ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 12 November 2014

కవిత: నారీ జీవన స్రవంతి

గగనాన్నుంచి చినుకునై కురిసి
అవనిపై సన్నటిపాయగా మారి
ఆపై చిరువాగుగా మారి 
గలగలమని పారే సెలయేటి ధార ఆ స్రవంతి .
అమ్మగర్భాన్నుంచి క్లిష్టంగా బయల్పడి
అతిమురిపెంగా అల్లరిగా ఎదిగి పెరిగి
మెట్టినింటికి వెళ్ళలేక వెళుతూ 

కన్నీటిగోదావరిని పుట్టింట పారించేది వనిత ..
నదిగా మారిన చినుకు పయనిస్తూ
ఎన్నెన్నో బంజరు బీడులను పచ్చగ మారుస్తూ
నదిగా సాగుతూ సాగరాన్ని చేరుతూ
బేధాలు మరిచి సర్వం తనలో చేర్చుకుంటూ
మలినాలని కడిగేస్తూ పునీతం చేస్తూ
జలాక్షతల సాయంతో జలవాహిని స్రవంతిలో
నదిగా పారే గగనధారకు
సాగర సంగమమే ఆఖరి ప్రస్థానం
ఆలిగా మారిన కులవధువు వనిత
సాగాలి జీవనంలో ఎందరినో కలుపుకుంటూ
మంచి భావనల వంతెనపై పయనిస్తూ
చెడుతలపుల్ని కడిగేస్తూ డంబమాడంబరాలను విడుస్తూ
ఎన్నెన్నో ఒడిదొడుకులను దాటుకుని ముందుకెళ్తూ
జీవనయాత్రలో చరిస్తూ భవసాగరమీది తరించడమే
భార్యగా మారిన అతివకు
భవసాగర మీదటమే సిసలైన ప్రయాణం

No comments: