ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 10 October 2014

కవిత: వలపు ముచ్చట్లు


గూటిపడవలో షికారు వెడుతుంటే
చల్లగాలి గిలిగింతలు పెడుతోంది
ముంగురులు వీచేగాలికి ఎగురుతుంటుంటే 
ఒంటిపైన నూలుచీర వుండనంటోంది
చెక్కెలిపైచేయితో నీలవేణి సిగ్గుపడుతుంటే
నీలికన్నుల భామాసుందరి కవ్విస్తోంది 

మధురూహలకై మనసు వేగిరపడుతుంటే 
పరవశంతో తనువు తుళ్లిపడుతోంది
ఓపలేని ఎదసంబరానికి అడ్డుకట్టేద్దామంటే
గూడుకట్టుకున్న మమతావేశం కూడదంటోంది
ఓర్చలేని చిలిపిమనసేమో గిచ్చుతుంటుంటే
గుమ్మడిపువ్వంటి అమ్మాడిసొగసేమో పోనీమంటోంది
నవ్వులరతనాల నజరానాల నీరాజనాలందుకోని
నీకోసం వేచిన నన్నందుకో
విరిపూతావుల తీయనిసుగంధాలే గ్రహించి
నీకోసం వగచే నన్నందుకో
బాలభాస్కరుని పసిడివెలుగులనే అందుకుని
నీకై తపించే నన్నందుకో
నల్లనికేశాల సంధ్యాసుందరిచే సిఫార్సుచేయించుకుని
నీకై ఎదురుచూసే నన్నందుకో
,,,,,,,,,,,,,,,,,
విసురజ

No comments: