ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 4 September 2013

జై షిర్డీ సాయినాధ by విసురజ
ఇరవైవోకటివ అంకం
FRIDAY...12th July, 2013

................................సద్గురువు లక్షణాలు...
లోకాన ఎందఱో గురువులమని చెప్పుకుని తిరుగుతుంటారు. అందులో కొందరు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. మెచ్చిన శిష్యుల చెవులలో మంత్రాలూది, వారి వద్ద నుంచి ధనం పట్టెదరు. పవిత్రమార్గం, మతం భోదిస్తామని చెపుతారు. అసలు మతమంటే ఏమిటో కూడా చాల మందికి తెలియదు పైగా స్వయంగా వీరిలో చాల మంది పవిత్రులు కారు.
షిర్డీ సాయిబాబా తన గొప్పతనం ఎప్పుడను చూపదలచలేదు. సాయిబాబాకి దేహాభిమానము లేసమాత్రమైన లేదు. కాని భక్తులంటే మిక్కిలి ప్రేమ వుండే. గురువులలో నియత గురువులని అనియత గురువులని చెప్పుదురు. నియత గురువులనగా నియమింపబడినవారు, అనియత గురువులనగా సమయానికి వచ్చి మంచి సలహాలనిచ్చి భక్తుల అంతరంగంలోనున్న సుగుణాన్ని వృద్ధిచేసి మోక్షమార్గం పట్టిస్తారు. నియత గురువుల సహవాసం నీవు నేను వేరు అనే ద్వంద్వాభిప్రాయము పోగొట్టి యోగాన్ని ప్రతిష్ఠించి "తత్వమసి" అగునట్లు చేయు. లోకంలో అనేక విధములైన ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు చాల మంది వున్నారు. కాని మనకి ఎవరైతే సహజస్థితిలో నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపు వునికికి అతీతంగా తీసికొని పోయెదరో వారే సద్గురువులు. షిర్డీ సాయిబాబా అటువంటి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో, వారి యొక్క భూతభవిష్యత్ వర్తమానములన్నిటిని చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానం సమతత్వం వారిలో మూర్తీభవించినవి. దుర్మార్గుల అవసరాలు గూడ తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. వారు మానవ శరీరంతో వున్నప్పటికి, వారికి శరీరమందు గాని, గృహమందుగాని అభిమానం లేకుండే. వారు శరీరధారులవలే కనిపించినా నిజానికి నిశ్శరీరులు, జీవన్ముక్తులు.

బాబాను భగవానునివలే పూజించిన షిర్డీ ప్రజలు పుణ్యాత్ములు. తినుచు, త్రాగుచు, తమ దొడ్లలోను పొలాలలోను పని చేసికొనుచు, వారెల్లప్పుడు సాయిని జ్ఞప్తికి ఉంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప యింకొక దైవమును వారికి తెలియదు. షిర్దిలోని స్త్రీల ప్రేమను, భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు అజ్ఞానులయినప్పటికి ప్రేమతో పాటలను కూర్చుకొని వారికి వచ్చు భాషాజ్ఞానముతో పాడుచుండిరి. వారికి అక్షరజ్ఞానం శూన్యమయినప్పటికి వారి పాటలలో నిజమైన కవిత్వం భావం వుండే. యథార్థమైన కవిత్వం తెలివివలన రాదు. కానది అసలైన ప్రేమ వలన పొంగు. సిసలైన కవిత్వము స్వచ్ఛమైన ప్రేమచే వెలువడును. బుద్ధిమంతులది గ్రహించగలరు. ఈ పల్లె పాటలన్నియు వినదగ్గవి, సేకరింపదగినవి.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।

No comments: