ఆ డౌట్ కి కారణం ప్రజ్ఞ, పరిపక్వత పట్ల మొదట్లో అవగాహన లేక దురుసుగా ఉండేవాడిని, దుందుడుకు స్వభావిగా మా సీతమ్మధార (విశాఖపట్నం) లో పెద్ద పేరు. తేని తగువులు లేవు, తినని దెబ్బలు లేవు అలాగని నా మీద పితూరీలు చెప్పనవాడిని వదిలిన జ్ఞాపకం లేదు.. ఇటువంటి అల్లరిని, దుడుకు మడిసినిని సాధు స్వభావిగా, సహనం, ఓర్పు, నమ్రతల చిరునామాలను అందించి వాటి ఆవశ్యకతను ఔన్నత్యాన్ని తెలియచెప్పిన మిత్రుడుని/ పూజనీయుడిని నిత్యం స్మరణ చేయడం నాకు పరమావిధి.. అటువంటి విశిష్ట మౌని గురించి అందరికి తెలియచెప్పడం నా ధర్మం.. తద్వారా కొందరిలోనైనా మార్పు పల్లవిస్తే పరవశమేగా...ఆ పూజనీయుడు మరెవరో కాదు మన అందరి బంధువు, ఆప్తుడు, మిత్రుడు, పిలిస్తే పలికే దేవుడు, సుచరితా దురంధరుడు, నిత్య అగ్నిహోత్రుడు, పావన రాముడు..... శ్రీ షిర్డీ సాయి బాబా...
కొంతకాలంగా ఎద అలికిడి చేయసాగే, మది మరీ మరీ మనసు పడి మోత మ్రోగించే ఆ షిర్డీ దేముడి సత్చరిత్ర సులభమైన తీరులో విద్యాధికులకు, పామరులకు అందరికీ అర్డమయ్యేటట్టు అందించాలని.. మరి అటువంటి సాహసోపేతమైన చేష్టను క్రియరూపం పట్టించగలనా, రాసి మెప్పించగలనాననే ధర్మ సందేహాలు కాస్త మనసును వెనకకు లాగిన మాట వాస్తవమే. అయినా రాసినవాడు రాయేంచెడివాడు..శ్రీ సాయినాధుడనే నమ్మికతో ముందుకు అడుగు వేస్తున్నా...ఈ శ్రీ షిర్డీ సాయి నాధుడి సత్చరిత్రను "జై షిర్డీసాయినాధా" అనే టైటిల్ తో రాయదలచా. దయచేసి చదివి, చదివించి ఆ షిర్డీ స్వామి వారి అనుగ్రహం పొందండి , నచ్చితే మెచ్చి నను ఆశీర్వదించండి---విసురజ

No comments: